భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం | Dear Comrade Music Festival event | Sakshi
Sakshi News home page

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

Published Sat, Jul 20 2019 12:38 AM | Last Updated on Sat, Jul 20 2019 5:18 AM

Dear Comrade Music Festival event - Sakshi

డ్యాన్స్‌ చేస్తున్న విజయ్‌, నవీన్‌ ఎర్నేని, యశ్‌ రంగినేని, విజయ్‌ దేవరకొండ,చెర్రీ , రష్మికా మండన్నా, రవిశంకర్‌

‘‘కామ్రేడ్‌ అంటే అర్థం ఏంటి? మన కష్టాలలో, మన సక్సెస్‌లో, మన ఫైట్‌లో మనతో ఉండేవాడే కామ్రేడ్‌. నా చిన్ననాటి ఫ్రెండ్స్, సినిమా ఫ్రెండ్స్‌ అందరూ నా కామ్రేడ్సే’’ అని విజయ్‌ దేవరకొండ అన్నారు. విజయ్‌ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా నూతన దర్శకుడు భరత్‌ కమ్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్లపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్‌ చెరుకూరి, యశ్‌ రంగినేని నిర్మించారు. జస్టిన్‌ ప్రభాకర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్‌ కానుంది.

ఈ చిత్రం ‘మ్యూజిక్‌ ఫెస్టివల్‌ ఈవెంట్‌’ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘ప్రతిరోజూ ఎవరి కష్టాలు వాళ్లకి ఉంటాయి. ‘భయం వదిలేస్తే ఎవరు అడ్డుకున్నా జయము నీదేలే..’ అనే లైన్‌ మా సినిమా థీమ్‌ సాంగ్‌లో ఉంటుంది. నాకు నచ్చిన వాక్యం అది. మ్యూజిక్‌ ఫెస్టివల్‌ చేద్దాం అనే ఐడియా వచ్చినప్పుడు భయమేసింది. భయమున్నా చేశాం. ఇక్కడి వరకూ వచ్చాం. యాక్టర్‌ అవ్వాలి అనుకున్నప్పుడు భయమేసింది. మనందరికీ భయాలుంటాయి. దాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం.

నవీన్‌గారు, రవిగారు, మోహన్‌గారు, యశ్‌గారు వీళ్లే మా ధైర్యం’’ అన్నారు. రష్మికా మండన్నా మాట్లాడుతూ – ‘‘మన ఇంట్లో అమ్మ, అక్క, గర్ల్‌ఫ్రెండ్‌ ఇలా అందరూ గౌరవం కోసం స్ట్రగుల్‌ అవుతున్నారు. మీరెప్పుడైనా మీ ఇంట్లో అమ్మాయిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగారా? మా ఇంట్లో నేను హీరోయిన్‌ అవ్వాలి అన్నప్పుడు ‘నో’ అన్నారు. నువ్వెందుకు అంత కష్టపడాలి? ఇంట్లో ఉండొచ్చు కదా అన్నారు. కానీ నాకు నచ్చిన దానికోసం పోరాడాను. పోరాడి మీ అందరి ముందు నిలబడ్డాను.

ఇష్టమైన దానికోసం పోరాడితే మీరూ (ప్రేక్షకులు) నా పొజిషన్‌లో ఉండొచ్చు. అందరూ మీకు నచ్చినదాని కోసం పోరాడండి. నచ్చింది సాధిస్తే చాలా బావుంటుంది. రొమాన్స్, యాక్షన్‌ కోసం కాదు మేమిస్తున్న మెసేజ్‌ కోసం గర్ల్స్‌.  అందరూ ఈ సినిమా తప్పకుండా చూడాలి. నా మాట కచ్చితంగా వినండి. ఈ సినిమా చూడండి. ఎందుకంటే ఇదో అద్భుతమైన సినిమా. నా మాట నిజంగా వింటారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ఈ కార్యక్రంలో సినిమాలోని పాటలన్నింటికీ చిత్రబృందంతో కలసి స్టేజ్‌ మీద ప్రదర్శించారు. యాంకర్లతో కలసి తానూ అప్పుడప్పుడూ యాంకరింగ్‌ చేయడంతో పాటు విజయ్‌ దేవరకొండ డ్యాన్సులు చేసి అలరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement