ఏ సినిమాలకు సాధ్యంకాని రికార్డుకు చేరువలో..
ముంబై: దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టించిన దంగల్ మరో అరుదైన రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ఆమిర్‌ఖాన్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటి వరకూ 365.87 కోట్ల రూపాయలను వసూలు చేసింది. శనివారం 4.06 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ రోజు (ఆదివారం) సెలవు దినం కావడంతో ఇదే స్థాయిలో కలెక్షన్లు రావచ్చు. ఇదే జోరు కొనసాగితే దంగల్ 400 కోట్ల రూపాయల మార్క్ బిజినెస్‌ను దాటుతుంది. ఇదే కనుక జరిగితే 400 కోట్ల రూపాయల కలెక్షన్లు (దేశంలో) సాధించిన తొలి భారతీయ సినిమాగా దంగల్ చరిత్రలో నిలిచిపోతుంది.
ఇంతకుముందు దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా పీకే, భజరంగీ భాయిజాన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆమిర్ నటించిన పీకే 340.8 కోట్లు, సల్మాన్ ఖాన్ సినిమా భజరంగీ భాయిజాన్ 320.34 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. తాజాగా దంగల్ ఈ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. దేశంలో 300 కోట్ల మార్క్ దాటిన తొలి సినిమా పీకే కాగా, 400 కోట్ల మార్క్ దాటిన తొలి సినిమాగా దంగల్ నిలిచే అవకాశముంది. ఈ రెండు ఆమిర్ ఖాన్ నటించినవి కావడం విశేషం.
ఇక ఓవర్సీస్లోనూ దంగల్ భారీ కలెక్షన్లు రాబడుతోంది. శనివారం నాటికి 190.94 కోట్ల రూపాయలు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చెప్పాడు. విదేశాల్లో ఈ సినిమా కలెక్షన్లు 200 కోట్ల మార్క్ దాటే అవకాశముంది.