రాహుల్‌కు విజయ్ గోయల్ ఆహ్వానం | BJP invites Rahul Gandhi to Delhi to see city's 'ground realities' | Sakshi
Sakshi News home page

రాహుల్‌కు విజయ్ గోయల్ ఆహ్వానం

Published Tue, Oct 29 2013 1:32 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

BJP invites Rahul Gandhi to Delhi to see city's 'ground realities'

సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ నగరాన్ని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారంటూ కితాబిచ్చిన కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని వాస్తవాలు తెలుసుకునేందుకు నగర పర్యటనకు రావాలంటూ ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఆహ్వానించారు. పండిత్ పంత్ మార్గ్‌లోని కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ సీఎం షీలా ప్రజలను, కాంగ్రెస్ అధిష్టానాన్ని మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రసంగం వింటే అతనికి నగరంపై పూర్తిగా అవగాహనలేదనిపిస్తోందని ఎద్దేవా చేశారు. నగరంలో స్వయంగా పర్యటిస్తేనే పదిహేనేళ్ల కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలనలో ఢిల్లీవాసులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుస్తాయన్నారు. 
 
 రాజధాని నగరాన్ని స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్‌పై సైతం ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయంటూ దుయ్యబట్టారు.  ‘ఢిల్లీ నగరాన్ని అభివృద్ధి చేశానంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఢిల్లీవాసులనేకాదు ఆపార్టీ అధిష్టానాన్ని మోసం చేస్తోంది. ముఖ్యమంత్రి చూపుతున్న అభివృద్ధి చిత్రాలను చూసి నగరం మొత్తం ఇలాగే ఉందన్న భావనలో రాహుల్‌గాంధీ ఉన్నట్టున్నారు. వాస్తవాలు తెలియాలంటే ఆయన నగరంలో స్వయంగా పర్యటించాల’ని అన్నారు. నగరానికి అధికారాలు విస్తరించాలంటూ ముఖ్యమంత్రి కొత్త ప్రతిపాదలను చేస్తూ అనవసర గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ రాష్ట్ర ప్రతిపత్తిపై బిల్లును ఎన్‌డీఏ ప్రభుత్వం 2004లో పంపితే  ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తిరస్కరించారన్నారు.
 
 సోనియా, మన్మోహన్ క్షమాపణ చెప్పాలి: హర్షవర్ధన్
 నరేంద్ర మోడీ పాట్నాలో నిర్వహించిన హూంకర్ ర్యాలీ సమీపంలో బాంబుపేలుళ్ల్లు జరగడంపై ఆయా పార్టీల నాయకులు చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ తీవ్రంగా ఖండించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేలుళ్లపై కాంగ్రెస్, జేడీయూ నాయకులు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. నాయకుల మాటలు దేశం పరువుతీసేలా ఉన్నాయన్నారు. ముందస్తు పథకం ప్రకారమే బాంబు పేలుళ్లు జరిపారని బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. 
 
 పార్టీ సీనియర్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పేలుళ్లలో గాయపడిన వారికి,  మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాట్నాలో హూంకర్ ర్యాలీ నిర్వహించనున్నట్టు కొన్ని నెలల ముందే బీహార్ ప్రభుత్వానికి బీజేపీ నాయకులు సమాచారం ఇచ్చారని గుర్తు చేశారు. సంఘ విద్రోహ శక్తులు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ హత్యకు కుట్రచేస్తున్నా నితీశ్‌సర్కార్ చూస్తూ కూర్చుందన్నారు. నెల క్రితమే ర్యాలీలో బాంబులు పేల్చేందుకు ఉగ్రవాదులు పథక రచన చేసినట్టు కేంద్ర హోంశాఖ బీహార్‌ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు హోంమంత్రి షిండే పేర్కొన్నారన్నారు. 
 
 అయిన్పటికీ ర్యాలీ మైదానం సమీపంలో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయలేదన్నారు. కనీసం అంబులెన్స్‌లను సైతం ర్యాలీ ప్రదేశంలో ముందస్తుగా ఉంచలేదన్నారు. దాదాపు ఏడు లక్షల మందికిపైగా ప్రజలు ఒక్కచోట చేరినా ప్రభుత్వం ఎలాంటి  చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. అదే రాహుల్‌గాంధీ   ప్రచారానికి భద్రత కల్పిస్తున్న ప్రభుత్వాలు బీజేపీ విషయంలో వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. 
 
 రాహుల్ ర్యాలీ విఫలం
 ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, మరికొందరు కేంద్రమంత్రులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని భారీగా ఏర్పాట్లు చేసినా మంగోలిపురిలో రాహుల్‌గాంధీ నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి స్పందన రాలేదని వ్యాఖ్యానించారు. దీనిద్వారా రాహుల్‌కి ప్రజల్లో ఏమాత్రం గుర్తింపు ఉందో మరోమారు అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ పూర్తిగా విఫలమైందన్నారు. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్‌గాంధీకి ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తధ్యమన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement