
బాక్సాఫీస్ అంబరంలో... భావుక సుమగంధం
మూడుదశాబ్దాల కాలంలో 90 చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలందించిన భావుక రచనామూర్తి పెన్ను మూసింది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రి - ప్రముఖ సినీ రచయిత గొర్తి సత్యమూర్తి ఇక లేరు. శోభన్‌బాబు ‘దేవత’ నుంచి చిరంజీవి ‘అభిలాష’, ‘ఛాలెంజ్’, వెంకటేశ్ ‘చంటి’ దాకా ఎన్నో హిట్లిచ్చిన సత్యమూర్తి సోమవారం తెల్లవారుజామున చెన్నైలో అనారోగ్యంతో మరణించారు.
ఇవాళ అంత్యక్రియలు
రచయిత సత్యమూర్తి మృతికి సినీ ప్రము ఖులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నటుడు, రాజకీయ నేత చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ హైదరాబాద్ నుంచి చెన్నై ప్రత్యేకంగా వెళ్ళి, భౌతికకాయానికి నివాళు లర్పించారు. గాయకులు ఎస్పీ బాలు, చరణ్, నిర్మాత ‘ఎడిటర్’ మోహన్, దర్శకుడు రాజా, నటి ఛార్మి తదితరులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంగళవారం సాయంత్రం సత్యమూర్తి భౌతిక కాయానికి చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తొలి సినిమా కథ (‘దేవత’)తోనే ఒక రచయిత జూబ్లీహిట్ అందుకోవడం అరుదే. ఇక, డైలాగ్ రైటర్‌గా తొలి చిత్రమే (‘బావామరదళ్ళు’) శతదినోత్సవ చిత్రమై, హాలులో డైలాగులకు ఈలలు పడడం మరీ అరుదు. ఆ రెండు ఘనతలూ సాధించి, తక్కువ రాసి, ఎక్కువ మెప్పు పొందిన స్క్రీన్‌రైటర్‌గా గుర్తుంటారు జి. సత్యమూర్తి.
సినిమాలకు నవలల పాస్‌పోర్‌ట...
సత్యమూర్తి చదివింది సైన్‌స. చేసింది టీచర్ ఉద్యోగం. స్థిరపడింది మాత్రం రచనా రంగంలో. అందులోనూ - తన ముక్కు సూటితనానికీ, ముక్కోపితనానికీ సరిపడని కృత్రిమమైన సినీ రంగంలో. ఒక్క మాటలో రచన ఆయనకొక తీరని దాహం. భావా వేశం ఆయన ఇంధనం.\
టీచర్‌గా పని చేస్తూ, ఆయన రాసిన కథలు, నవలలు ‘ఆంధ్రప్రభ’ వీక్లీ పోటీల్లో బహుమతులు తెచ్చాయి. సత్యమూర్తి శైలి, ఆయన రాసే పాత్రల మానసిక స్థితి, అంతర్వేదన, అద్భుతమైన వర్ణన చదివితే ఒక కొడవటి గంటి, ఒక గోపీచంద్, ఒక వడ్డెర చండీ దాస్ స్ఫురిస్తారు. కావాలంటే, ఆయన పిల్లలు ఆ మధ్య మళ్ళీ ముద్రించిన ‘చైత న్యం’ నుంచి ‘పవిత్రులు’, ‘పునరంకితం’, ‘ఎదలోయల నిదురించే’, ‘దిగంబర అంబరం’, ‘అధర గరళం’ లాంటి నవలలు చదవండి. ఆ నవలలే మద్రాస్ లోని దర్శకుల నుంచి, నిర్మాత ‘యువచిత్ర’ మురారి నుంచి ఫోన్ వచ్చేలా చేశాయి.
సూపర్‌హిట్ సినిమాల స్టార్ రైటర్...
అలా సత్యమూర్తి రాసిన తొలి సినీకథ - బాక్సా ఫీస్ ‘వెల్లువొచ్చి (తెలుగు సినీ) గోదారమ్మ వెల్లాకిల్లా పడిన’ రామానాయుడు ‘దేవత’. అక్కడ నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసు కున్నది లేదు. శోభన్‌బాబు (బావా మరదళ్ళు), కృష్ణ (కిరాయి కోటిగాడు), చిరం జీవి (అభిలాష, ఛాలెంజ్, జ్వాల, ఖైదీ నంబర్ 786), బాలకృష్ణ (బంగారు బుల్లోడు, భలే దొంగ, నారీ నారీ నడుమ మురారి), మోహన్‌బాబు (పెదరాయుడు), వెంకటేశ్ (శ్రీనివాస కల్యాణం, చంటి) - ఇలా హీరోలందరికీ ఆయన కలం కాసులు కురిపించింది. అలా దర్శకులు కోదండ రామిరెడ్డి, రవిరాజా, నిర్మాతలు కె.ఎస్. రామారావు, ‘విజయ’బాపినీడు, అర వింద్, ఎమ్మెస్ రాజు, రచయితలు యండ మూరి, పరుచూరి లాంటి వారెందరికో ఆత్మీయుడు, ఆస్థాన మిత్రుడూ అయ్యారు.
పాటలు రాశారు...డెరైక్షన్ చేశారు...
మాస్ హిట్స్‌తో పాటు నిన్నటి తరానికి ‘మాతృ దేవోభవ’, ‘పుణ్యస్త్రీ’, ‘ముత్యమంత ముద్దు’ లాంటి మనసు కదిలించే కథలకూ అక్షరాలు పొదిగిన ఈ భావుకుడు - ఈ తరానికి మ్యూజిక్ డెరైక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తండ్రిగా ఒదిగిపోయాడు. కానీ, ఇవాళ దేవిశ్రీ బాణీలతో పాటు, మాటలూ కూరుస్తున్నారంటే- అది తండ్రి రచనా వారసత్వమే. కావాలంటే, కృష్ణ నటించిన ‘కంచు కాగడా’లో రాళ్ళపల్లి వేసిన పాత్ర పలికే విప్లవ గీతఖండికలు (రచన సత్య మూర్తి) చూడండి. తమిళ డబ్బింగ్ ‘సింధుభైరవి’లో సుహాసిని పాడే ‘పాడలేను పల్లవైనా...’ పాట వినండి. ప్రభాస్ ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’లో వచ్చే భక్తిగీతం ‘మొరవినరా ఓ గోపీకృష్ణా...’ గుర్తు తెచ్చుకోండి. సినిమా మత్తు, ఒత్తిడిలో ఆరోగ్యం చెడినప్పుడు మృత్యువు ముంగిట దాకా వెళ్ళి, వెనక్కి తిరిగొచ్చిన ఈ రచనా చిరంజీవి దర్శకుడిగానూ 3 సినిమాలు అందిం చారు. రైల్లో రేప్ నిజజీవిత ఘటన ఆధారంగా ‘దాదర్ ఎక్స్‌ప్రెస్’, మద్యపాన నిషేధంపై భానుచందర్ ‘చైతన్యం’, ఫ్యామిలీ డ్రామాగా సుమన్ ‘బావగారు’ అలా వచ్చినవే.
మూలాలు మరవని మనిషి...
సత్యమూర్తి అంటే- చెన్నై వడపళనిలో ధనలక్ష్మీ కాలనీ గుర్తొస్తుంది. ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా వెదురుపాకలో పుట్టి, రామచంద్రా పురం, మచిలీ పట్నాల్లో చదువుకున్న ఈ పల్లెటూరి పెద్ద మనిషి మహా నగరానికి వెళ్ళినా మూలాలు మాత్రం మర్చిపోలేదు.
స్వగ్రామంలో వెదురుపాకలో ఇల్లు వదులు కోలేదు. పండగ ఉత్సవాలకు కుటుంబంతో వెళ్ళడం మానుకోలేదు. పిల్లలకెంత పేరొ చ్చినా, అక్కడ ప్రదర్శన ఇప్పించడం మర్చి పోలేదు. అత్తవారి ఊరు అమలాపురం వదల్లేదు. తల్లి గోదారి ఒడ్డున ఉన్నట్లే, పెరట్లో కొబ్బరిచెట్ల కింద మంచం వేసుక్కూర్చొని, వచ్చినవాళ్ళతో కథలు, సాహిత్యం గురించే మధ్యాహ్నవేళ సత్యమూర్తి ముచ్చట్లాడిన ఆ దృశ్యాలు మిత్రులెందరికో ఇక ఎప్పటికీ జ్ఞాపకాలే. - రెంటాల జయదేవ
‘‘మాకు ముగ్గురు పిల్లలు. మా ఆవిడకు మాత్రం నలుగురు (నాతో కలిపి). ఆమె న్యూక్లియస్. నేను, నా పిల్లలు ఆమె చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు. ఆమె లేకపోతే ఓ యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ లేడు. ఓ మధుర గాయకుడు సాగర్ లేడు. ఓ ఎమ్మార్‌క (టౌన్ ప్లానింగ్) పద్మినీ ప్రియదర్శిని లేదు. అంతెందుకు సత్యమూర్తి అనేవాడే లేడు. ఆవిడ నాలో సగం కాదు... కాదు... ముప్పావువంతు... ఆమె - నా శ్రీమతి శిరోమణి’’.
- శ్రీమతి గురించి స్వర్గీయ జి. సత్యమూర్తి