
అడిగారు... కానీ చేయనన్నా!
డి.సురేశ్‌బాబు... అగ్ర నిర్మాత డి.రామానాయుడు వారసత్వాన్ని అందిపుచ్చుకుని చిత్ర నిర్మాణంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఆయన సోదరుడు వెంకటేశ్ అగ్ర కథానాయకుల్లో ఒకరు. తనయుడు రానా ఇప్పుడు హీరోగా, విలన్‌గా రాణిస్తున్నారు. అయితే మొదట్లో వెంకటేశ్ తరహాలోనే డి.సురేశ్‌బాబును కూడా నటునిగా చూడాలని ఆయన తండ్రి రామానాయుడు ఆశించారు. కానీ సురేశ్‌బాబు తెర వెనుకే ఉండటానికి నిర్ణయించుకున్నారు.
ఇదంతా ఒకప్పటి విషయం. ఆయనకు తాజాగా ఓ బాలీవుడ్ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించడానికి అవకాశం వచ్చింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ హీరోగా ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్ జీవితం ఆధారంగా తీస్తున్న ‘అజహర్’ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం దర్శక-నిర్మాతలు ఆయనను అడిగారట. అందులో నిజానిజాల గురించి అడిగితే... ‘ఆఫర్ వచ్చిన మాట నిజమే. కానీ చేయనన్నా’ అని సురేశ్‌బాబు తెలిపారు.