
మా బ్రేకప్ కలలో కూడా జరగదు!
షారుక్ ఖాన్ అంటే దీపికా పదుకొనేకి ప్రత్యేకమైన అభిమానం. ఆయన హీరోగా రూపొందిన ‘ఓం శాంతి ఓం’ ద్వారానే కథానాయికగా బాలీవుడ్‌కి పరిచయమయ్యారు దీపిక. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘హ్యాపీ న్యూయర్’ చిత్రాల్లో నటించారు. ఆ విధంగా వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. కానీ, ఇప్పుడా స్నేహం బ్రేకప్ కావడం ఖాయమని బాలీవుడ్‌వారు అంటున్నారు. దానికి కారణం షారుక్ నటించిన ‘దిల్‌వాలే’, దీపిక నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ ఒకే రోజున విడుదల కానుండటమే. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. దాంతో షారుక్, దీపిక మధ్య పోటీ ఉంటుందని, ఇప్పటికే ఈ బ్యూటీ మీద షారుక్ కోపంగా ఉన్నారని వార్త ప్రచారమవుతోంది.
ఈ వార్తకు దీపిక స్పందిస్తూ - ‘‘షారుక్‌కి నాపై కోపమా? వినడానికే హాస్యాస్పదంగా ఉంది. మేమిద్దరం మంచి స్నేహితులం. మా బ్రేకప్‌ని ఎవరైనా చూడాలంటే అది కలలో కూడా సాధ్యం కాదు. నేను నటించిన సినిమా విడుదల తేదీ నా చేతుల్లో ఉండదు. నిర్మాత ఎప్పుడనుకుంటే అప్పుడు విడుదలవుతుంది. అది షారుక్‌కి కూడా బాగా తెలుసు. అలాంటప్పుడు నాపైన ఆయనకు కోపం ఎందుకు ఉంటుంది? మా గురించి లేనిపోని వార్తలు ఎన్ని కల్పించినా, మా ఈక్వేషన్‌ని ఏమీ చేయలేరు’’ అన్నారు.