బుధవారం ఢిల్లీలో తన నివాసంలో కేబినెట్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ), పెన్షనర్లకు కరువు ఉపశమనం(డీఆర్) 28 శాతానికి పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం ప్రస్తుతం మూలవేతనంపై 17 శాతంగా ఉన్న డీఏను మరో 11 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ వెల్లడించారు. దీనివల్ల కేంద్రంపై అదనంగా రూ.34,401 కోట్ల ఆర్థిక భారం పడనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 48.34 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని చెప్పారు. కాగా, 2020 జనవరి 1, 2020 జులై 1, 2021 జనవరి 1 తేదీల్లో చెల్లించాల్సిన మూడు అదనపు డీఏ, డీఆర్ వాయిదాలను.. కోవిడ్–91 మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 మధ్య గల కాలానికి డీఏ, డీఆర్ 17 శాతంగానే ఉంటుందని కేంద్రం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
‘ఆయుష్ మిషన్’ ఐదేళ్లపాటు పొడిగింపు
నేషనల్ ఆయుష్ మిషన్(నామ్)ను కేంద్ర ప్రాయోజిత పథకంగా 2021 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకూ కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.4,607.30 కోట్ల వ్యయం కానుంది. ఇందులో కేంద్రం వాటా రూ.3,000 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.1,607 కోట్లుగా ఉంటుంది. నేషనల్ ఆయుష్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం 2014 సెప్టెంబరు 15న ప్రారంభించింది. అర్హులందరికీ వైద్య సేవలు అందేలా చూడడం, ఔషధాలు, మానవ వనరుల లభ్యత పెరిగేలా చూడడం, ఆయుష్ విద్యా సంస్థల సంఖ్యను పెంచడం వంటివి ఆయుష్ మిషన్
లక్ష్యాలు.
కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు
∙న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.9,000 కోట్లతో కేంద్ర ప్రాయోజిత పథకం కొనసాగింపు ప్రతిపాదనలకు ఆమోదం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా ఐదేళ్లపాటు ఇది అమలవుతుంది. ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్ కాలపరిమితి మరో ఆరు నెలల పాటు.. అంటే జనవరి 31 వరకు పొడిగింపు. నార్త్ ఈస్ట్రన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫోక్ మెడిసిన్ సంస్థ పేరు ఇకపై నార్త్ ఈస్ట్రన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఫోక్ మెడిసిన్ రీసెర్చ్‌గా మార్పు.
ప్రత్యేక పశు సంవర్థక ప్యాకేజీ అమలుకు ఆమోదం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మార్పులు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రత్యేక పశు సంవర్థక ప్యాకేజీ అమలు చేయాలని తీర్మానించింది. పశు సంవర్థక రంగం వృద్ధితోపాటు ఈ రంగంలో ఉన్న 10 కోట్ల మంది రైతులకు మెరుగైన ప్రతిఫలం దక్కేలా ఈ చర్య దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్యాకేజీ కింద కేంద్రం రూ.9,800 కోట్ల మేర ఆర్థిక సాయం అందించనుంది. మొత్తంగా రూ.54,618 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తోంది. వివిధ విభాగాలను రాష్ట్రీయ గోకుల్ మిషన్, జాతీయ పాడి అభివృద్ధి కార్యక్రమం(ఎన్‌పీడీడీ), జాతీయ పశు సంపద మిషన్‌గా విభజించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ దేశీయ జాతుల అభివృద్ధి, పరిరక్షణకు సహాయపడుతుంది. ఎన్‌పీడీడీ పథకం సుమారు 8,990 బల్క్ మిల్క్ కూలర్స్ ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment