Diwali gift
-
మనకు రెండు వందే సాధారణ్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్ల తర్వాత అదే తరహాలో సిద్ధమవుతున్న వందే సాధారణ్ రైళ్లు వచ్చే నెలలో పట్టాలెక్కబోతున్నాయి. వందేభారత్ రైళ్లు పూర్తి ఏసీ కోచ్‌లతో ఉండగా, ఇవి నాన్ ఏసీ కోచ్‌లతో నడిచే సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు. వందేభారత్ రైళ్లలో టికెట్ ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో పేద ప్రజలు వాటిలో ప్రయాణించడానికి ఇష్టపడటం లేదు. ఈ వెలితిని దూరం చేయాలన్న ఉద్దేశంతో దాదాపు అదే రూపంతో, ఇంచుమించు అంతే వేగంతో నడిచేలా కేంద్ర ప్రభుత్వం వందే సాధారణ్ పేరుతో ఈ రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధమైన తొలి రైలును పశ్చిమ రైల్వేకు కేటాయించారు. అది రెండు రోజుల క్రితం ముంబైకి చేరుకుంది. దాన్ని ఢిల్లీ–ముంబై మధ్య నడిపే యోచనలో అధికారులున్నారు. ఇప్పటికే వందే సాధారణ్ రైళ్ల కోసం ఐదు మార్గాలకు రైల్వే బోర్డు అనుమతించింది. ఇందులో హైదరాబాద్–న్యూఢిల్లీ కూడా ఉండటం విశేషం. మరో 13 మార్గాలలో నడిపేందుకు అధికారులు ప్రతిపాదించారు. వాటికి అనుమతి రావాల్సి ఉంది. ఆ జాబితాలో హైదరాబాద్–నాగర్‌కోయల్ సర్విసు కూడా ఉండటం విశేషం. వెరసి తెలంగాణకు రెండు వందేసాధారణ్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. పుష్పుల్ పద్ధతిలో.. తొలి రెండు విడతలలో పట్టాలెక్కిన వందేభారత్ రైళ్లు తెలుపు రంగుపై నీలి చారలతో ఆకట్టుకున్నాయి. మూడో విడతకొచ్చేసరికి కాషాయం–నలుపులతో కూడిన మరింత ఆకర్షణీయ కలర్ కాంబినేషన్ ప్రత్యక్షమైంది. ఇప్పుడు వందే సాధారణ్ రైళ్లు కూడా కాషాయ–నలుపు కాంబినేషన్‌తో వస్తున్నాయి. వందేభారత్ తరహాలోనే ఇవి కూడా పుష్పుల్ ఇంజన్లతో నడుస్తాయి. అయితే, వందేభారత్‌లో ఇంజిన్లు విడిగా ఉండవు. రైలులోనే అంతర్భాగంగా ఉంటాయి. వందే సాధారణ్లో మాత్రం డబ్లూపీ–5 లోకోమోటివ్లను ముందు ఒకటి వెనక ఒకటి అమరుస్తారు. 130 కి.మీ. గరిష్ట వేగం.. డబ్ల్యూపీ–5 లోకోమోటివ్‌లు గంటకు 200 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటా యి. కానీ, వందే సాధారణ్ రేక్ వేగాన్ని తట్టుకునే 130 కి.మీ.వేగాన్ని మాత్రమే తట్టుకుంటాయి. ఇక ట్రాక్ సామర్థ్యం కూడా చాలా ప్రాంతాల్లో అంతే ఉంది. దీంతో ఈ రైలు గరిష్ట వేగం గంటకు 130 కి.మీ. 2004లో రైల్వే జన్సాధారణ్ పేరుతో రైళ్లను ప్రారంభించారు. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే వేగంగా వెళ్లే ఈ రైళ్లు పూర్తిగా అన్ రిజర్వ్డ్ కోచ్‌లతో ఉంటాయి. కానీ, అవి సరిగా నడవలేదు. ఇప్పుడు వాటిని రీప్లేస్ చేస్తున్నట్టుగా వందే సాధారణ్ పేరుతో రైళ్లను ప్రారంభిస్తుండటం విశేషం. ఈ రైలులో రెండు ఇంజన్లతోపాటు 12 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 8 జనరల్ కంపార్ట్మెంట్ కోచ్‌లుంటాయి. ప్రతి కోచ్‌లో సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీట్ వద్ద ఫోన్ ఛార్జింగ్ పాయింట్లు, మడత స్నాక్ టేబుల్స్, లగేజీ ర్యాక్, అగ్ని నియంత్రణ వ్యవస్థ ఉంటాయి. సెమీ పర్మనెంట్ కప్లర్స్ వ్యవస్థ వల్ల కుదుపులు తక్కువ. ఈ రైళ్లు 8.36 నిమిషాల్లో 110 కి.మీ. వేగాన్ని అందుకుంటాయి. 130 కి.మీ. వేగాన్ని 9.2 నిమిషాల్లో అందుకుంటాయి. అనుమతి పొందిన మార్గాలు ఇవీ.. ఢిల్లీ– ముంబై ఢిల్లీ – పట్నా ఢిల్లీ – హౌరా ఢిల్లీ – హైదరాబాద్ గువాహటి – ఎర్నాకులం పరిశీలన జాబితాలో ఉన్న రూట్లలో కొన్ని హైదరాబాద్ – నాగర్‌కోయల్ దర్బంగా– లూథియానా ముంబై–చాప్రా ముంబై–రాక్సౌల్ ముంబై–జమ్మూతావి దర్బంగా–అహ్మదాబాద్ కోల్‌కతా–పోర్బందర్ వారణాసి–దర్బంగా సార్సా–అమృత్సర్ మెంగళూరు–కోల్‌కతా గువాహటి–జమ్మూతావి -
ఒకేరోజు 75వేల మందికి ఉద్యోగాలు.. ప్రధాని మోదీ దీపావళి గిఫ్ట్
న్యూఢిల్లీ: ఈ ఏడాది దీపావళికి దేశవ్యాప్తంగా 75వేల మంది యువతకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దివాళీకి రెండు రోజుల ముందు శనివారం వారితో వర్చువల్‌గా సమావేశమై వివిధ అంశాలపై మాట్లాడనున్నారు. 75వేల మంది యువతకు ప్రభుత్వ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. అదే రోజు వారికి ఉద్యోగ నియామక పత్రాలు(అపాయింట్మెంట్ లెటర్స్) అందించనున్నారు ప్రధాని మోదీ. ప్రధాని స్పెషల్ గిఫ్ట్ అందుకునే యువత.. రక్షణ, రైల్వే, హోం, కార్మిక, ఉపాధి శాఖలు, తపాలా విభాగం, సీఐఎస్ఎఫ్, సీబీఐ, కస్టమ్స్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి కేంద్ర మంత్రులు సైతం ఈ వర్చువల్ సమావేశానికి హాజరుకానున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ ఒడిశా నుంచి, ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా గుజరాత్ నుంచి, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చండీగఢ్ నుంచి, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మహారాష్ట్ర నుంచి హాజరుకానున్నారు. అలాగే.. ఎంపీలందరూ వారి వారి పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి హాజరుకానున్నారు. ఇదీ చదవండి: ముందస్తు దీపావళి కాంతులు: ఐటీ ఉద్యోగులకు తీపి కబురు -
వైరల్ వీడియో: తల్లిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడికి సర్ప్రైజ్ గిఫ్ట్
-
తల్లిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడికి సర్ప్రైజ్ గిఫ్ట్
భోపాల్: తన చాక్లెట్లు దొంగిలించి దొరక్కుండా దాచి పెడుతోందంటూ తల్లిపై ఓ మూడేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మాటలు సైతం సరిగా రాని వయసులోనే పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఆలోచన చేసిన ఆ బుడ్డోడికి దీపావళి ముందే వచ్చేసింది. ఏకంగా మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆ పిల్లాడికి సైకిల్ గిఫ్ట్‌గా పంపించారు. పోలీసులు తీసుకొచ్చి ఇచ్చిన ఆ సైకిల్‌పై చిన్నోడి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తల్లిపై ఫిర్యాదు చేస్తున్న మూడేళ్ల హమ్జా వీడియో చూసిన తర్వాత.. అతడి ధైర్యానికి మెచ్చిన హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా.. దివాళి గిఫ్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ మరుసటిరోజునే చిట్టి సైకిల్‌ను బాలుడికి పంపించారు. పోలీసు అధికారులు మంగళవారం సాయంత్రం హమ్జా ఇంటికి వెళ్లి సైకిల్‌తో పాటు చాక్లెట్లు అందించారు. వాటిని చూసిన ఆ చిన్నోడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదీ చదవండి: మా అమ్మ చాక్లెట్లు దొంగిలించింది.. అరెస్టు చేయండి.. పోలీస్ స్టేషన్లో బుడ్డోడి వీడియో వైరల్ -
దీపావళి కానుక.. 3 శాతం డీఏ పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛనుదారులకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) ప్రకటించింది. జూలై 1, 2021 నుంచి అమలులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ, పింఛనర్లకు మూడు శాతం డీఆర్ ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. డీఏ, డీఆర్ వల్ల కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70 కోట్లు భారం పడనుంది. 47.14 లక్షల కేంద్ర ఉద్యోగులు, 68.62 లక్షల పింఛనర్లు లబ్ధి పొందనున్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది కరువు భత్యం నిలిపివేసిన విషయం విదితమే. ఈ ఏడాది జూలైలో పునరుద్ధరిస్తూ 17% నుంచి 28 శాతానికి పెంచారు. తాజా పెంపుతో అది 31 శాతానికి చేరుకుంది. మూడంచెల పర్యవేక్షణ పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపీ) అమలుకు మార్గం సుగమమైంది. గురువారం భేటీ అయిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) రూ.100 లక్షల కోట్ల విలువైన పీఎం గతిశక్తికి ఆమోదం తెలిపింది. మూడంచెల పద్ధతిలో దీన్ని పర్యవేక్షించనున్నట్లు కేంద్రం పేర్కొంది. పీఎం గతిశక్తి మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలో అంతర్ మంత్రిత్వశాఖల సహకారంతో పాటు అంతర్ విభాగాల సహకారం ఓ గేమ్ చేంజర్ కానుందని తెలిపింది. పీఎం గతిశక్తి ని ప్రధాని 13న ప్రారంభించారు. రాబోయే పాతికేళ్ల అభివృద్ధికి ఈ ప్రణాళికతో పునాది వేస్తున్నట్లు చెప్పారు. -
పాక్ ప్రజలకు దీపావళి గిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికగా తక్షణ సాయం అందించే భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇండియాలో వైద్యం కోసం ఆర్జీ పెట్టుకున్న పాక్ ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం ఆమె ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న వారందరికీ మెడికల్ వీసాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఉదయం ట్విట్టర్ లో ఆమె ఈ విషయం తెలిపారు. అర్హులైన వారందరికీ తక్షణమే వీసాలు మంజూరు చేస్తున్నట్లు ఆమె ట్వీట్ లో తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా పాక్ ప్రజలకు వీసా జారీచేయటం చాలా క్లిష్ణమైన సమస్యగా విదేశాంగ శాఖ భావిస్తుంటుంది. కానీ, సుష్మా చొరవతో అది చాలా సులభతరంగా మారింది. ఆ మధ్య కంటి కేన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారికి, ఎముకల సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తికి, కాలేయ సమస్యలతో బాధపడుతున్న మరో ఇద్దరికి మెడికల్ వీసాలు జారీ చేయాలని పాకిస్థాన్‌లోని భారత హై కమిషన్‌ను ఆమె ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ట్విట్టర్ ద్వారా ఆమె దృష్టికి వచ్చిన అన్ని రకాల సమస్యలను ఆమె పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. On the auspicious occasion of Deepawali, India will grant medical Visa in all deserving cases pending today. @IndiainPakistan — Sushma Swaraj (@SushmaSwaraj) October 19, 2017 -
జవాన్లకు కేంద్రం దీపావళి కానుక
న్యూఢిల్లీ: దేశంలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే సాయుధ, పారామిలటరీ బలగాలకు కేంద్రం దీపావళి కానుక అందించింది. శాటిలైట్ ఫోన్లు వాడుకున్నందుకు జవాన్లు ప్రతి నెలా చెల్లిస్తున్న రూ.500 చార్జీలను నేటి నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్ సిన్హా ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఫోన్ల కాల్ చార్జీలను నిమిషానికి రూ.5 నుంచి రూ.1కి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. జవాన్లు తమ కుటుంబ సభ్యులతో మరింత ఎక్కువ సమయం మాట్లాడటానికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. తాజా నిర్ణయం వల్ల కేంద్రంపై రూ.3 నుంచి 4 కోట్ల భారం పడుతుందన్నారు. -
సింగం ఈజ్ బ్యాక్!
భయం లేదు.. చిక్కులెన్ని ఎదురైనా ముందడుగు వేసే వీరుడు.. పిడుగల్లే వచ్చే పోలీస్.. నరసింహం అలియాస్ సింగం మళ్లీ వస్తున్నాడు. సింహంలా గర్జించడానికి సిద్ధమయ్యాడు. హరి దర్శకత్వంలో మాస్ పోలీసాఫీసర్ నరసింహంగా హీరో సూర్య నటిస్తున్న చిత్రం ‘సింగం-3’. ‘యముడు’, ‘సింగం’ చిత్రాల తర్వాత ‘సింగం’ ఫ్రాంచైజీలో రూపొందుతోన్న మూడో చిత్రమిది. దీపావళి కానుకగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. నవంబర్ 7న టీజర్ విడుదల చేయనున్నారు. అనుష్క, శ్రుతీహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ - ‘‘సింగం సిరీస్‌లో గత రెండు సినిమాల కంటే పవర్ఫుల్ కథతో ఈ సినిమా రూపొందుతోంది. నవంబర్ చివరి వారంలో పాటల్ని, డిసెంబర్ 16న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
దేవాదాయ శాఖలో పోలీసు విజిలెన్స్
► ఏసీపీ, ఏఎస్పీ స్థాయి అధికారులతో ప్రత్యేక బృందం ► ఆక్రమణల తొలగింపునకు కలెక్టర్, ఎస్పీల సహకారం ► మంత్రివర్గ ఉపసంఘ కీలక నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖలో అవినీతి, అక్రమాలను నియంత్రించటంతో పాటు పాలనాపరంగా కొత్త విధానాలకు అవకాశం కల్పించేలా మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేవాదాయ శాఖకు సంబంధించి ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం రెండో సమావేశం గురువారం జరిగింది. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాసయాదవ్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దే వాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, జాయింట్ కమిషనర్లు కృష్ణవేణి, శ్రీనివాసరావు ఇందులో పాల్గొన్నారు. కమిటీలోని మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకాలేదు. ప్రత్యేక వింగ్...: దేవాలయాల్లో అడ్డూఅదుపూ లేకుండా అక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం విజిలెన్స్ విభాగం ఉన్నా అది అత్యంత బలహీనంగా మారింది. ఆ అధికారులకు ఇతర బాధ్యతలుండటంతో తనిఖీలు కూడా సాధ్యం కావటం లేదు. ఈ నేపథ్యంలో అదనపు ఎస్పీ స్థాయి పోలీసు అధికారి ఆధ్వర్యంలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ముగ్గురు సబ్ఇన్స్పెక్టర్లు, ఐదుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏసీపీ స్థాయి అధికారిని దేవాదాయ శాఖ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమిస్తారు. భూముల రక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థ... ఆలయాలకు వేల ఎకరాల భూములున్నా చాలా వరకు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటిల్లో వెలసిన అక్రమ నిర్మాణాల తొలగింపు ఆ శాఖ వల్ల కావటం లేదు. రెవెన్యూ భూముల్లో ఉన్న ఆక్రమణల తొలగింపు ఎలా జరుగుతుందో దేవాదాయ శాఖలో కూడా ఆ తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సహకారం తీసుకుని ఆక్రమణలు తొలగించేందుకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. వివిధ కోర్టుల్లో దాఖలయ్యే వ్యాజ్యాలను పరిశీలించేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. ‘ధూప దీప నైవేద్యం’ పరిధికి మరిన్ని గుళ్లు రాష్ట్రంలో 1805 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద నెలకు రూ.1.08 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. జిల్లాల విభజన నేపథ్యంలో మరికొన్ని ఈ పథకం కిందకు తేవాలని నిర్ణయించారు. ఇటీవల ప్రభుత్వం సర్వశ్రేయోనిధికి 50 కోట్లు కేటాయించినందున వాటికి ఆ పథకాన్ని వర్తింపజేస్తారు. అర్చకుల వేతనాలపై దాటవేత... అర్చకులు, దేవాలయ ఉద్యోగుల వేతనాలను క్రమబద్ధం చేసే లక్ష్యంగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. కానీ రెండో సమావేశంలోనూ దీన్ని పక్కనపెట్టేశారు. అధికారుల కమిటీ విధానాలను ఖరారు చేసి ఉపసంఘం ముందుంచింది. మరిన్ని వివరాలు కావాలంటూ గురువారం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. 653 ఆలయాలకు చెంది ఐదున్నర వేల మంది అర్చకులు, ఉద్యోగులకు దీనితో లబ్ధికలగాలి. మిగతా ఆలయాల్లోని సిబ్బంది విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే కోణంలో సీఎం ఉన్నట్టు తెలియటంతో కమిటీ దాన్ని పక్కనపెట్టినట్టు సమాచారం. దీపావళి కానుకగా శుభవార్త అందుతుందని వేలమంది అర్చకులు, ఉద్యోగులు ఎదురుచూసి నిరాశకు గురయ్యారు. మరోసారి ఉద్యమానికి సన్నద్ధం కావాలన్న డిమాండ్ రావటంతో కొద్ది రోజులు ఓపిక పడతామంటూ జేఏసీ నేతలు వారించారు. -
దీపావళికి కలుస్తా - ధనుష్
‘‘తొలిసారి ద్విపాత్రాభినయం చేశా. అన్ని వర్గాలకూ నచ్చే చిత్రమిది. తమిళంలోలానే తెలుగులో కూడా పాటలు హిట్టవుతాయనే నమ్మకం. ఉంది. మళ్లీ దీపావళికి కలుస్తా’’ అని ధనుష్ అన్నారు. ఆయన హీరోగా ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కొడి’. త్రిష, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహిని సమర్పణలో నిర్మాత సి.హెచ్.సతీశ్ కుమార్ ‘ధర్మయోగి’గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సంతోష్ నారాయణన్ స్వరపరిచిన గీతాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సి.హెచ్.సతీశ్ కుమార్ మాట్లాడుతూ - ‘‘ధనుష్ చేసిన రెండు పాత్రలు పూర్తి విభిన్నంగా ఉంటాయి. దీపావళి కానుకగా తెలుగులో 500 థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నాం. నాకు సహకరిస్తున్న నిర్మాత మల్కాపురం శివకుమార్‌కి థాంక్స్’’ అన్నారు. నిర్మాతలు కె.యల్.దామోదర ప్రసాద్, వంశీకృష్ణ, రాజ్ కందుకూరి పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్య శాస్త్రి. -
దీపావళి కానుక
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకను ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ఏడు శాతం పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు 18 లక్షల మందికి వర్తించేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు సీఎం ఓ పన్నీరు సెల్వం ఆదేశాలు జారీ చేశారు. * ఉద్యోగులకు ఏడు శాతం డీఏ పెంపు * 18 లక్షల మందికి వర్తింపు * సీఎం పన్నీరు సెల్వం ఆదేశం వారిలో బయలుదేరింది. అలాగే రాష్ట్రంలో నెలకొ న్న పరిస్థితులు, మాజీ ముఖ్యమంత్రి జయలలిత కటకటాల్లోకి వెళ్లడం, ఓ పన్నీరు సెల్వం నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో డీఏ పెంపు నిర్ణయం ఇప్పట్లో అమలయ్యేనా? అన్న ప్రశ్న బయలుదేరింది. ఈ క్రమంలో శుక్రవారం సచివాలయంలో మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహ న్ వర్గీస్ సుంకత్, సలహాదారు షీలా బాలకృష్ణన్‌తో సీఎం పన్నీరు సెల్వం సమావేశమయ్యారు. డీఏ పెంపుపై చర్చించారు. అమ్మ(జయలలిత) అడుగు జాడల్లో నడుస్తున్న ఈ ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ఓ పన్నీరు సెల్వం ప్రకటించారు. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీటుగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ పథకాల్ని సక్రమంగా అమలు చేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని ప్రశంసించారు. ప్రభుత్వం, ప్రజల కోసం శ్రమిస్తున్న ఉద్యోగులకు డీఏను ఏడు శాతం పెంచుతున్నామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్‌దారులు, కుటుంబం పెన్షన్‌దారులు, ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న స్థానిక సంస్థలు, అంగన్వాడీ, గ్రామ అసిస్టెంట్లు, పౌష్టికాహార పథకం తదితర విధుల్లో ఉన్న 18 లక్షల మంది ఉద్యోగులకు ఈ డీఏ పెంపు వర్తిస్తుందని వివరించారు. ఈ ఏడాది జూలై నుంచి పెంపు వర్తింప చేస్తున్నామని ప్రకటించారు. ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం మీద 1558.97 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా తమకు డీఏ పెంచడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశారుు. పండుగ కానుకగా ఈ పెంపును ప్రకటించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
హెల్త్‌కార్డుల మార్గదర్శకాలు జారీ
శుక్రవారం అర్ధరాత్రి జీవోలు సాక్షి, హైదరాబాద్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల నగదురహిత వైద్యానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. గత రెండేళ్లుగా వివిధ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపినా... ఉద్యోగ సంఘాల అభ్యంతరాలతో చర్చలు విఫలమవుతూ వచ్చాయి. అయితే గత రెండు మూడురోజులుగా ఆయా సంఘాలు, ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులతో జరిపిన ముమ్మర చర్చల నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఉద్యోగుల హెల్త్‌కార్డులకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాత్రి 8 గంటల సమయంలో సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కొండ్రు మురళి, ఈ శాఖకు చెందిన ఐఏఎస్ అధికారులతో సుమారు గంటసేపు ఉద్యోగ సంఘాలు చర్చించాయి. అనంతరం జీవో 171, 174, 175, 176లను విడుదల చేశారు. జీవోలను కాన్ఫిడెన్షియల్‌గా పెట్టారు. ఈ వివరాలను శనివారం సీఎం అధికారికంగా ప్రకటించనున్నందునే జీవోలను కాన్ఫిడెన్షియల్‌గా పెట్టామని అధికారులు చెబుతున్నారు. కేసు తీవ్రతను బట్టే... చెల్లింపులు : దీపావళి కానుకగా ప్రభుత్వం చెప్పుకుంటున్న ఈ హెల్త్‌కార్డుల పథకంలో ఉద్యోగుల డిమాండ్లన్నీ పూర్తిగా తీర్చలేదు. అయితే మధ్యేమార్గంగా వెళ్లినట్లు తెలుస్తోంది. ఏదైనా అనారోగ్యానికి చికిత్స నిమిత్తం తాము గరిష్టంగా రెండు లక్షలు మాత్రమే చెల్లిస్తామని... దీనికి అదనంగా అయితే సదరు ఉద్యోగస్తుడే భరించాలని ప్రభుత్వం ఇన్నాళ్లూ చెబుతూ వచ్చింది. అయితే ఉద్యోగ సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే తాజా మార్గదర్శకాల్లో... కేసు తీవ్రతను, వైద్యుల సిఫారసులను బట్టి రెండు లక్షల పరిమితిని సడలించి చికిత్సకయ్యే పూర్తి ఖర్చును చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఇది కేసుల వారీగా ఉంటుంది. అంటే రెండు లక్షల వ్యయపరిమితి కొనసాగుతుంది. అయితే ఈ సడలింపునకు అనుమతించే క్రమంలో చికిత్సకు ఆటంకం కలగకుండా చూస్తామని, ఖర్చు రెండు లక్షల పరిమితి దాటిందని ఆసుపత్రులు చికిత్సను నిలిపివేయకుండా చర్యలు తీసుకుంటామని, వారికి ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటాయని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ ఉన్నాతాధికారి ఒకరు శుక్రవారం రాత్రి సాక్షితో మాట్లాడుతూ చెప్పారు. -
దీపావళి కానుకగా సీఎంకు ఉల్లిగడ్డలు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేత విజయ్ జోలీ సోమవారం ఓ వినూత్నమైన కానుకతో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నివాసానికి సోమవారం చేరుకున్నారు. కిలో వంద రూపాయల విలువైన ఉల్లిగడ్డలతో నిండిన బుట్టను ఆమెకి కానుకగా ఇవ్వడానికి వచ్చినట్లు ఆయన చెప్పారు. 20 కిలోల ఉల్లిపాయల బుట్టతో పాటు మిఠాయిడబ్బాను దీపావళి కానుకగా తీసుకొచ్చానని తెలిపారు. వారం రోజులుగా షీలాదీక్షిత్ ఉల్లిపాయలు తినడం లేదన్న సంగతి తెలిసి ఈ విధంగా వచ్చానన్నారు. ఉల్లి ధర ఆకాశాన్ని అంటడంతో తాను ఉల్లితినడం మానేశానని ముఖ్యమంత్రి గతంలో చెప్పిన మాటలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఎద్దేవా చే శారు. ధరల పెరుగదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని,పండుగలు చప్పబడిపోతున్నాయని ఆయన చెప్పారు. ప్రజల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం కోసం తాను కానుకగా ఉల్లిపాయలు, మిఠాయిని తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. విజయ్ జోలీ గత అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోటీచేసి ఓడిపోయారు. వినూత్నమైన ప్రచారశైలిలో ప్రచారం నిర్వహించడం ఆయన ప్రత్యేకత. 125 మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లిపాయల అమ్మకం తక్కువ ధరకు ఉల్లిపాయలను నగరవాసులకు అందించడం కోసం ప్రభుత్వం ఉల్లిపాయలను విక్రయించే 125 వ్యాన్లను నగరంలో మోహరించారు. ఈ మొబైల్ వ్యాన్ల ద్వారా కిలో ఉల్లిగడ్డలను 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. -
'అత్తారింటికి దారేది'కి అదనంగా మరికొన్ని సన్నివేశాలు
పవన్ కళ్యాణ్ అభిమానులకు దీపావళి బహుమతిగా నిర్మాతలు మరికొన్ని సన్నివేశాలను అత్తారింటికి దారేది చిత్రానికి కలుపనున్నట్టు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. వంద కోట్ల మార్కును చేరుకునేందుకు పరుగులు పెడుతున్న టాలీవుడ్ చిత్రం అత్తారింటికి దారేది చిత్రానికి అదనంగా ఆరు నిమిషాల నిడివి ఉండే సన్నివేశాలను కలుపనున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రం 71 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టిందని వార్తలు వెలువడ్డాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సాధిస్తున్న విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. దీపావళి సందర్భంగా అభిమానులను సంతోష పరుచడానికి మరి కొన్ని సన్నివేశాలను చిత్రానికి కలుపుతున్నాం. పండగ సెలవుల్లో అభిమానులు ఈ చిత్రాన్ని వీక్షించే విధంగా అక్టోబర్ 31 నుంచి ఏర్పాటు చేస్తున్నాం అని ప్రసాద్ తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానులను ఈ సన్నివేశాలు అకట్టుకునే విధంగా ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అత్తారింటికి దారేది చిత్రం సెప్టెంబర్ 27 తేదిన విడుదలైంది. ఈ చిత్రంలో సమంత, ప్రణీత, బోమన్ ఇరానీ, నదియాలు నటించారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక
-
దీపావళి కానుకగా 8.56శాతం డీఏ!
