express raja
-
అరె కలరుఫుల్లు చిలకా!
‘బీరువా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సురభి... ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘ఎటాక్’, ‘ఒక్క క్షణం’... సినిమాలతో మరింత చేరువయింది. ‘ఓటర్’ సినిమాతో మరోసారి పలకరించనున్న సురభి ముచ్చట్లు... పాడుతా తీయగా! చిన్నప్పటి నుండి సినిమాలు అంటే ఇష్టం. పాటలు పాడటం, పియానో ప్లే చేయడం, పెయింటింగ్ వేయడం, డ్యాన్స్ చేయడం...ఇలా రకరకాల అభిరుచులు ఉండేవి. పేరెంట్స్ ప్రోత్సాహం బాగా ఉండేది. ఇప్పటికీ నా స్ట్రెంత్ పేరెంట్సే. నా అభిమాన తార మాధురిదీక్షిత్. ఢిల్లీలో ఉన్నప్పుడు మోడలింగ్ చేశాను. నటనలో కూడా శిక్షణ తీసుకున్నాను. గజిని 2లో... మోడలింగ్ చేస్తున్న టైమ్‌లో ఒక తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. నటి కావాలనే నా కల అలా నిజమైంది. ఇప్పటికీ టఫ్ రోల్ అంటే నా తొలి సినిమాలో చేసిన ‘మాలిని’ పాత్ర అంటాను. పేజీల కొద్ది తమిళ డైలాగులు నోటికి చెప్పేదాన్ని. లిప్‌సింక్ చక్కగా కుదిరేది. దీంతో దక్షిణాది సినిమాల్లో నటించగలను అనే నమ్మకం ఏర్పడింది. ‘‘ఇక్కడ ఎక్కువమందితో ఫ్రెండ్షిప్ చెయ్, వారితో తమిళ్లోనే మాట్లాడు...అప్పుడు చకచకా మాట్లాడగలవు’’ అని డైరెక్టర్ మురగదాస్ సలహా ఇచ్చారు. అప్పుడు నేను... ‘‘సార్, గజిని 2 ఎప్పుడు తీస్తున్నారు? అందులో నన్ను తీసుకుంటారు కదా!’’ అన్నాను. ఆయన నవ్వారు. పాఠాలేన్నో నేర్చుకొని... సులభంగా ఏది దరికి చేరదు అని నమ్ముతాను. సినిమాల్లో నటించాలనేది నా కల. నా కల కోసం అవకాశాలు వెదుక్కుంటూ రావు కదా! అందుకే ఎన్నో ఆడిషన్ టెస్ట్‌లకు హాజరయ్యాను. ఫలితం మాట ఎలా ఉన్నా పట్టుదలగా ముందుకు వెళ్లాను. ప్రతి ఆడిషన్ టెస్ట్ నుంచి పాఠాలు నేర్చుకున్నాను. తీరికవేళల్లో సంగీతం వింటాను. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కదా! ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలా అనుకున్నారు... చిన్నప్పుడు సంగీతం మీద నా ఆసక్తిని చూసి... ‘‘మా అమ్మాయి భవిష్యత్‌లో మ్యూజీషియన్ అవుతుంది’’ అనుకున్నారు పేరెంట్స్. బొమ్మలు వేయడం చూసి... ‘‘పెయింటర్ అవుతుంది’’ అనుకున్నారు! కానీ ‘‘నువ్వు ఇది కావాలి.... అది మాత్రమే చదవాలి’’ అని ఎప్పుడూ బలవంత పెట్టలేదు. మా పేరెంట్స్ అడ్వర్టైజింగ్ రంగానికి చెందినవారు. ఆ క్రియేటివ్ జీన్స్ నాకు వచ్చాయేమో! డిస్కవరింగ్ ‘నువ్వు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ చేయవచ్చు కదా!’ అని సన్నిహితులు సలహా ఇస్తుంటారు. ‘ఎలాంటి పాత్ర చేయాలి?’ అనే దాని గురించి నాకేమీ గందరగోళం లేదు. నటిగా ముందు నన్ను నేను డిస్కవరింగ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నా. -
హ్యాట్రిక్ హీరో ఖాళీగా ఉన్నాడు
ఇండస్ట్రీలో ఏ హీరో అయినా ఒక్క హిట్ ఇస్తే చాలు గ్యాప్ తీసుకోకుండా వెంటనే మరో సినిమా మొదలెట్టేస్తారు. అలాంటిది ఓ యంగ్ హీరో మాత్రం వరుసగా మూడు హిట్స్ ఇచ్చిన తరువాత కూడా మరో సినిమాను మొదలెట్టడానికి ఆలోచిస్తున్నాడు. రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో వరుస సక్సెస్‌లు సాధించిన యంగ్ హీరో శర్వానంద్. ఇంత మంచి ఫాంలో ఉన్న ఈ యంగ్ హీరో చాలా రోజులుగా తన నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేయకుండా ఎదురు చూస్తున్నాడు. శర్వా చివరి చిత్రం ఎక్స్‌ప్రెస్ రాజా సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ అయ్యింది. స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నా డీసెంట్ హిట్‌తో ఆకట్టుకున్నాడు శర్వానంద్. ఈ సినిమాతో స్టార్ లీగ్‌లో చేరిపోయాడని భావించినా.. తరువాత మాత్రం స్లో అయ్యాడు. ఎక్స్ ప్రెస్ రాజా రిలీజ్ అయి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించలేదు. దిల్‌రాజు నిర్మాణంలో శతమానం భవతి సినిమాలో నటిస్తున్నాడంటూ టాక్ వినిపించినా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. -
గాంధీతో సినిమా చేస్తాడట..?
'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ. తొలి సినిమాతోనే ఘనవిజయం సాధించిన గాంధీ, ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేశాడు. శర్వానంద్ హీరోగా తెరకెక్కించిన 'ఎక్స్‌ప్రెస్ రాజా' సంక్రాంతి బరిలో భారీ సినిమాలతో పోటి పడి కూడా మంచి విజయం సాధించింది. దీంతో ఇప్పుడు స్టార్ హీరోలు కూడా మేర్లపాక గాంధీతో సినిమాకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఈ లిస్ట్‌లో అందరి కంటే ముందున్నాడు. ఇప్పటికే ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాపై పాజిటివ్‌గా స్పందించిన చెర్రీ, మంచి కథ రెడీ చేస్తే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం తనీ ఒరువన్ రీమేక్‌గా రూపొందనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్న చరణ్, ఆ సినిమా పూర్తయ్యే లోపు మరో సినిమాను లైన్లో పెట్టాలని భావిస్తున్నాడు. మరి గాంధీ మూడో సినిమా చరణ్‌తోనే ఉంటుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
ఓ ట్రాన్స్‌లో ఉన్నా! - హీరో శర్వానంద్
‘‘సినిమా సక్సెస్ కావడం సంతోషంగా ఉంది. అందరూ హిట్ అంటుంటే ఓ ట్రాన్స్‌లో ఉన్నా. కలెక్షన్స్ చూశాక నిజంగా హిట్ సాధించామని గర్వంగా చెబుతున్నా’’ అని హీరో శర్వానంద్ అన్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శర్వానంద్, సురభి జంటగా యువి క్రియే షన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఈ నెల 14న రిలీజైంది. ఈ చిత్రానికి స్పందన వస్తుండ డంతో హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. మేర్లపాక గాంధీ, ప్రమోద్, విక్కీ, రవీందర్, బ్రహ్మాజీ, నాగి నీడు, ధన్‌రాజ్, రఘు మాస్టర్, సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, జె.బి తదితరులు పాల్గొన్నారు. -
భారీ లాభాల బాటలో సంక్రాంతి ఎక్స్‌ప్రెస్ రాజా
విడుదలైన మొదటి వారంలోనే లాభాల్లోకి ఎంటర్ అవుతున్న మొదటి సంక్రాంతి చిత్రంగా నిలవనున్న యువి క్రియేషన్స్ నిర్మించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఓ స్టార్ హీరో సినిమా వస్తుందంటే కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తాం. ఓ స్టార్ డెరైక్టర్ సినిమా విడుదలవుతుందంటే ఉండే హంగా మానే వేరు. స్టార్ హీరోలకు, స్టార్ డెరైక్టర్ల చిత్రాలకు ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుందో... అంతటి క్రేజ్ సంపాదించుకున్న సంస్థ ‘యువి క్రియేషన్స్’. ప్రభాస్‌తో ‘మిర్చి’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం నిర్మించిన తర్వాత యువి క్రియేషన్స్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ‘మిర్చి’లాంటి భారీ చిత్రం తర్వాత ‘రన్ రాజా రన్’ వంటి మీడియం బడ్జెట్ చిత్రాన్ని నిర్మించి, అన్ని రకాల చిత్రాల్ని ప్రోత్సహించడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని నిర్మాతలు వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిరూపించారు. ‘మిర్చి’తో