కాంట్రాక్ట్ ఎవరిది?
ప్రత్యర్థి మనసు తెలుసుకుని ఎత్తుకు పై ఎత్తు వేయడం అంటే చిన్న విషయం కాదు. తెలివితేటల్లో ఎవరికి వారే అన్నట్లు ఉండాలి. మరి.. తమ తెలివితేటలను ఉపయోగించుకుని ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో అర్జున్, జేడీ చక్రవర్తిల్లో ఎవరు బెస్ట్ అనే విషయం తెలుసుకోవాలంటే ‘కాంట్రాక్ట్’ సినిమా చూడాల్సిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ గొడావత్ సమర్పణలో రంజిత్ గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. సమీర్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ మినీషా లాంబా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రవిశేషాలను దర్శకుడు చెబుతూ -‘‘యాక్షన్ నేపథ్యంలో సాగే ముక్కోణ ప్రేమకథ ఇది.
అర్జున్, జేడీ చక్రవర్తి పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. ఇందులో మొత్తం 6 పాటలుంటాయి. సుభాష్-విశ్వాస్ సంగీత దర్శకులుగా పరిచయం అవుతున్నారు. పాటలు చాలా బాగా వచ్చాయి’’ అని చెప్పారు. రంజిత్ గోగినేని మాట్లాడుతూ -‘‘ఫిబ్రవరి 1 నుంచి హైదరాబాద్, కొల్హాపూర్‌ల్లో జరిపే మూడో షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. మార్చిలో పాటలను, సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఎమ్మెస్ నారాయణ, అలీ, కె.విశ్వనాథ్, గజల్ ఖాన్, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జానీలాల్, ఎడిటింగ్: వెంకటేశ్, ఫైట్స్: నందు, కొరియోగ్రఫి: జాని.