
‘శివ’ మళ్లీ వస్తున్నాడు..!
సైకిల్ చైన్ తెంపి బాక్సాఫీస్ మూసను బద్దలుకొట్టిన ‘శివ’ జ్ఞాపకాలను మర్చిపోవడం అంత సులువు కాదు. ఆ పాత్రను అప్పటి కుర్రకారు మాత్రమే కాదు.. ఈ తరం వారూ ప్రేమిస్తారు. అంత ట్రెండీగా ఉంటుంది. 1989 అక్టోబర్ 5న విడుదలైన ‘శివ’ ప్రభావంతో అప్పటి కుర్రాళ్లందరూ సైకిల్ చైన్ పట్టుకుంటే హీరోల్లా ఫీలయ్యేవాళ్లు. నాగార్జున హీరోగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్. సీఎన్‌ఎన్-ఐబీఎన్ చానల్ అత్యుత్తమ వంద భారతీయ చిత్రాల జాబితాలో స్థానం దక్కించుకున్న విశిష్ట చిత్రం. తాజాగా ‘శివ’ ఆధునిక సొబగులు అద్దుకుని మళ్లీ ప్రేక్షకులను పలకరించనున్నాడు. త్రీడీ అనలాగ్ సౌండ్ టెక్నాలజీతో సరికొత్త ‘శివ’ ఈ మే 15న విడుదల కానుంది.