
మెగాఫోన్ పట్టనున్న ధనుష్?
చాలా మంది ఒక వృత్తిలో రాణించడానికే పడరాని అవస్థలు పడుతుంటారు. అలాంటిది నటన, గీతరచయిత, గాయకుడు, నిర్మాత ఇలా పలు శాఖల్లో రాణించి శభాష్ అనిపించుకోవడం సాధారణ విషయం కాదు. అలాంటి అరుదైన బహుముఖ ప్రజ్ఞాశాలిల పట్టికలో నటుడు ధనుష్‌ను చేర్చవచ్చు. అసలు నటుడిగానే పనికిరాడు అని ఎగతాళికి గురైన నటుడు ధనుష్. తుళువదో ఇళమై చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ధనుష్‌ను ఆ చిత్రం విడుదల తరువాత ఇలాంటి వాళ్లంతా హీరోగా నిలబడతారా? అని పరిహాసం ఆడినవారు లేకపోలేదు.
అయితే తొలి చిత్రంతోనే సంచలన విజ యం సాధించి ఆ తరువాత నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు తిరుగులేని కథానాయకుడిగా ఎదిగారు. రాంజానా, షమితాబ్ చిత్రాలతో బాలీవుడ్‌లోనూ సక్సెస్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆడుగళం చిత్రంతో నటుడిగా జాతీయ అవార్డును, కాక్కాముట్టై చిత్రంతో నిర్మాతగా జాతీయ అవార్డును అందుకున్న ధనుష్ వై దిస్ కొలవెరి డీ పాటతో గాయకుడిగా, గీత రచయితగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ఇలా నటుడిగా గాయకుడిగా, గీతరచయితగా, నిర్మాతగా విజయపథంలో పయనిస్తున్న ధనుష్ తాజాగా మరో అవతారం ఎత్తనున్నారన్న ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
అదే దర్శకుడి అవతారం. ధనుష్‌లో దర్శకత్వం వహించాలన్న కోరిక చాలా కాలంగా ఉంది. అది దాన్ని ఇప్పుడు నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ధనుష్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటుడు రాజ్‌కిరణ్ ప్రధాన పాత్ర పోషించనున్నారని, ఇతర నట వర్గం, సాంకేతిక బృందం ఎంపిక జరుగుతోందని ప్ర చారం జరుగుతోంది. అయితే ఇందులో ధనుష్ నటిస్తారా? లేదా?అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈయన గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా చిత్రంలో నటిస్తున్నారు.