కొరటాల శివను, ఆ తర్వాత ‘రన్ రాజా రన్’తో సుజిత్‌ను దర్శకులుగా ఇంట్రడ్యూస్ చేశారు. గోపీచంద్‌లోని స్టైలిష్ యాంగిల్‌ను ప్రెజెంట్ చేస్తూ, తీసిన ‘జిల్’ ద్వారా రాధాకృష్ణ కుమార్‌ను దర్శకునిగా పరిచయం చేసింది యువి క్రియేషన్స్. మారుతీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్‌కు చెందిన జిఎ 2 పతాకంతో కలసి నిర్మించిన ‘భలే భలే మగాడివోయ్’ ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది యువి క్రియేషన్స్. ‘బాహుబలి’ కి ముందు ‘మిర్చి’ చిత్రం ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. ‘రన్ రాజా రన్’ శర్వానంద్‌కు, ‘భలే భలే మగాడివోయ్’ నానికి బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో యువి క్రియేషన్స్‌లో సినిమా తప్పకుండా చేయాలనే ఆసక్తి అందరిలో కలుగుతోంది. మంచి కంటెంట్, క్వాలిటీ, కమిట్మెంట్తో కన్విన్సింగ్‌గా నిర్మిస్తే బ్లాక్ బస్టర్స్ అవుతాయనడానికి మరో నిదర్శనం తాజా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. కామెడీనే ప్రధాన వస్తువుగా... హాలీవుడ్ సినిమాల్లో మనం చూసే స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో కుటుంబం అంతా కలసి హాయిగా నవ్వుకునే చిత్రాన్ని నిర్మించింది యువి క్రియేషన్స్. ఒకసారి కథను, దర్శకుణ్ణి నమ్మిన తర్వాత ఫ్రీడమ్ ఇస్తే అద్భుతమైన చిత్రాలు బయటికొస్తాయనడానికి ఎగ్జాంపుల్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. అలాంటి ఫ్రీడమ్‌ను అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈ సంక్రాంతి పండగ బరిలో ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, బాలకృష్ణ ‘డిక్టేటర్’, నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి భారీ చిత్రాలతో పాటు ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రం విడుదలైంది. బడ్జెట్ తక్కువైనా క్వాలిటీ, థియేటర్స్, ప్రమోషన్ విషయంలో రాజీపడలేదు. సంక్రాంతి పర్వదినాన విడుదలైన అన్ని చిత్రాల్లోకెల్లా ముందుగా బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంటున్న చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కావడం విశేషం. అన్ని సెంటర్స్‌లో మంచి రెస్పాన్స్ సాధించి, డిస్ట్రిబ్యూటర్స్ మంచి లాభాలు గడించే చిత్రంగా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ నిలిచింది. సంక్రాంతి బరిలో నిలుస్తుందా? అన్నవారే ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ చూసి ఔరా అంటున్నారు. సుమారు 7 కోట్ల రూపాయలతో నిర్మించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రం విడుదలైన మూడు రోజులకే ఐదున్నర కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. సోమవారానికి లాభాల బాట పయనించనుందన్న మాట. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఘనవిజయం అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి మాట్లాడుతూ -‘‘మా సంస్థ నుంచి వచ్చిన ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘జిల్’, ‘భలే భలే మగాడి వోయ్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాలను ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లోనే తొందరగా బ్రేక్ ఈవెన్ అందుకోబోతున్న చిత్రంగా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ నిలవడం సంతోషంగా ఉంది. విడుదలైన తొలివారమే లాభాలు అందుకోబోతోంది. ఈ సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ వీక్ కాంపిటీషన్ వల్ల తక్కువ స్క్రీన్స్‌లో విడుదలైంది. రెండో వారం నుంచి మరిన్ని థియేటర్స్ యాడ్ అవుతున్నాయి. చెన్నై, కర్ణాటకలోనూ రిలీజ్ చేస్తున్నాం. మౌత్ టాక్, మంచి రివ్యూలు రావడం తో రెండో వారంలోనూ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణకు, చూపిస్తున్న అభిమానానికి తగ్గట్టుగా మరిన్ని మంచి చిత్రాలను భవిష్యత్తులో అందిస్తామని మాటిస్తున్నాం’’ అని అన్నారు. -
