దీపావళి కానుకగా సీఎంకు ఉల్లిగడ్డలు
Published Tue, Oct 29 2013 1:34 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేత విజయ్ జోలీ సోమవారం ఓ వినూత్నమైన కానుకతో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నివాసానికి సోమవారం చేరుకున్నారు. కిలో వంద రూపాయల విలువైన ఉల్లిగడ్డలతో నిండిన బుట్టను ఆమెకి కానుకగా ఇవ్వడానికి వచ్చినట్లు ఆయన చెప్పారు. 20 కిలోల ఉల్లిపాయల బుట్టతో పాటు మిఠాయిడబ్బాను దీపావళి కానుకగా తీసుకొచ్చానని తెలిపారు. వారం రోజులుగా షీలాదీక్షిత్ ఉల్లిపాయలు తినడం లేదన్న సంగతి తెలిసి ఈ విధంగా వచ్చానన్నారు.
ఉల్లి ధర ఆకాశాన్ని అంటడంతో తాను ఉల్లితినడం మానేశానని ముఖ్యమంత్రి గతంలో చెప్పిన మాటలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఎద్దేవా చే శారు. ధరల పెరుగదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని,పండుగలు చప్పబడిపోతున్నాయని ఆయన చెప్పారు. ప్రజల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం కోసం తాను కానుకగా ఉల్లిపాయలు, మిఠాయిని తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. విజయ్ జోలీ గత అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోటీచేసి ఓడిపోయారు. వినూత్నమైన ప్రచారశైలిలో ప్రచారం నిర్వహించడం ఆయన ప్రత్యేకత.
125 మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లిపాయల అమ్మకం
తక్కువ ధరకు ఉల్లిపాయలను నగరవాసులకు అందించడం కోసం ప్రభుత్వం ఉల్లిపాయలను విక్రయించే 125 వ్యాన్లను నగరంలో మోహరించారు. ఈ మొబైల్ వ్యాన్ల ద్వారా కిలో ఉల్లిగడ్డలను 50 రూపాయలకు విక్రయిస్తున్నారు.
Advertisement
Advertisement