సాక్షి, తిరువనంతపురం : భావన కిడ్నాప్, లైంగిక దాడి కేసు ఉదంతంలో నటుడు, ఎమ్మెల్యే పీసీ జార్జ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దిలీప్ అమాయకుడని.. అతన్ని ఈ కేసులో అనవసరంగా ఇరికించారని అంటున్నారు. మనోరమ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో జార్జీ మాట్లాడుతూ.. అతని మాజీ భార్య మంజూ వారియర్ దీనంతటికి కారణమన్నారు.
‘‘ఆమెకు దిలీప్ నుంచి విడిపోవటం ఇష్టం లేదు. కానీ, వేరే మార్గం లేక విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అవకాశం దొరకటంతో పథకం పన్ని దిలీప్‌ను ఇరికించి ప్రతీకారం తీర్చుకుంది. మంజు మంచి నటే కావొచ్చు. కానీ, అంతకు మించి కఠిన హృదయం కలది’’ అని జార్జ్ చెప్పారు. దిలీప్‌కు ఇంత అండగా ఎందుకు నిలుస్తున్నారన్న ప్రశ్నకు... ఏ తప్పు చెయ్యని ఓ వ్యక్తి 90 రోజులు జైలు శిక్ష అనుభవించాడు. ధర్మం గెలిచి తీరాలన్న ఒకే ఉద్దేశ్యంతో తాను అతని తరపున నిల్చున్నానని.. అందు కోసం ఎక్కడిదాకా అయినా వెళ్తానని జార్జ్ బదులిచ్చారు. కాగా, జార్జ్ ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని మంజు అంటున్నారు.
పుంజార్ ఎమ్మెల్యే పీసీ జార్జ్ ఈ కేసులో మొదటి నుంచి దిలీప్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అంతకు నటి భావనను లక్ష్యంగా చేసుకుని ఆయన మాటల దాడి చేశారు. అంత పెద్ద దాడి జరిగితే మరుసటి రోజు షూటింగ్ కు వెళ్లటమేంటని ఆయన ప్రశ్నించారు. దీంతో భావన తనను జార్జ్ అవమానిస్తున్నారంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఓ లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment