
రూ. 200 కోట్ల కలెక్షన్లు వచ్చాయి
ముంబై: కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్న ఆమీర్ ఖాన్ సూపర్ హిట్ సినిమా దంగల్ మరో ఘనత సాధించింది. ఓవర్సీస్లో ఈ సినిమా కలెక్షన్లు 200 కోట్ల రూపాయల మార్క్ దాటింది. ఈ నెల 22 నాటికి విదేశీ మార్కెట్లో దంగల్ 200.65 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
ఇక దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించిన దంగల్ మరో అరుదైన రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ఈ స్పోర్ట్స్ డ్రామా ఆదివారం నాటికి 381.07 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమాకు నిలకడగా కలెక్షన్లు వస్తుండటంతో 400 కోట్ల రూపాయల మార్క్ బిజినెస్‌ను దాటుతుందని భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే 400 కోట్ల రూపాయల కలెక్షన్లు (దేశంలో) సాధించిన తొలి భారతీయ సినిమాగా దంగల్ చరిత్రలో నిలిచిపోతుంది.