ప్రభాస్ అన్న అభినందించాడు
రన్ రాజా రన్... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు... ఎక్స్‌ప్రెస్ రాజా... వరుసగా ఈ మూడు విజయాలతో హ్యాట్రిక్ సాధించారు శర్వానంద్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాైకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఈ సం్రక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయానందంలో ఉన్న శర్వా చెప్పిన ముచ్చట్లు... సంక్రాంతి పండగ సందడి మీలో ఇంకా కనిపిస్తోంది? పండగ సందడి ఎలానూ ఉంటుంది. దాంతోపాటు హిట్ తాలూకు ఆనందం కూడా ఉంటుంది కదా. ముగ్గురు పెద్ద హీరోలతో పోటీ అంటే టెన్షన్ అనిపించలేదా? ఇప్పటిదాకా నాకు సంక్రాంతి రిలీజ్ లేదు. ఇన్నేళ్లల్లో ఇదే మొదటిసారి. సినిమా మీద నమ్మకంతో సంక్రాంతికి వచ్చాం. హీరోగా చాన్స్ అంటేనే కష్టం.. పేరు తెచ్చుకోవడం ఇంకా కష్టం. సంక్రాంతి రేస్‌కి రావడమంటే చాలా కష్టం కదా? అవునండి. యాక్చువల్‌గా సంక్రాంతి రిలీజ్లో నా సినిమా ఉండాలనే కోరిక ఉండేది. యువీ క్రియేషన్స్‌లో సినిమా చేయడం వల్ల లక్కీగా అది నెరవేరింది. వంశీ, ప్రమోద్ సినిమా స్టార్ట్ చేసినప్పట్నుంచీ ‘మనం సంక్రాంతికి వస్తున్నాం’ అనేవారు. నటుడిగా మీరు బెస్ట్ కాబట్టి, పెద్ద స్పాన్ ఉన్న కథలు చేస్తే, ఇమేజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కదా? నాకోసం కథలు రాయమని ఎవర్నీ అడగను. నా దగ్గరకొచ్చే దర్శకుడు నన్నెలా చూపించాలనుకుంటారో అలా కనిపిస్తా. ఒకవేళ పెద్ద స్పాన్ ఉన్న కథలు వస్తే చేస్తా. నా సినిమా చూడాలంటే కథలో కంటెంట్ ఉండాలి. లేకపోతే ప్రేక్షకులు నా సినిమా ఎందుకు చూడాలి? ‘శర్వా సినిమాలో కంటెంట్ ఉంటుంది’ అని నమ్మి, థియేటర్‌కి వచ్చేవాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలనుకుంటాను. మొదటిసారి ఈ చిత్రంలో బాగా డ్యాన్స్ చేసినట్లున్నారు? డ్యాన్స్ అంటే టెన్షన్. చేయాల్సిందేనని ‘కలర్‌ఫుల్ చిలకా’ పాటకు గాంధీ చేయించాడు. అలా డ్యాన్స్ చేయడం ఇదే ఫస్ట్‌టైమ్. ప్రభాస్ సినిమా బాగుందన్నారు.. మరి.. మీ క్లోజ్‌ఫ్రెండ్ రామ్‌చరణ్? ప్రభాస్ అన్న అభినందించాడు. చరణ్ బెంగళూరులో ఉన్నాడు కాబట్టి, చూడలేదు. పాటలు చూసి, ‘ఏంట్రా ఈ రేంజ్లో డ్యాన్స్ చేశావ్’ అన్నాడు. అది సరే... మాస్ ఇమేజ్‌ని కోరుకోవడంలేదా.. పది మంది విలన్లను రఫ్ఫాడించాలని లేదా? ఎందుకుండదండీ! ఉంటుంది. కానీ, అలాంటి కథలు రావాలి కదా. వస్తే చేస్తాను. ఇమేజ్ గురించి చెప్పాలంటే.. మాస్, క్లాస్ అని ప్రత్యేకంగా నేను దేన్నీ టార్గెట్ చేయడంలేదు. ఇక్కడి హీరోలు తమిళంలో.. అక్కడివాళ్లు ఇక్కడా మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్నారు. మీకు, ఒక్క ‘ఎంగేయుమ్ ఎప్పో దుమ్’ చిత్రంతోనే తమిళంలో మార్కెట్ పెరిగింది.. మరి అక్కడ? ఆ సినిమా తర్వాత తమిళంలో మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగు చిత్రాలతో బిజీ కావడంవల్ల చేయలేకపోయాను. ఈ ఏడాది చివర్లో ఓ తమిళ సినిమా కమిట్ అవుతా. -
వినోదమే... ఎక్స్‌ప్రెస్!
