అది అంత తేలికైన విషయం కాదు!
అది అంత తేలికైన విషయం కాదు!
Published Sun, Feb 23 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM
సినిమా విషయంలో ఎక్కువ కష్టపడేది హీరోనే. పాటలనీ ఫైట్లనీ ఒళ్లు హూనం చేసుకోవాల్సిన పరిస్థితి వారిది. అందుకే పారితోషికం కూడా వారికే ఎక్కువ. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ... మరో కోణంలో ఆలోచిస్తే మాత్రం హీరోయిన్ల కష్టం కూడా సాధారణమైంది కాదని అర్థమవుతుంది. హీరో మహా అయితే... ఏడాదికి రెండు సినిమాలు చేస్తాడు. ఇచ్చిన డేట్స్ ప్రకారం నింపాదిగా షూటింగులు చేసుకుంటూ పోతుంటాడు. ఈ క్రమంలో వారికి కావల్సినంత విశ్రాంతి. కానీ, హీరోయిన్ల పరిస్థితి అలాకాదు. ఏడాదికి నాలుగైదు సినిమాలైనా చేయాలి. ఇచ్చిన డేట్స్‌ని సద్వినియోగం చేసుకుంటూ చకచకా షూటింగులు చేసుకుపోవాలి. కాంబినేషన్స్ సెట్ చేయడం దర్శక, నిర్మాతలకు పెద్ద పరీక్ష.
ఆ విషయంలో వారికి పూర్తిగా సహకరించాలి. ఏ యూనిట్‌నీ ఇబ్బంది పెట్టకూడదు. కొన్ని కారణాలవల్ల అదనపు రోజులు షూటింగ్ చేయాల్సి వస్తే... హీరోయిన్లు అనుభవించే టెన్షన్ వర్ణనాతీతం. ముఖ్యంగా సమంత లాంటి నంబర్‌వన్ హీరోయిన్‌కైతే... ఇక చెప్పేదేముంది! నిజంగా మోయలేనంత బరువే. కానీ.. అంతటి బాధ్యతనీ సునాయాసంగా నెరవేర్చేస్తున్నారు సమంత. చకచకా షూటింగులను పూర్తి చేసుకుంటూ... అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. శనివారంతో ‘మనం’ యూనిట్ నుంచి సెలవు తీసేసుకున్నారామె. ఆ సినిమాకు సంబంధించిన తన పనంతా పూర్తి చేసేశారు.
ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా తన అనుభూతిని తెలిపారు సమంత. ‘‘శనివారంతో ‘మనం’కి సంబంధించిన నా వర్క్ పూర్తయింది. ఆ యూనిట్‌ని వదిలి వెళుతుంటే బాధేసింది. నిజంగా వాళ్లందర్నీ మిస్ అవుతున్నాను. ఆహ్లాదకరంగా సాగిందా షూటింగ్. ప్రస్తుతం వి.వి.వినాయక్ డెరైక్షన్‌లో రూపొందుతోన్న చిత్రం షూటింగ్‌లో ఉన్నా. అలాగే, ఎన్టీఆర్‌తో ‘రభస’(వర్కింగ్ టైటిల్) పాట షూటింగ్‌లో పాల్గొంటా. ఎన్టీఆర్‌తో డాన్సంటే అంత తేలికైన విషయం కాదు కదా’ అని ట్వీట్ చేశారు. నిజంగా సమంత డెడికేషన్‌ని అభినందించాల్సిందే.
Advertisement
Advertisement