
తమిళసినిమా(చెన్నై): ప్రముఖ తమిళ సినీనటుడు జైను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలని చెన్నై సైదాపేట కోర్టు మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. జై గత నెల 21న మద్యం తాగి కారు నడుపుతూ స్థానిక అడయారు బ్రిడ్జి సమీపంలోని గోడను ఢీకొన్నారు. దీనిపై ఆ ప్రాంత ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో జై ఈనెల 3న కోర్టుకు హాజరై చార్జిషీట్ ప్రతిని అందుకున్నారు.
ఈ కేసు గురువారం మేజిస్ట్రేట్ అబ్రహంలింకన్ సమక్షంలో విచారణకు రాగా జై కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ శుక్రవారం కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కూడా జై కోర్టుకు హాజరు కాలేదు. జై అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు కోర్టుకు తెలియజేశారు. దీంతో జైని రెండు రోజుల్లో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టాల్సిందిగా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. జర్నీ, రాజారాణీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా జై సుపరిచితుడు.
Comments
Please login to add a commentAdd a comment