తారాగణం: శర్వానంద్, సురభి, సప్తగిరి, ‘ప్రభాస్’ శ్రీను, కెమేరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ ఆద్యంతం వినోదం పంచే సినిమాలకు ఆదరణ లభిస్తున్న రోజులివి. అందుకని ఎంటర్టైన్మెంటే వెండితెరకు వేదమైంది. ఆ పంథాలోనే వచ్చిన కొత్త ప్రయత్నం - ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. కథగా చెప్పాలంటే, వైజాగ్‌లో పనికిమాలిన వాడనే ముద్రపడ్డ హీరో రాజా (శర్వానంద్). అతను తండ్రి (నాగినీడు)నీ, కుటుంబాన్నీ వదిలి, హైదరాబాద్కొస్తాడు. అక్కడ పొట్టపోసుకుంటూ ఉంటాడు. అమూల్య అలియాస్ అమ్ము (సురభి) అతనికి తారసపడుతుంది. హీరోయిన్‌కు కుక్క లంటే ప్రేమ. హీరోకు కుక్కలంటే చీకాకు. తీరా ఆమెతో ప్రేమలో పడతాడు. మునిసిపాలిటీకి పట్టిచ్చిన హీరోయిన్ కుక్కను ప్రేమ కోసం వెనక్కి తేవడానికి బయలుదేరతాడు. హీరోయిన్ను పెళ్ళా డాలని సిద్ధపడే విలన్ (హరీష్ ఉత్తమన్), కుక్క బెల్ట్‌లో 75 కోట్ల విలువైన వజ్రం దాచే బినామీ బ్రిటిష్ (సుప్రీత్) - ఇలా అనేక పాత్రలు ఆ జర్నీలో ఎదురవుతాయి. హైదరాబాద్, నెల్లూరు, కావలి, ఒంగోలు మీదుగా కథ ఎటు తిరిగినా, అందరి పాట్లూ ఆ కుక్క కోసమే. చివరకు, హీరో ఆ కుక్కను తిరిగి ఎలా తెచ్చి, హీరోయిన్ను పెళ్ళాడాడన్నది మిగతా కథ. ఎందుకూ పనికిరాడనుకున్న రాజా పాత్ర నుంచి హైదరాబాద్‌లో ప్రేమికురాలి ప్రేమ కోసం ‘కుక్క’పాట్లు పడే ప్రేమికుడిగా శర్వానంద్ నేచురల్ యాక్టింగ్ చేశారు. చూడముచ్చటగా ఉండే అవసరాన్ని సురభి తీర్చారు. హీరో పక్కనే ఉండే పాత్రల్లో ప్రభాస్ శ్రీను, సప్తగిరి కామెడీకి పనికొచ్చారు. దుష్టపాత్రల్ని కూడా కామెడీకి వాడుకున్నారు. ఎమ్మెల్యే కావాలని ఆశపడే నెల్లూరు కేశవరెడ్డి పాత్రలో హరీశ్ ఉత్తమన్, అతని అనుచరుడైన బినామీ బ్రిటీష్‌గా సుప్రీత్ కనిపిస్తారు. ఊర్వశి కూడా వినోదం పండించారు. చిత్ర సాంకేతిక వర్గంలో ప్రధానంగా చెప్పాల్సినది కెమేరామన్ కార్తీక్ ఘట్టమనేని ప్రతిభ. గత చిత్రాల్లానే దీనిలోనూ లైటింగ్, చిత్రీకరణ విధానాల్లో అతని ప్రతిభ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎన్నారై ప్రవీణ్ లక్క రాజు సంగీతంలో సెకండాఫ్ మొదట్లో వచ్చే పాట బాగుంది. అలాగే జాతరలో వచ్చే రికార్డింగ్ డ్యాన్స పాట, చిత్రీకరణ ఆకట్టుకుంటాయి. తొలి చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో ఆకర్షించిన దర్శకుడు మేర్లపాక గాంధీకి ఇది రెండో ప్రయత్నం. తొలి సినిమా చూశాక, పెరిగిన అంచనాలతో ప్రేక్షకులు హాలుకీ వెళతారు. కానీ ఈసారి ఆయన కథగా కన్నా పాత్రలు, వాటి మధ్య సన్నివేశాలు, సంభాషణల మీదే దృష్టి పెట్టారు. ఇనప వస్తువుల్ని దొంగతనం చేసే ‘ఇనుము’ (ధన్‌రాజ్), చిరంజీవి లాంటి స్టార్స్‌ని అనుకరిస్తూ రికార్డింగ్ డ్యాన్స్‌లు చేసే ట్రూప్ యజమాని (‘షకలక’ శంకర్), కుక్కల్ని పట్టగల గిరి (సప్తగిరి) - ఇలా చిత్ర విచిత్రమైన అలవాట్లున్న పాత్రల్ని సృష్టించుకున్నారు. వీటన్నిటికీ మధ్య లింకుగా ‘కుక్క’ అనే కామన్ ఎలిమెంట్‌ను పెట్టుకున్నారు. పాత్రలు, జరిగే సంఘటనలన్నీ యాదృచ్ఛికంగా ఒక చోట కలగలిసిపోవడమనే స్క్రీన్‌ప్లే టెక్నిక్ అనుసరించారు. దాంతో, కథ కన్నా సంఘటనలే ఎక్కువ. కాబట్టి, ఎక్కడ నుంచి చూసినా దాదాపు కథ అర్థమవుతూనే ఉంటుంది. ఇక, ఈ సినిమా ద్వారా తెలుగు తెరకొచ్చిన కొత్త ఆయుధం - డిక్షనరీ. హీరో హైదరాబాద్‌లో కాలేజీలు తిరిగి డిక్షనరీలమ్మే పనిలో ఉంటాడు. కాబట్టి, అందుకు అనుగుణంగా లావాటి డిక్షనరీలు చదువుకోవడానికే కాదు...