‘దిల్‌వాలే...’ మేజిక్ రిపీట్ అవుతుందా? | Dilwale Dulhania Le Jayenge ready to repeat the magic | Sakshi
Sakshi News home page

‘దిల్‌వాలే...’ మేజిక్ రిపీట్ అవుతుందా?

Published Fri, Feb 28 2014 11:08 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

‘దిల్‌వాలే...’ మేజిక్ రిపీట్ అవుతుందా? - Sakshi

‘దిల్‌వాలే...’ మేజిక్ రిపీట్ అవుతుందా?

 హీరోలకు అభిమానులుంటారు. హీరోయిన్లకూ ఉంటారు. కామెడీ ఆర్టిస్ట్‌లకు, కేరక్టర్ ఆర్టిస్ట్‌లకూ అభిమానులుంటారు. కానీ, ‘సినిమా’కి అభిమానులు ఉండటం అరుదైన విషయం.

 

ఆ ఘనతను దక్కించుకున్న సినిమాల్లో మనకు ‘మాయాబజార్’ లాంటి కొన్ని సినిమాలుంటే, బాలీవుడ్‌లో ‘షోలే’, ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ చిత్రాలు ఆ జాబితాలో చేరతాయి. ఇంకా చెప్పాలంటే ‘షొలే’ కన్నా ‘దిల్‌వాలే...’ ఓ మెట్టు పైనే. ముంబయ్‌లోని మినర్వా థియేటర్లో ‘షోలే’ ఐదేళ్లు ఆడితే, ఆ రికార్డ్‌ని ‘దిల్ వాలే..’ అధిగమించింది. 1995లో విడుదలైన ‘దిల్‌వాలే..’ ఇంకా ఆడుతోంది. ఇప్పుడు దీన్ని రీమేక్ చేయడానికి చిత్రదర్శకుడు ఆదిత్య చోప్రా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘దిల్ వాలే..’ని ఓసారి స్మరించుకుందాం...
 

 

 అది ముంబయ్‌లోని మరాఠా మందిర్. అంటే.. సినిమా థియేటర్ అన్నమాట. 1995 వరకు ఆ థియేటర్ గురించి ఉత్తరాదివారికి బాగానే తెలుసు. ఆ తర్వాత మాత్రం మరాఠా మందిర్ ఇతర రాష్ట్రాలవారి దృష్టిని కూడా ఆకర్షించింది. దానికి కారణం ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ (డీడీఎల్). రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ఆడుతున్నా, ఇంకా ఈ సినిమాని ఆ థియేటర్ నుంచి తీసేయలేదు. చూసినవాళ్లే మళ్లీ మళ్లీ చూడటం, చూడనివాళ్లు చూడటంతో.. ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక రోజులాడుతున్న సినిమాగా డీడీఎల్ నమోదైంది. 2006లో 500 వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్విట్జర్లాండ్ టూరిజమ్ ప్రత్యేకంగా ఓ భారీ విందు  కార్యక్రమం ఏర్పాటు చేసి, నిర్మాత యశ్ చోప్రాతో పాటు యూనిట్ సభ్యులను భారీగా సన్మానించింది.

 

 వెయ్యి వారాల దిశలో: ఆ మధ్య ముంబయ్‌లో థియేటర్స్ స్ట్రయిక్ జరిగినప్పుడు, ఈ చిత్రప్రదర్శనను ఆపివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారనే వార్త వచ్చింది. కానీ, మరాఠా మందిర్ అధినేతను యశ్ చోప్రా సంప్రదించి, వెయ్యి వారాల వరకు ఆడిస్తే బాగుంటుందని కోరారట. ఓ నిర్మాత, థియేటర్ అధినేత కోరుకున్నంత మాత్రాన ఓ సినిమా ఏళ్ల తరబడి ఆడేయదు. ప్రేక్షకాదరణ ఉంటేనే పైసా వసూల్ అవుతుంది. డీడీఎల్‌కి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని, వెయ్యి వారాలు గ్యారంటీ అని యశ్ చోప్రా ఫిక్స్ అయ్యారు. అందుకే, అన్ని వారాలూ సినిమాని ఉంచమని ఎగ్జిబిటర్‌ని కోరారు. ఆ ఎగ్జిబిటర్ కూడా ఈ చిత్రాన్ని తీసేయడానికి ఇష్టపడటంలేదు. ఎందుకంటే, 50 సార్లకు పైనే ఈ సినిమాని చూసినవాళ్లు ఉన్నారని, చూసిన ప్రతిసారీ చప్పట్లు కొట్టడం స్వయంగా చూశానని తనసన్నిహితుల దగ్గర ఆ ఎగ్జిబిటర్ చెప్పారట.
 

 

‘మదర్ ఇండియా’, ‘డీడీఎల్’కే ఆ ఘనత దక్కింది: ‘1001 మూవీస్ యు మస్ట్ సీ బిఫోర్ యు డై’ పేరుతో ఓ ఆంగ్ల పుస్తకం ఉంది. అద్భుతః అనిపించే చిత్రాల జాబితా మాత్రమే ఆ పుస్తకంలో ఉంటుంది. అందులో ఉన్నవన్నీ హాలీవుడ్ సినిమాలే. మన భారతదేశానికి సంబంధించి ‘మదర్ ఇండియా’, ‘డీడీఎల్’కే ఆ ఘనత దక్కింది. అలాగే ‘బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్’లో స్థానం సంపాదించు కున్న క్రెడిట్ కూడా ‘డీడీఎల్’ సొంతం.

 

అద్భుతమైన క్లాసిక్: ఈ సినిమాలో ప్రేయసీప్రియుల మధ్య ప్రేమ కబుర్లు ఉండవు. చెట్టాపట్టాలేసుకుని తిరగరు. మాటలతో కాకుండా మనసులతోనే ప్రేమించుకుంటారు. ఈ సినిమా అందరి మనసులకూ దగ్గరవడానికి కారణం అదే. ఆధునిక యుగంలో వచ్చినటువంటి అద్భుతమైన క్లాసిక్ ‘డీడీఎల్’. జతిన్ లలిత్ స్వరపరచిన ప్రతి పాటా ఆణిముత్యమే. దర్శకుడు ఆదిత్య చోప్రాకి ఇది తొలి సినిమా కావడం విశేషం. రాజ్ మల్హోత్రా, సిమ్రాన్ సింగ్ పాత్రల్లో షారుక్ ఖాన్, కాజోల్ జీవించారు. ఇంకా అమ్రిష్‌పురి, అనుపమ్‌ఖేర్, ఫరీదా జలాల్.. చేసినవి సహజమైన పాత్రలే అన్నట్లుగా అనిపిస్తాయి. అంతగా ఆ పాత్రలకు ప్రాణం పోశారు. మనం చూస్తున్నది సినిమా అని మరిచిపోయి జీవితాన్నే చూస్తున్నామా! అనే భావన కలిగిస్తుందీ సినిమా. డీడీఎల్ మహత్యం అదే.
 తెలుగులోనూ ఈ సినిమా పెద్ద హిట్టే:

 

 ఈ చిత్రం తెలుగులో ‘ప్రేమించి పెళ్లాడతా’ పేరుతో అనువాదమైంది. ఓవైపు హిందీ సినిమా ఆడుతున్నా, మరోవైపు తెలుగు చిత్రానికి కూడా అద్భుతమైన ఆదరణ లభించింది. కొన్ని కేంద్రాల్లో వంద రోజులాడింది కూడా. ట్రెండ్, భాష, ప్రాంతానికి అతీతమైన సినిమాగా ‘డీడీఎల్’ నిలిచింది. గత 19 ఏళ్లలో అన్ని భారతీయ భాషల చిత్రాలపైనా ‘డీడీఎల్’ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆ చిత్రంలోని ఒక సీనైనా ఏదో సినిమాలో కనిపించడం విశేషం.
 
 

 

డీడీఎల్’ రీమేక్‌ల జోడీ ఎవరు?
 షారుక్ ఖాన్, కాజోల్ ‘డీడీఎల్’లో అద్భుతంగా జీవించారు. వారి మనసుకి సంబంధించిన కెమిస్ట్రీ అద్భుతం. మరి.. ఈ రీమేక్‌లో ఈ సత్తాని పండించబోతున్నది ఎవరు? అనే విషయానికొస్తే.. ఫరాన్ ఖాన్ అనే బుల్లితెర నటుణ్ణి హీరోగా, మహికా శర్మ అనే కొత్తమ్మాయిని హీరోయిన్‌గా ఎంపిక చేయాలనుకుంటున్నారట ఆదిత్య చోప్రా. అనుపమ్ ఖేర్ పాత్రను బొమన్ ఇరానీ చేయనున్నారట. అమ్రిష్ పురి చేసిన పాత్రను పరేష్‌రావల్‌తో చేయించాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రానికి ‘దుల్హనియా చలే దిల్‌వాలే కే సాత్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని వినికిడి. కాగా, ‘డీడీఎల్’ హిట్ పెయిర్ అనిపించుకున్న షారుక్, కాజోల్ ఈ రీమేక్‌లో అతిథి పాత్రలు చేస్తారని బాలీవుడ్ టాక్. మరి.. ఈ రీమేక్ సెట్స్‌కి వెళుతుందా? ఒకవేళ రీమేక్ అయినా, ‘డీడీఎల్’ మేజిక్‌ని రిపీట్ చేస్తుందా?... కాలమే చెప్పాలి.
 - డి.జి.భవాని

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement