ప్రాంతాలు వేరైనా... ప్రేక్షకుల టేస్ట్ ఒక్కటే!
‘నకిలీ’, ‘డా. సలీం’ చిత్రాల తర్వాత ‘బిచ్చగాడు’గా తెలుగు ప్రేక్షకులముందుకొచ్చారు కథానాయకుడు విజయ్ ఆంటోనీ. శశి దర్శకత్వంలో ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ను శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి ‘బిచ్చగాడు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం గురించి చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ -‘‘ ‘బిచ్చగాడు’ చిత్రానికి తమిళంలో ఎంత ఆదరణ వచ్చిందో తెలుగులోనే అదే ఆదరణ లభిచింది.
తెలుగు, తమిళ ప్రేక్షకుల టేస్ట్ ఒక్కటే. ఇకపై నా చిత్రాలన్నీ తెలుగులో కూడా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నా. ఈ చిత్రకథ విన్నప్పుడు ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశా. హీరోగా నటించడంతో పాటు సంగీతం, ప్రొడక్షన్ చూసుకుంటున్నా కష్టమనిపించడం లేదు. ‘సైతాన్’, ‘యముడు’ చిత్రాల్లో నటిస్తున్నా. వీటి తర్వాత ‘డా. సలీమ్’ సీక్వెల్‌లో నటిస్తా’’ అని తెలిపారు. ‘‘టైటిల్ చూసి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే టెన్షన్ ఉండేది. అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు’’అని నిర్మాత పద్మావతి పేర్కొన్నారు. మాటల రచయిత బాషాశ్రీ పాల్గొన్నారు.