ఆ పోలికలు చాలా అన్యాయం: ప్రియాంక
ముంబై: స్పోర్ట్స్ స్టార్స్ జీవిత కథలు ఆధారంగా రూపొందుతున్నచిత్రాలకు ఆర్థికపరమైన లాభాపేక్షను ముడిపెట్టడం ఏమాత్రం సరికాదని బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అభిప్రాయపడ్డారు. ప్రియాంక చోప్రా- మేరీ కోమ్ ఆదాయాలపై తారతమ్యాలను ఎత్తిచూపుతూ ఓ వర్గం ప్రజలు విమర్శలకు పాల్పడటంతో ప్రియాంక పై విధంగా స్పందించారు.ఆ స్పోర్ట్ స్టార్స్ జీవితాలను మరొకరి జీవితాలతో పోల్చవద్దని ప్రియాంక తన ఆవేదనను వ్యక్తం చేశారు.ఆ చిత్రాలలో ఒక నిగూఢమైన సందేశాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు.
'ఇప్పటివరకూ మేరీ కోమ్ 5 సార్లు ప్రపంచ చాంఫియన్ అనే విషయం ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. సినిమా విడుదలయ్యే వరకూ దానిపై అసలు అవగాహనే ఉండకపోవచ్చు.మేరీ కోమ్ జీవితంలో జరిగిన వాస్తవ పరిస్థితిని తెరపై చూపించాం. అంతకుముందు వచ్చిన 'పాన్ సింగ్ తోమర్' భాగ్ మిల్కా సింగ్' చిత్రాలు చూస్తే ఆ విషయం ప్రతీ ఒక్కరికీ అవగతం అవుతుందన్నారు. దయచేసి వారి జీవితాలకు ఆర్థికపరమైన అంశాలను జతచేయకండి అంటూ ప్రియాంక విన్నవించారు. ప్రస్తుతం ప్రియాంక నటించిన 'మేరీ కోమ్' చిత్రం ఐదు రోజుల్లో దాదాపు 39 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.