
సినిమా: అందమైన భామలు నటించే చిత్రానికి తీయనైన పేరు పెడితే మరింత బలం చేకూరుతుంది. అలాంటి టైటిల్ త్రిష, సిమ్రాన్ నటించే తాజా చిత్రానికి నిర్ణయించినట్లు సమాచారం. 20 ఏళ్ల క్రితం అంటే 1999లో నటి సిమ్రాన్ నటించిన చిత్రం జోడీ. అందులో మరో అందగత్తె త్రిష ఎంట్రీ ఇచ్చింది. సిమ్రాన్‌కు స్నేహితురాలిగా చిన్న పాత్రలో కనిపించి మాయం అయింది. ఆ తరువాత త్రిష హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. నటి సిమ్రాన్ పెళ్లి చేసుకుని సంసార జీవితంలో మునిగిపోయి నటనకు దూరం అయింది. కొంత కాలం తరువాత రీఎట్రీ ఇచ్చింది. త్రిష టాప్ హీరోయిన్‌గా రాణిస్తూనే ఉంది. అలాంటిది గత ఏడాది నటుడు రజనీకాంత్ హీరోగా నటించిన పేట చిత్రంలో త్రిష, సిమ్రాన్ ఇద్దరూ నటించారు.
అయితే అందులో ఇద్దరూ కలిసి నటించే సన్నివేశాలు చోటు చేసుకోలేదు. కాగా తాజాగా త్రిష, సిమ్రాన్ కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఇద్దరూ అక్కాచెల్లెళ్లుగా నటించడం విశేషం. దీనికి సుమంత్ రాధాకృష్ణన్ దర్శకత్వం విహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు చదురం 2 అనే చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఇతర ప్రాత్రల్లో అభినయ్ వడ్డి , తెలుగు నటుడు జగపతిబాబు, సతీశ్ తదితరులు నటిస్తున్నారు. దీన్ని ఆల్‌ఇన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ ఇటీవల నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన గూర్కా చిత్రాన్ని విడుదల చేసింది. కాగా షూటింగ్ దశలో ఉన్న త్రిష, సిమ్రాన్ చిత్రానికి షుగర్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా చిత్ర టైటిల్ షుగర్ అయినా చిత్రం కథ మాత్రం మంచి కమర్శియల్ ఫార్యులాలో ఉంటుందట. ఇది యాక్షన్ ఎడ్వెంచర్ సన్నివేశాలతో కూడిన చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపాయి. త్రిష, సిమ్రాన్ సాహసాలతో కూడిన యాక్షన్ సన్నివేశాలను చూడడానికి రెడీగా ఉండవచ్చన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment