కితకితలు పెట్టే... ఎక్స్‌ప్రెస్ రాజా!
సంక్రాంతి అనగానే తెలుగు జనాలకు గుర్తొచ్చేవి కోడిపందేలు, కొత్త సినిమాలే. కూత పెట్టేందుకు కోళ్లు ఎలా సిద్ధమవుతు న్నాయో... బాక్సాఫీస్ బరిలో నిలిచేందుకు కొత్త సినిమాలు కూడా అలాగే ముస్తాబవు తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి పోటాపోటీగా నాలుగు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో బాలకృష్ణ, నాగార్జున, చిన్న ఎన్టీఆర్ వంటి హేమాహేమీల చిత్రాలు న్నాయి. మామూలుగా అయితే స్టార్ కథానాయకుడు నటించిన ఒక సినిమా విడుదలవుతోందనగానే... మిగిలిన సినిమాలు వెనక్కి వెళ్లే పరిస్థితులు కనిపిస్తుంటాయి.
కానీ ఏకంగా ముగ్గురు స్టార్ కథానాయకుల సినిమాలు వస్తున్నప్పటికీ... వాటి మధ్యలో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటి నాన్‌స్టార్ సినిమా విడుదలవుతుండటం విశేషం. మూడు చిత్రాలు పందెం కోళ్లలాగా పౌరుషంతో కూడిన కంటెంట్‌తో వస్తుంటే... ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ మాత్రం కితకితలతోనే బాక్సాఫీసుని గెలుస్తానన్న ధీమాతో కనిపిస్తున్నాడు. ఆ ధీమాకు తగ్గట్టుగానే సినిమాపై ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ క్రియేటయ్యింది. మూడు సినిమాల గురించి జనం ఎంతగా మాట్లాడుకుంటున్నారో... ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు.
ఒక విజయవంతమైన కలయికతో రూపొందిన చిత్రం కావడమే అందుకు కారణం. ‘రన్ రాజా రన్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి హిట్లతో దూసుకెళుతున్న కథానాయకుడు... శర్వానంద్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో హిట్ సాధించిన దర్శకుడు మేర్లపాక గాంధీ. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘జిల్’, ‘భలే భలే మగాడివోయ్’ వంటి చిత్రా లతో వరుస విజయాలందుకున్న నిర్మాతలు వంశీ, ప్రమోద్. వీళ్లంతా కలసి సినిమా చేస్తున్నారంటే ఆటోమేటిగ్గా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతాయి. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ పై కూడా మొదట్నుంచీ ఆ రూపంలోనే పాజిటివ్ బజ్ క్రియేటయ్యింది. దాంతో ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు.
అలాంటి సినిమా సంక్రాంతి లాంటి ఒక మంచి సీజన్లో విడుదలవుతోందంటే ఇక తిరుగేముంటుంది. దానికితోడు ‘దిల్’ రాజు లాంటి ఓ అగ్ర నిర్మాత, మారుతీ లాంటి అగ్ర దర్శకుడు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్నారు.
సినిమా నిర్మాణంలో యువీ క్రియేషన్స్ ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. కథానాయకుడు స్టార్ కాకపోయినా సరే... కంటెంట్‌ని నమ్మి ఖర్చుకి వెనకాడకుండా సినిమాను నిర్మిస్తుంటుంది. ప్రచార కార్యక్రమాల్నీ దీటుగా నిర్వహిస్తుంటుంది. ‘రన్ రాజా రన్’, ‘భలే భలే మగాడివోయ్’ అందుకు ఉదాహరణ. ఆ చిత్రాలు కనీవినీ ఎరుగని రీతిలో, స్టార్ కథానాయకుల చిత్రాలకు దీటుగా వసూళ్లను సొంతం చేసుకున్నాయి. వాటి స్ఫూర్తితో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ తెరకెక్కింది. ఇటీవలే కథానాయకుడు ప్రభాస్ చేతుల మీదుగా పాటలు విడుదలయ్యాయి. యువీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థతో సమానం. ఆయన పాటల వేడుకకి హాజరవడంతో సినిమాకు మంచి ప్రచారం లభించింది.
థియేటర్ ట్రైలర్లకూ ఆదరణ లభించింది. మేర్లపాక గాంధీ మంచి వినోదా త్మక చిత్రాన్ని తీశాడని ట్రైలర్లని చూస్తే తెలుస్తోంది. శర్వానంద్, సురభి జంటగా నటించిన ఈ చిత్రంలో ‘ప్రభాస్’ శ్రీను, సప్తగిరి తదితర హాస్యనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 14న ఈ చిత్రం రిలీజవుతోంది.
‘‘యువీ క్రియేషన్స్ అంటే నాకు మొదటి నుంచి మంచి అభిమానం. క్వాలిటీ సినిమాలు తీస్తారు. వంశీ, ప్రమోద్ మంచి టేస్టున్న నిర్మాతలు. ‘భలే భలే మగాడివోయ్’ తో మా మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ అనుబంధంతోనే ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ తొలి కాపీని చూపించారు వంశీ. సినిమా చూస్తూ చాలా ఎంజాయ్ చేశా. వినోదం నాకు బాగా నచ్చింది. దాంతో నేను, నా మిత్రులు కలసి కృష్ణా జిల్లాలో పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాం.’’ - మారుతి, దర్శకుడు