శుక్రవారం అర్ధరాత్రి జీవోలు
సాక్షి, హైదరాబాద్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల నగదురహిత వైద్యానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. గత రెండేళ్లుగా వివిధ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపినా... ఉద్యోగ సంఘాల అభ్యంతరాలతో చర్చలు విఫలమవుతూ వచ్చాయి. అయితే గత రెండు మూడురోజులుగా ఆయా సంఘాలు, ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులతో జరిపిన ముమ్మర చర్చల నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఉద్యోగుల హెల్త్‌కార్డులకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాత్రి 8 గంటల సమయంలో సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కొండ్రు మురళి, ఈ శాఖకు చెందిన ఐఏఎస్ అధికారులతో సుమారు గంటసేపు ఉద్యోగ సంఘాలు చర్చించాయి. అనంతరం జీవో 171, 174, 175, 176లను విడుదల చేశారు. జీవోలను కాన్ఫిడెన్షియల్‌గా పెట్టారు. ఈ వివరాలను శనివారం సీఎం అధికారికంగా ప్రకటించనున్నందునే జీవోలను కాన్ఫిడెన్షియల్‌గా పెట్టామని అధికారులు చెబుతున్నారు.
కేసు తీవ్రతను బట్టే... చెల్లింపులు : దీపావళి కానుకగా ప్రభుత్వం చెప్పుకుంటున్న ఈ హెల్త్‌కార్డుల పథకంలో ఉద్యోగుల డిమాండ్లన్నీ పూర్తిగా తీర్చలేదు. అయితే మధ్యేమార్గంగా వెళ్లినట్లు తెలుస్తోంది. ఏదైనా అనారోగ్యానికి చికిత్స నిమిత్తం తాము గరిష్టంగా రెండు లక్షలు మాత్రమే చెల్లిస్తామని... దీనికి అదనంగా అయితే సదరు ఉద్యోగస్తుడే భరించాలని ప్రభుత్వం ఇన్నాళ్లూ చెబుతూ వచ్చింది. అయితే ఉద్యోగ సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే తాజా మార్గదర్శకాల్లో... కేసు తీవ్రతను, వైద్యుల సిఫారసులను బట్టి రెండు లక్షల పరిమితిని సడలించి చికిత్సకయ్యే పూర్తి ఖర్చును చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఇది కేసుల వారీగా ఉంటుంది. అంటే రెండు లక్షల వ్యయపరిమితి కొనసాగుతుంది. అయితే ఈ సడలింపునకు అనుమతించే క్రమంలో చికిత్సకు ఆటంకం కలగకుండా చూస్తామని, ఖర్చు రెండు లక్షల పరిమితి దాటిందని ఆసుపత్రులు చికిత్సను నిలిపివేయకుండా చర్యలు తీసుకుంటామని, వారికి ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటాయని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ ఉన్నాతాధికారి ఒకరు శుక్రవారం రాత్రి సాక్షితో మాట్లాడుతూ చెప్పారు.
హెల్త్‌కార్డుల మార్గదర్శకాలు జారీ
Published Sat, Nov 2 2013 2:58 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement