ఆ తలనొప్పి వాళ్లదే! | Danush chit chat with Sakshi cityplus | Sakshi
Sakshi News home page

ఆ తలనొప్పి వాళ్లదే!

Published Sun, Feb 1 2015 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

ఆ తలనొప్పి వాళ్లదే!

ఆ తలనొప్పి వాళ్లదే!

అభిమానులలాగే తానూ మామయ్యతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని హీరో ధనుష్ అంటే.... ‘క్రమశిక్షణ, హార్డ్‌వర్కే ఎవరినైనా సక్సెస్ వైపు నడిపిస్తాయి కానీ కుటుంబ నేపథ్యం కాదు’ అంటోంది హీరోయిన్ అక్షర హాసన్. ‘షమితాబ్’ చిత్రం ప్రమోషన్ కోసం ఇద్దరూ నగరానికి వచ్చిన సందర్భంగా ‘సిటీ ప్లస్’ పలకరించింది.  ఆ చిట్‌చాట్ వారి మాటల్లోనే...
 
ధనుష్: ‘మా మావయ్య (రజనీ కాంత్)తో నటించరా?’ అని చాలా మంది అడుగుతుంటారు. నిజంగా అలాంటి అవకాశం వస్తే అది అద్భుతం. నేనూ అందుకోసమే ఎదురు చూస్తున్నాను. ఇద్దరికీ సరిపడా కథ వస్తే నా భార్య సౌందర్యతో కలిసి కూడా నటిస్తానేమో. భార్యే హీరోయిన్ అయితే మీరు వివాదాలేమీ సృష్టించరు (నవ్వుతూ).    
 
 అందుకే సొంత బ్యానర్...
నా సోదరుడు (సెల్వరాఘవన్), నేను ఇండస్ట్రీలోకి రావడానికి పడ్డ ఇబ్బందులు నాకు గుర్తున్నాయి. అందుకే ‘వండర్‌బార్ ఫిల్మ్స్’ బ్యానర్‌ను స్థాపించాం. దీని ద్వారా దర్శకులు, నటులు, మ్యూజీషియన్స్, ఎడిటర్స్‌ను సైతం పరిచయం చేశాం.
 
 నాకెందుకా భారం..!
 ఈ సినిమాలో నా లుక్ గురించి ఎలాంటి కేర్ తీసుకున్నారని అడుగుతున్నారు. అయినా అదంతా నాకెందుకు చెప్పండి? మా స్టైలిస్ట్ తలనొప్పి కదా (నవ్వుతూ). ఇదే సమాధానం నా డ్రీమ్‌క్యారెక్టర్ ప్రశ్నకూ వర్తిస్తుంది. ఫీల్డ్‌కి వచ్చిన కొత్తలో అలాంటివి చేయాలి? ఇలాంటివి చేయాలి? అనే ఆలోచనలు ఉండేవి. ఇప్పుడు నా కోసం మంచి పాత్రలు సృష్టించే పని చేసేవాళ్లు చేస్తున్నారు. ఇక నాకెందుకా భారం చెప్పండి?( నవ్వుతూ)
 
 పూర్తిగా కొత్త సబ్జెక్ట్...
 షమితాబ్ ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్. ఓ మూడు రకాల వ్యక్తిత్వాలున్న ముగ్గురు వ్యక్తుల మధ్య కథ. డబ్బింగ్ తొలుత పూర్తి చేసి ఆ తర్వాత షూటింగ్ చేయడం దగ్గర్నుంచి... ఎన్నో ప్రయోగాలు చేశాం. ఇక ఇండియన్ సినిమాకు లెజండ్రీ పర్సనాలిటీ అయిన అమితాబ్‌తో నటించడం గొప్ప ఎక్స్‌పీరియన్స్. ఆయనతో షూటింగ్ చేస్తున్నంత సేపూ నేర్చుకుంటూనే ఉన్నాను. లొకేషన్‌లోకి వచ్చాక తానొక లెజెండ్ అని కాక, యాక్టర్ మాత్రమే అని మనం గుర్తు పెట్టుకునేలా ప్రవర్తిస్తారు.
 
 భాష నేర్చుకున్నాకే....
 అక్షర: అసిస్టెంట్ డెరైక్టర్‌గా కొన్నేళ్లు పనిచేశాక... ముంబయిలో ఒక నాటకంలో క్యారెక్టర్ ప్లే చేశాను. అప్పుడే నటనపై ఆసక్తి ఏర్పడింది. అలా నటుడిగా మారాను. డెరైక్షన్, యాక్షన్.. దేని కష్టం దానిదే. హార్డ్ వర్క్‌తో దేనిలోనైనా పరిపూర్ణత సాధించగలం.
 
 నన్ను నేను నిరూపించుకోవాలి
 ఫ్యామిలీలో అందరూ సినిమారంగంలో ఉన్నవారే. అయితే నేనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. జయాపజయాలు పూర్తిగా వ్యక్తిగతం. వాటికి నాదే బాధ్యత. క్రమశిక్షణ, హార్డ్‌వర్క్... ఇవే నన్ను సక్సెస్ చేస్తాయి తప్ప కుటుంబ నేపథ్యం కాదని నా నమ్మకం.
 
 తెలుగులోనూ ఓకే...
 తెలుగులో నటించడానికి అభ్యంతరం ఏముంటుంది? అయితే బాలీవుడ్‌లో ఇప్పుడే ప్రవేశించాను. హిందీ భాష కాస్త కష్టంగానే ఉంది. ముందు భాష మీద పట్టు సాధించాలి. అప్పుడే మరింత బాగా నటించగలం. బాలీవుడ్‌లో తొలి చిత్రమే అమితాబ్, ధనుష్ వంటి మంచి ఆర్టిస్ట్‌లతో నటించే అవకాశం రావడం వల్ల ఎంతో నేర్చుకున్నా.
 - సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement