
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛనుదారులకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) ప్రకటించింది. జూలై 1, 2021 నుంచి అమలులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ, పింఛనర్లకు మూడు శాతం డీఆర్ ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. డీఏ, డీఆర్ వల్ల కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70 కోట్లు భారం పడనుంది. 47.14 లక్షల కేంద్ర ఉద్యోగులు, 68.62 లక్షల పింఛనర్లు లబ్ధి పొందనున్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది కరువు భత్యం నిలిపివేసిన విషయం విదితమే. ఈ ఏడాది జూలైలో పునరుద్ధరిస్తూ 17% నుంచి 28 శాతానికి పెంచారు. తాజా పెంపుతో అది 31 శాతానికి చేరుకుంది.
మూడంచెల పర్యవేక్షణ
పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్‌ఎంపీ) అమలుకు మార్గం సుగమమైంది. గురువారం భేటీ అయిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) రూ.100 లక్షల కోట్ల విలువైన పీఎం గతిశక్తికి ఆమోదం తెలిపింది. మూడంచెల పద్ధతిలో దీన్ని పర్యవేక్షించనున్నట్లు కేంద్రం పేర్కొంది. పీఎం గతిశక్తి మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలో అంతర్ మంత్రిత్వశాఖల సహకారంతో పాటు అంతర్ విభాగాల సహకారం ఓ గేమ్ చేంజర్ కానుందని తెలిపింది. పీఎం గతిశక్తి ని ప్రధాని 13న ప్రారంభించారు. రాబోయే పాతికేళ్ల అభివృద్ధికి ఈ ప్రణాళికతో పునాది వేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment