దీపావళికి కలుస్తా - ధనుష్
‘‘తొలిసారి ద్విపాత్రాభినయం చేశా. అన్ని వర్గాలకూ నచ్చే చిత్రమిది. తమిళంలోలానే తెలుగులో కూడా పాటలు హిట్టవుతాయనే నమ్మకం. ఉంది. మళ్లీ దీపావళికి కలుస్తా’’ అని ధనుష్ అన్నారు. ఆయన హీరోగా ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కొడి’. త్రిష, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహిని సమర్పణలో నిర్మాత సి.హెచ్.సతీశ్ కుమార్ ‘ధర్మయోగి’గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
సంతోష్ నారాయణన్ స్వరపరిచిన గీతాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సి.హెచ్.సతీశ్ కుమార్ మాట్లాడుతూ - ‘‘ధనుష్ చేసిన రెండు పాత్రలు పూర్తి విభిన్నంగా ఉంటాయి. దీపావళి కానుకగా తెలుగులో 500 థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నాం. నాకు సహకరిస్తున్న నిర్మాత మల్కాపురం శివకుమార్‌కి థాంక్స్’’ అన్నారు. నిర్మాతలు కె.యల్.దామోదర ప్రసాద్, వంశీకృష్ణ, రాజ్ కందుకూరి పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్య శాస్త్రి.