విలన్‌ను గ...ట్టిగా కొట్టి, పడగొట్టడానికీ పనికొస్తాయని సినిమాలో చూపెట్టారు. జాగ్రత్త, ఓపిక ఉంటే, ఇలా రొటీన్‌కు భిన్నమైనవి సిన్మాలో చాలా వెతుక్కోవచ్చు. అందుకే, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వినోద ప్రియ ప్యాసిం జర్స మహారాజా. తెరపై కుక్కపాట్లను తీరికగా కూర్చొని, చూడాల్సిన కాలక్షేప కామెడీ. - రెంటాల జయదేవ -
ప్రభాస్ ప్రశంస మర్చిపోలేను
‘ఎక్స్‌ప్రెస్ రాజా’ మనసిచ్చిన రాణి ఎలా ఉంటుంది? అందానికి ఆధార్ కార్డ్‌లా ఉంటుంది. పేరు అమూల్య. మరి సెలైంటా అంటే కాదు తేడా వస్తే ఇరగదీస్తుంది కూడా. అందుకే తనను ఏడిపించాలని చూసిన కొంత మందిని ఓ మార్కెట్లో అందరి ముందూ చితక్కొట్టేస్తుంది. అదే అమూల్య ఇంట్రడక్షన్ సీన్’’ అని కథానాయిక సురభి అంటున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శర్వానంద్, సురభి జంటగా యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు నిర్మించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఈ గురువారం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన సినిమా విశేషాలు...! తెలుగులో నా మొదటి సినిమా ‘బీరువా’. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘ఎటాక్’ కూడా చేశాను. కానీ ఇది ముందు రిలీజ్ అవుతోంది కాబట్టి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ నా రెండో సినిమా. ఈ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లాను. లక్కీలీ అమూల్య పాత్ర నాకే రాసి పెట్టి ఉందేమో అందుకే నన్నే వరించింది. ఇక శర్వానంద్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ‘జర్నీ’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ లాంటి చిత్రాల్లో ఆయన యాక్టింగ్‌కు నేను ఫ్యాన్‌ను. పైగా సినిమాలో మా జంట ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ కలిగిస్తుంది. ఇప్పటివరకూ నేను కాస్త హోమ్లీ పాత్రలే చేశాను. నటి అంటే అన్ని రకాల పాత్రలు చేయగలగాలి. ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్, శర్వానంద్ యాక్షన్, మేర్లపాక గాంధీ డెరైక్షన్ అన్నీ ఈ సినిమాకు పర్ఫెక్ట్గా కుదిరాయి. అందరం కష్టపడి ఈ సినిమా కోసం పనిచేశాం. హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. నేను ప్రభాస్‌గారికి పెద్ద అభిమానిని. ఈ సినిమాలోని ‘కలర్ ఫుల్ చిలకా’ పాటలో బాగున్నానని చెప్పిన ప్రశంస మర్చిపోలేను. త్వరలో రానున్న ఎటాక్‌లో కూడా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నాకు మంచి రోల్ ఇచ్చారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో కార్ మెకానిక్ రోల్ చేశాను. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో నాని సరసన నటిస్తున్నాను. తమిళంలో జై హీరోగా ఓ సినిమాలో నటించాను. విడుదలకు సిద్ధంగా ఉంది. -
'ఎక్స్‌ప్రెస్ రాజా' కథ ఇదేనా..?
భారీ సినిమా రిలీజ్ అయిన వారం తరువాత కూడా తమ సినిమా రిలీజ్ చేయడానికి ఆలోచిస్తారు చిన్న సినిమా నిర్మాతలు. అలాంటిది మూడు భారీ చిత్రాలు బరిలో ఉన్నా.. అదే సమయంలో రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు 'ఎక్స్‌ప్రెస్ రాజా'. శర్వానంద్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14న విడుదలవుతోంది. అంత ధైర్యంగా సినిమా రిలీజ్ చేయడానికి ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలో ఏముందన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అందుకు తగ్గట్టుగానే ఇదే ఎక్స్‌ప్రెస్ రాజా కథ అంటూ ఓ లైన్ ప్రచారంలోకి వచ్చింది. ఎక్స్‌ప్రెస్ రాజా కథ అంతా ఓ కుక్క చుట్టూ తిరుగుతుంది. కుక్కలంటే అస్సలు గిట్టని హీరో రాజా, తన కుక్కను ప్రాణంగా చూసుకునే సురభితో ప్రేమలో పడతాడు. అదే సమయంలో ఆ కుక్క తప్పిపోతుంది. దానిని వెతికే ప్రయత్నంలో ఎన్నో పాత్రలు వస్తాయి. ఇంతమంది ఆ కుక్క కోసం ఎందుకు వెతుకుతున్నారో అర్థం కాక హీరో తికమకపడుతుంటాడు. అయితే చివరగా ఆ కుక్క మెడలో ఓ డైమండ్ ఉన్నట్టు తెలుసుకుంటాడు. ఫైనల్‌గా ఆ కుక్కను పట్టుకొని హీరోయిన్ ప్రేమను గెలుచుకుంటాడు. ఇదే ఎక్స్‌ప్రెస్ రాజా కథ అన్న విషయం అఫీషియల్‌గా తెలియకపోయినా.. ఈ కథ అయితే బాగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో కేవలం ఒక జర్నీనే కథగా మలిచి ఎంటర్టైన్ చేసిన మేర్లపాక గాంధీ వినోదం పంచటానికి ఎంతో స్కోప్ ఉన్న ఈ తరహా కథతో అయితే మ్యాజిక్ చేయటం గ్యారెంటీ అంటున్నారు సినీ అభిమానులు. మరి ఎక్స్‌ప్రెస్ రాజా కథ ఇదేనా..? కాదా..? తెలియాలంటే ఫస్ట్ షో పడే వరకు వెయిట్ చేయాల్సిందే. -
గాంధీ అసలు పేరు చే గెవెరా..!
