కమల్ ఇంటికి కరెంట్ కట్
చెన్నై వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన ఫలితంగా హీరో కమల్‌హసన్ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ సూపర్ స్టార్ ఇంటికి కరెంటు కట్ చేసినట్లు చెన్నై వర్గాలు చెబుతున్నాయి. వరద బాధితులను ఆదుకోండి అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేయడం పట్ల కమల్ విమర్శలు చేశారు. పన్నుల రూపేణ ప్రజలు చెల్లిస్తున్న డబ్బు ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు.
అయితే కమల్ చేసిన విమర్శ ప్రజల్లోనూ, అధికార అన్నాడీఎంకేలో కలకలం రేపింది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆర్థిక మంత్రి ఓ.పన్నీర్ సెల్వం ఏకంగా ఆరు పేజీల బహిరంగ ప్రకటనతో కమల్‌పై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు కమల్ ఇల్లు, కార్యాలయం ఉన్న ఆళ్వార్‌పేట ఎల్డామ్స్‌రోడ్డులో విద్యుత్ నిలిపివేశారు. తాను బహిరంగంగా విమర్శించలేదని, ఒక మీడియా మిత్రునికి ఈ-మెయిల్ మాత్రమే ఇచ్చానని 7వ తేదీన కమల్ వివరణ ఇచ్చుకోవడంతోపాటూ క్షమాపణ కోరారు.
ఆ మరుసటి రోజే అధికారులు కమల్ హాసన్ ఇంటికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కమల్‌పై కక్ష సాధించేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారని.. పెద్దల రాజకీయాలకు తాము ఇబ్బంది పడ్డామని ఆళ్వార్ పేట వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.