దిలీప్ సాబ్‌కు పాక్ తాజా గౌరవం | Dilip Kumar's house declared national heritage by Pakistan | Sakshi
Sakshi News home page

దిలీప్ సాబ్‌కు పాక్ తాజా గౌరవం

Published Tue, Jul 15 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM

దిలీప్ సాబ్‌కు పాక్ తాజా గౌరవం

దిలీప్ సాబ్‌కు పాక్ తాజా గౌరవం

ఒక కళాకారుడికి ఇది అపూర్వమైన గౌరవం. హిందీ చలనచిత్ర సీమలో ప్రస్తుతమున్న అత్యంత సీనియర్ హీరో దిలీప్ కుమార్‌కు ఆ అదృష్టం దక్కింది. పాకిస్తాన్‌లోని పెషావర్ నగరంలోని ఇరుకు సందుల్లో తొమ్మిది దశాబ్దాల పైచిలుకు క్రితం దిలీప్ సాబ్ జన్మించిన పాతకాలపు ఇల్లు ఇప్పుడు ‘జాతీయ వారసత్వ కట్టడం’గా గుర్తింపు పొందింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఆ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపి, సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. స్వాతంత్య్రం రాక ముందు నాటి అఖండ భారతదేశంలో 1922 డిసెంబర్ 11న పెషావర్‌లోని ఖిస్సా ఖవానీ బజార్‌లోని పురాతన గృహంలో దిలీప్ కుమార్ జన్మించారు.
 
  సినీ కళాకారుడిగా సరిహద్దులు దాటి పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న దిలీప్ సాబ్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్ -ఏ-ఇమ్తియాజ్’తో 1998లో గౌరవించింది. కాగా, ఇప్పుడిలా ఆయన పుట్టిన పాతకాలపు ఇంటిని జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించి, దాన్ని మ్యూజియమ్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. శిథిలావస్థలో ఉన్న ఈ 130 చదరపు మీటర్ల విస్తీర్ణపు ఇంటిని పునరుద్ధరించి, పెషావర్ నుంచి ముంబయ్ దాకా సాగిన దిలీప్ ప్రస్థానాన్ని తెలిపేలా అందులో మ్యూజియమ్ పెట్టనున్నారు. మ్యూజియమ్ గ్యాలరీని దిలీప్ సాబ్‌కు అంకితమివ్వనున్నారు. భవనాన్ని కొనుగోలు చేసి, వీలైనంత త్వరగా ఈ పనులన్నీ పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి దిలీప్ కుమార్‌ను ఆహ్వానించనున్నట్లు ప్రకటించారు.
 
 నిజానికి, పన్నెండు మంది తోబుట్టువుల్లో ఒకరైన దిలీప్ సాబ్ అసలు పేరు - మహమ్మద్ యూసఫ్‌ఖాన్. ఆయన తండ్రి ఓ పండ్ల వ్యాపారి. పెషావర్‌లో, ముంబయ్‌కి సమీపంలోని దేవాలీలో ఆయనకు పండ్ల తోటలు ఉండేవి. దేశానికి స్వాతంత్య్రం రాక ముందే 1930లలో ఈ ఫష్తూన్ కుటుంబం ముంబయ్‌కి తరలి వచ్చింది. 1944లో ‘జ్వర్ భాటా’తో సినీ రంగ ప్రవేశం చేసిన యూసఫ్ సినిమాల్లో తన పేరును దిలీప్ కుమార్‌గా మార్చుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా భారత్, పాకిస్తాన్‌లు రెంటిలోనూ లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్న దిలీప్‌కు ఇప్పుడిలా పాక్ ప్రభుత్వం ద్వారా దక్కిన గౌరవం రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
 
 సరిహద్దుకు ఆవల మరికొందరు: స్వాతంత్రానికి పూర్వం రోజుల్లో పాకిస్తాన్‌లో జన్మించి, ముంబయ్‌కి వచ్చిన హిందీ చిత్రాల ద్వారా ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన సినీ ప్రముఖుల్లో రాజ్ కపూర్, సునీల్ దత్, యశ్‌చోప్రా, శేఖర్ కపూర్‌లు కూడా ఉన్నారు. యశ్‌చోప్రా, శేఖర్‌లు లాహోర్‌లో జన్మించగా, సునీల్‌దత్ పంజాబ్‌లోని ఝీలమ్ జిల్లాలో పుట్టారు. రాజ్‌కపూర్ సైతం దిలీప్ సాబ్ లాగానే పెషావర్‌లోని ఖిస్సా ఖవానీ బజార్ ప్రాంతంలోనే ఓ ఇంట్లో జన్మించడం విశేషం. ప్రస్తుతం ఆ పాతకాలపు ఇల్లు పునరుద్ధరణ జరుగుతోంది. రాజ్‌కపూర్ గౌరవార్థం ఆ ఇంటిని సైతం మ్యూజియమ్‌గా మారుస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement