ప్రపంచ టాప్-10లో బాలీవుడ్ హీరోయిన్
ప్రపంచంలో భారీ పారితోషకం తీసుకుంటున్న టాప్-10 హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ నిలిచింది. గతేడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది జూన్ 1 వరకు అత్యధిక ఆర్జన గల హీరోయిన్ల జాబితాను ఫోర్బ్స్ మేగజైన్ మంగళవారం విడుదల చేసింది.
ఈ జాబితాలో హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఆమె వరుసగా రెండో ఏడాది టాప్లో నిలవడం విశేషం. జెన్నిఫర్ లారెన్స్ దాదాపు 308 కోట్ల రూపాయలు సంపాదించింది. కాగా గతేడాదితో పోలిస్తే ఆమె ఆదాయం తగ్గింది. తాజా జాబితాలో మెలిస్సా మెక్కార్తీ రెండో స్థానంలో ఉంది. ఆమె ఆదాయం దాదాపు 221 కోట్ల రూపాయలు. ఇక పదో స్థానంలో నిలిచిన దీపిక గతేడాది దాదాపు 67 కోట్ల రూపాయలు ఆర్జించింది. దీపికకు బాలీవుడ్లో మంచి డిమాండ్ ఉండటంతో పాటు హాలీవుడ్లోనూ నటిస్తోంది.