
బోస్... సన్నాఫ్ ఇండియా!
పవన్‌కల్యాణ్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తానని దాసరి నారాయణరావు ప్రకటించి చాన్నాళ్లయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా పనులు చురుగ్గా జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. దాసరి సొంత నిర్మాణ సంస్థ తారకప్రభు ఫిల్మ్స్ పతాకంపై ఇటీవల ఫిల్మ్‌చాంబర్‌లో ‘బోస్’ అనే టైటిల్ రిజిస్టర్ అయింది. ‘సన్నాఫ్ ఇండియా’ అనేది ఉపశీర్షిక. ఈ టైటిల్ పవన్ కల్యాణ్‌తో చేయనున్న సినిమా కోసమేనని సమాచారం.
దేశభక్తి కథతో ఈ సినిమా నిర్మించాలని దాసరి భావిస్తున్నారట. స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని భోగట్టా. డాలీ దర్శకత్వంలో పవన్ నటించనున్న ‘కాటమరాయుడు’ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరి.. ‘కాటమరాయుడు’ తర్వాత త్రివిక్రమ్ చిత్రం తెరకెక్కుతుందా? దాసరి సినిమా పట్టాలెక్కుతుందా? అనేది వేచి చూడాలి.