జైపూర్: కన్నీళ్లు కార్చేందుకు భయపడాల్సిన అవసరం లేదని.. బాధను ధైర్యంగా వ్యక్తపరచాలని బాలీవుడ్ భామ దియా మీర్జా అన్నారు. తనివితీరా ఏడ్వటం వల్ల మనసుకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్‌కు సోమవారం ఆమె హాజరయ్యారు. వాతావరణ మార్పు అంశంపై చర్చ సందర్భంగా దియా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని భావోద్వేగానికి గురయ్యారు.
‘‘జనవరి 26.. దాదాపు ఉదయం 3 గంటల సమయంలో నా అభిమాన ఎన్‌బీఏ ఆటగాడు దుర్మరణం పాలయ్యాడనే వార్తకు సంబంధించిన అలెర్ట్‌తో రోజు ప్రారంభమైంది. కాలిఫోర్నియాలో ఆయన విమానం కుప్పకూలిందనే వార్త నన్ను తీవ్ర వేదనకు గురిచేసింది. పూర్తి నిరాశలో కూరుకుపోయాను. బీపీ లెవెల్స్ పడిపోయాయి. మన రోజువారీ జీవితంలో ఇలాంటి ప్రమాదాలు, వివిధ విషయాలు మనల్ని అగాథంలోకి నెట్టేస్తాయి. అయితే మనం మనోనిబ్బరంతో ఉండాలి. అంతేకాదు ఎదుటివారి బాధను మన బాధగా భావించి వారికి అండగా ఉండాలి. వారి స్థానంలో మనల్ని ఊహించుకుని అండగా నిలబడాలి. కన్నీళ్లు కార్చేందుకు ఏమాత్రం వెనుకాడకూడదు’’ అంటూ దియా మీర్జా ఉద్వేగానికి లోనయ్యారు. ఇది నటన కాదని.. ఇలా కన్నీళ్లు కార్చడం ద్వారా భారం తగ్గినట్లుగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.(కోబ్ బ్రయాంట్ దుర్మరణం.. శోకసంద్రంలో అమెరికా)
కాగా అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రియాంట్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం విదితమే. ఈ ఘటనలో బ్రియాంట్ కుమార్తె గియానా కూడా మృత్యువాత పడింది. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ విషాదకర ఘటనపై క్రీడాలోకం సహా పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment