తెలుగు సినీ ఇండస్ట్రీలో సంక్రాంతికి ఉన్న క్రేజే వేరు. ఈ పండుగకు మూవీ రిలీజ్ చేసేందుకు ఏడాది ముందుగానే ప్లాన్ చేస్తుంటారు. ఈ పండుగకు ఉన్న మార్కెట్ అలాంటిది. ఆ తర్వాత సినిమా వాళ్లకు బాగా కలిసొచ్చే పండుగలు దసరా, దీపావళి. ఈ రెండు ఫెస్టివల్స్కు సైతం పెద్దఎత్తున చిత్రాలు రిలీజ్కు సిద్ధమైపోతాయి. అలాగే ఈ ఏడాది కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఈ పండుగల బాక్సాఫీస్ బరిలో హిట్గా నిలిచిందెవరు? అభిమానులను నిరాశపరిచిందెవరు? మీరు ఓ లుక్కేయండి.
ఈ ఏడాది అక్టోబర్లో టాలీవుడ్ నుంచి దసరాకు పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. దీనికి కారణం బాక్సాఫీస్ బరిలో కాంతార చాప్టర్-1 నిలవడమే. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రావడంతో తెలుగు చిత్రాలు రిలీజ్ చేసే సాహసం చేయలేదు. ఆ తర్వాత శశివదనే, మిత్రమండలి, ఎర్రచీర, కానిస్టేబుల్ లాంటి చిన్న సినిమాలు అలా వచ్చి.. ఇలా వెళ్లాయి. వీటిపై పెద్దగా బజ్ లేకపోవడంతో వారంలోపే బాక్సాఫీస్ వద్ద కనుమరుగయ్యాయి.
ఇక రెండో వారంలో 'అరి', 'కానిస్టేబుల్', 'మటన్ షాప్ వంటి కొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కానిస్టేబుల్, మటన్ షాప్ అసలు ఊసే లేదు. కొద్దొ గొప్పో 'అరి' మూవీ మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. కేవలం మౌత్ టాక్‌తోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. అరిషడ్వర్గాలుఅనే ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక దివాళీ విషయానికొస్తే వరుసగా మూడు తెలుగు చిత్రాలు రిలీజ్ చేశారు. అందులో కిరణ్ అబ్బవరం కె-ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటితో పాటు కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ కూడా పోటీపడింది. వీటిలో కె-ర్యాంప్ ఫర్వాలేదనిపించగా.. తెలుసు కదా మూవీతో సిద్ధు మరోసారి నిరాశపరిచాడు. ఈ రెండు తెలుగు సినిమాలు దీవాళీ బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయాయి. ఇక డ్రాగన్ హీరో డ్యూడ్ కూడా దీపావళికి వందకోట్ల మార్క్ అందుకుంది.
ఈ అక్టోబర్ నెల చివర్లో రాజమౌళి బాహుహలి ది ఎపిక్, రవితేజ మాస్ జాతర బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. రెండు భాగాలను కలిపి దర్శకధీరుడు ప్రేక్షకులను సరికొత్త థ్రిల్ అందించారు. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న మాస్ మహారాజా ఫ్యాన్స్కు మాత్రం మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. మాస్ హీరోగా పేరున్న రవితేజ అదే పంథాలో రావడం.. కొత్తదనం లేకపోవడంతో మరో డిజాస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఓవరాల్గా చూస్తే ఈ దసరా, దీపావళి తెలుగు సినిమాలకు కలిసి రాలేదనే చెప్పాలి. డబ్బింగ్ సినిమాలైనా కాంతార చాప్టర్-1, డ్యూడ్ బాక్సాఫీస్ వద్ద సత్తాచాటగా.. టాలీవుడ్ చిత్రాలు మాత్రం వందకోట్ల మార్క్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. ఈ లెక్కన అక్టోబర్ మన తెలుగు సినిమాలకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇక టాలీవుడ్ సినీ ప్రియుల ఆశలన్నీ వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ సినిమాలపైనే. పొంగల్ బాక్సాఫీస్ మూవీస్ మనశంకరవరప్రసాద్‌గారు, ది రాజాసాబ్, అనగనగ ఒక రాజు వంద కోట్ల మార్క్ చేరుకుంటాయోమో వేచి చూడాల్సిందే.


