వేద మంత్రాలు, ఆనందబాష్పాలు, అతిథుల ఆశీర్వాదాల మధ్య బుధవారం ఇటలీలోని లేక్ కోమోలో గల విల్లా డెల్ బాల్బియనెల్లో దీప్‌వీర్ (దీపిక–రణ్‌వీర్) పెళ్లి ఘనంగా జరిగింది. కొంకణి కుటుంబ సంప్రదాయం ప్రకారం ‘చిత్రపుర్ సరస్వత్’ పద్ధతిలో దీపికా, రణ్‌వీర్ పెళ్లి చేసుకున్నారు. దీపికా కుటుంబ సంప్రదాయం ఇది. మ్యారేజ్ థీమ్ ‘వైట్’ అని భోగట్టా. తెలుగు, బంగారు వర్ణం కలగలసిన చీరను దీపికా, కాంచీపురం షేర్వాణీని రణ్‌వీర్ ధరించారట. అతిథులందరూ తెలుపు రంగు దుస్తుల్లో హాజరయ్యారట.
వేదిక కూడా తెల్లటి పువ్వులతో, పరదాలతో ఆహ్లాదకరమైన వాతావరణం తలపించిందని సమాచారం. భారతీయ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 7 గంటలకు పెళ్లి జరిగిందట. గురువారం రణ్‌వీర్ కుటుంబ సంప్రదాయం ప్రకారం ‘ఆనంద్ కరాజ్’ పద్ధతిలోనూ ఈ దంపతుల పెళ్లి జరుగుతుందని తెలిసింది. పెళ్లి వేడుకల కోసం శనివారం ఇటలీ వెళ్లిన దీప్‌వీర్ వరుసగా మెహందీ, సంగీత్ వేడుకలతో బిజీ అయ్యారు. సంగీత్ కార్యక్రమం ‘పంజాబీ’ టచ్‌తో సాగిందట. ఈ గానా భజానా కార్యక్రమంలో ఉద్వేగానికి గురైన దీపికాను రణ్‌వీర్ ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారట.
అలాగే ‘ఫూల్ మడ్డీ’ (కొంకణీ సంప్రదాయం) పేరుతో జరిపిన కార్యక్రమంలో ఉంగరాలు మార్చుకునే సమయంలో రణ్‌వీర్ మోకాళ్ల మీద కూర్చుని, ఉంగరం తొడిగినప్పుడూ దీపిక ఎమోషన్ అయ్యారట. ఇదే కార్యక్రమంలో దీపికా తండ్రి ప్రకాశ్ పదుకోన్ అల్లుడు రణ్‌వీర్ కాళ్లు కడిగి, కొబ్బరికాయ చేతికి అందించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు 30 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారట. ఫొటోలు తీయొద్దని అతిథులను కోరడంతో పాటు బహుమతులు వద్దని, ఒకవేళ ఇవ్వాలనిపిస్తే ‘లివ్ లవ్ లాఫ్’ ఫౌండేషన్‌కు విరాళం ఇవ్వవలసిందిగా కోరారట. దీపిక నిర్వహిస్తున్న సేవా సంస్థ ఇది.
Comments
Please login to add a commentAdd a comment