వచ్చే నెల నుంచి కరువు భత్యం మంజూరుకు సీఎస్ హామీ ఐఆర్‌పై సీఎంతో చర్చిస్తామన్నారు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ దీపావళి కానుకగా వచ్చే నెల నుంచి 8.56 శాతం కరువు భత్యం (డీఏ) మంజూరుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పి.కె. మహంతి సుముఖత వ్యక్తం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. పదో వేతన సంఘం సిఫారసులు అమల్లోకి వచ్చే వరకూ 45 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని వేతన కమిషన్ చైర్మన్ పి.కె.అగర్వాల్‌కు, సీఎస్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించిన అనంతరం సమాఖ్య ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల నుంచి 8.56 శాతం డీఏ ఇస్తామని, ఐఆర్ విషయంలో ముఖ్యమంత్రితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చారని సమాఖ్య ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, కో చైర్మన్ నరేందర్‌రావు తెలిపారు. హామీ ఇచ్చిన సీఎస్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ‘గత కొంతకాలంగా ఇతర కారణాల వల్ల ఉద్యోగ లోకం సమస్యలపై దృష్టి పెట్టలేకపోయింది. చివరకు బుధవారం సమాఖ్య ద్వారా అన్ని సంఘాల ప్రతినిధులమంతా పీఆర్సీ చైర్మన్‌ను క లిశాం. గత జూలై ఒకటో తేదీ నుంచి వర్తించేలా 45 శాతం ఐఆర్ ఇవ్వాలని కోరాం. అనంతరం సీఎస్‌ను కలిసి 45 శాతం ఐఆర్ ప్రకటించాలని, తక్షణమే డీఏ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాం..’ అని చెప్పారు. తాము చర్చించి వచ్చిన కొద్దిసేపటికే డీఏకి సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖకు కూడా పంపించారని తెలిపారు. ఐఆర్, ఇతర డిమాండ్ల విషయమై ముఖ్యమంత్రితో చర్చించి ఉద్యోగులకు సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని సీఎస్ చెప్పారన్నారు. పదోన్నతుల కోసం డిపార్ట్మెంటల్ ప్రమోషన్ల కమిటీ (డీపీసీ)లను వేయాలన్న తమ డిమాండ్ విషయంలోనూ సీఎస్ సానుకూలంగా స్పందించినట్లు మురళీకృష్ణ, నరేందర్‌రావు వివరించారు. మీడియా సమావేశానంతరం సీమాంధ్ర, తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉమ్మడిగా సచివాలయ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. చాలాకాలం తర్వాత ఉమ్మడి ప్రెస్‌మీట్: ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో 2 నెలలకు పైగా సచివాలయంలో పోటాపోటీ నిరసనలు, ఆందోళనలు నిర్వహించిన సచివాలయ తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు ఇప్పుడు ఒక్కటయ్యారు. తమ సమస్యలపై కలిసి పోరాడేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో పీఆర్సీ చైర్మన్, సీఎస్‌లను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. సమాఖ్య ఉపాధ్యక్షులు టి. వెంకట సుబ్బయ్య, కన్వీనర్ పద్మాచారి తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.