సాక్షి, చెన్నై : కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు–2 సినిమా షూటింగ్‌లో బుధవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దర్శకుడు శంకర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. మృతుల్లో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు, సహాయ దర్శకుడు కృష్ణ, కేటరింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన చంద్రన్ ఉన్నట్లు తెలిసింది. చెన్నై శివారు పూందమల్లిలోని ఈవీపీ స్టూడియోలో భారతీయుడు–2 చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ భారీ క్రేన్‌లతో ప్రత్యేక సెట్టింగ్స్ వేసి చిత్రీకరణ జరుపుతున్నారు.
రాత్రి 9.30 గంటల సమయంలో 150 అడుగులున్న క్రేన్ హఠాత్తుగా కిందకు పడిపోయింది. ఆ సమయంలో సమీపంలోని ఓ టెంటులో దర్శకుడు శంకర్ తన అసిస్టెంట్‌లతో కలిసి మానిటర్‌లో రషెస్ చూస్తుండగా.. ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆ సమయంలో చిత్రహీరో కమల్‌హాసన్ సెట్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక కార్యక్రమాలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించినట్లు సమాచారం.
ప్రమాదం నా మనసును కలచివేసింది: కమల్‌హాసన్
సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంపై కమల్‌హాసన్ ట్విటర్‌లో స్పందించారు. ‘ సెట్స్‌లో జరిగిన ప్రమాదం మనసుని కలచివేసింది. ముగ్గురు సహాయకులను కోల్పోవడం బాధాకరం. నా బాధ కన్నా వారిని కోల్పోయిన కుటుంబాల బాధ ఎన్నోరెట్లు ఎక్కువ’ అని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సాగుభూతిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment