బాలీవుడ్ స్టార్ హీరోలు, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్లపై మీరట్ లోకల్ కోర్టులో హిందూ మహాసభ ఫిర్యాదు చేసింది. ఓ ఛానల్లో ప్రసారం అయిన కార్యక్రమంలో ఈ ఇద్దరు నటులు చెప్పులతో ఆలయంలో ప్రవేశించినట్టుగా చూపించినందుకు గాను, షారూఖ్, సల్మాన్ లతో పాటు ఛానల్ యాజమాన్యంపై కూడా హిందూ మహాసభ కార్యకర్తలు కోర్టులో ఫిర్యాదు చేశారు. జనవరి 18న ఈ కేసు విచారణకు రానుంది. దీంతో బాలీవుడ్ ఖాన్ ద్వయం ఇబ్బందుల్లో పడింది.
వివరాల్లోకి వెళితే ఓ ప్రయివేట్ ఛానల్ లో ప్రసారమవుతున్న 'బిగ్ బాస్ ' చిత్రీకరణలో భాగంగా కాళీ మందిరంలోకి ఈ హీరోలిద్దరూ షూ తో వెళ్లి, సాంప్రదాయాన్ని అవమానించారని హిందూ మహాసభ అధ్యక్షుడు రాజ్పుత్ ఆరోపిస్తున్నారు. పాదరక్షలతో పవిత్ర స్థలంలోకి అడుగుపెట్టడాన్ని ఏమతమూ అంగీకరించదన్నారు. ఈ దృశ్యాలను ప్రసారం చేసిన సదరు చానల్కు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు, కలెక్టరుకు గత ఏడాది డిసెంబర్ 23న ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అందుకే వారిపై చర్యలు తీసుకోవాల్సింది కోరుతూ కోర్టును ఆశ్రయించామని ఆయన తెలిపారు.