
దేవిశ్రీకి అమెరికాలో రెస్పాన్స్ అదుర్స్!!
అఖిలాంధ్ర సినీ అభిమానుల హృదయాలను తన సంగీత బాణీలతో కొల్లగొట్టిన డీఎస్పీ.. అదే మన దేవిశ్రీ ప్రసాద్ అమెరికాలోని అభిమానులను కూడా ఆకట్టుకున్నారు. నెల రోజుల పాటు అమెరికాలోని వివిధ నగరాల్లో ఇచ్చిన ప్రోగ్రాంలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని డీఎస్పీ ఆనందంగా ఉన్నాడు. ''ఏ సంగీతకారుడికైనా.. స్వయంగా అభిమానుల గుండెల నుంచి వచ్చే అభినందనలను తన సొంత చెవులతో వినడమే అద్భుతమైన అనుభూతి. వాళ్ల చప్పట్లు వింటుంటే గుండె పొంగిపోతుంది. అమెరికాలో కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఆ అనుభవం నేను ప్రత్యక్షంగా పొందాను. అక్కడి ప్రజలు ఇచ్చిన సాదరస్వాగతం, నా కార్యక్రమాలకు వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయాను'' అని డీఎస్పీ పేర్కొన్నాడు.
అన్ని వర్గాల ప్రజలు ఒక్కచోట చేరి, తన కార్యక్రమాలకు రావడం చూసి ఎంతో ఆనందించినట్లు చెప్పాడు. భవిష్యత్తులో కూడా భారతీయ కళాకారులు ఇక్కడ అద్భుతమైన కార్యక్రమాలు, మంచి నాణ్యతతో చేయొచ్చని తన షోతో రుజువైనట్లు అక్కడివాళ్లు చెప్పారన్నాడు. ఈ సందర్భంగా తన షోలో పాల్గొన్న గాయకులు, అభిమానులు, కమల్ హాసన్, విజయ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.