తొలి సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ. లాంగ్ గ్యాప్ తరువాత ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సంక్రాంతి బరిలో భారీ సినిమాలతో ఢీ కొనడానికి రెడీ అవుతున్న గాంధీ, తన పేరుకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం గాంధీగా అందరికీ పరిచయం అయిన ఈ యువ దర్శకుడుకి చిన్నతనంలో పెట్టిన పేరు వేరే ఉందట. అభ్యుదయ భావాలు ఉన్న గాంధీ తండ్రి మేర్లపాక మురళి తన అభిమాన పోరాట యోధుడు చేగువెరా పేరును తన కొడుకు పెట్టాడు. అయితే బంధువులు స్నేహితులు మాత్రం ఆ పేరు పిలవటం సారిగా రాకపోవటంతో చెగు, జగ్గు అని పిలుస్తుండటంతో, 5 ఏళ్ల వయసులో చేగువెరా పేరును గాంధీగా మార్చాడట. అలా ఓ విప్లవకారుడి పేరు, శాంతి కాముకుడిగా పేరుగా మారిపోయింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎక్స్‌ప్రెస్ రాజా జనవరి 14న రిలీజ్ అవుతోంది. శర్వానంద్, సురభి జంటగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. -
తెరపై వినోదాల విందు... ఎక్స్‌ప్రెస్ రాజా
2016 సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వాటిలో ఎంటర్టైన్మెంట్ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఈ చిత్రంలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్... ఎంటర్టైన్మెంట్... ఎంటర్టైన్మెంట్ అని ఏ ముహూర్తాన అన్నారో కానీ, గత దశాబ్ద కాలంగా ఎంటర్టైన్మెంట్ ఉన్న చిత్రాలు మినిమమ్ గ్యారంటీతో సూపర్‌డూపర్ హిట్స్ అవుతున్నాయి. అగ్ర హీరోలు సైతం ఎంటర్టైన్మెంట్నే నమ్ముకోవడం విశేషం. ఇది ఇలా ఉండగా ఇటీవల విడుదలైన ఏ చిత్రాన్ని తీసుకున్నా అన్నీ ఎంటర్టైన్మెంట్కి పెద్దపీట వేసినవే. 2016 సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే వాటిలో ఎంటర్టైన్మెంట్ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఈ చిత్రంలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. దానికి తోడు యువి క్రియేషన్స్ సంస్థ తమ చిత్రాల్లో తప్పనిసరిగా వినోదం ఉండేలా చూసుకుంటుంది. గతంలో ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాయి. ఇప్పుడు ఆ బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఈ నెల 14న విడుదలవుతున్న సందర్భంలో ప్రమోషన్ కూడా తారస్థాయిలో చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం కౌంట్ డౌన్స్ విడుదల చేస్తున్నారు. ఇటీవల అందరి ప్రశంసలూ అందుకుంటున్న ప్రముఖ హాస్యనటులు ఈ చిత్రంలో నటించారు. ఇందులో ప్రభాస్ శ్రీను - మావయ్య శ్రీనుగా నటిస్తున్నారు. మొట్ట మొదటిసారి హీరోతో సమానంగా నవ్వులు కురిపించే పాత్రలో నటిస్తున్నారు. వైజాగ్‌లో పనీపాటా లేనివారి జాబితాలో రెండవ స్థానం దక్కించుకుని మొదటి స్థానం కోసం గొడవ పడే చక్కటి పాత్రలో ఆయన నటించారు. ప్రభాస్ శ్రీను కెరీర్లోనే ఈ పాత్ర నిలిచిపోయేలా ఉంటుంది. ధన్‌రాజ్ ‘ఇనుము’ అనే పాత్రలో నటిస్తున్నారు. ధన్‌రాజ్ పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. నవ్వించటంతో పాటూ ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ మధ్య అందరి ప్రశంసలు అందుకుంటున్న బ్రహ్మాజీ ‘బిల్‌గేట్స్’ పాత్రలో, ‘షకలక’ శంకర్ ‘బీభత్స నటరాజ్’ పాత్రలో డ్రామా ఆర్టిస్ట్‌గా నటించారు. ‘షకలక’ శంకర్ ఇందులో మెగాస్టార్ చిరంజీవిని ఇమిటేట్ చేస్తూ చేసిన గెటప్ సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. ఈ చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీ మొదటి చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో కమెడియన్‌గా స్థిరపడిన సప్తగిరి ఈ చిత్రంలో ‘పొల్యూషన్ గిరి’గా మరొక్కసారి తన విశ్వరూపం చూపించారు. సప్తగిరి నటన ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇలా కథతో పాటూ కథనంతో పాటూ ఎంటర్టైన్మెంట్ని నమ్మి నిర్మించిన చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఫ్యామిలీతో సినిమాకి వెళ్లాలంటే చక్కటి వినోదం ఉండాలి. అలాంటి ఫుల్‌మీల్స్ ఉన్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు కూడా అందుకుంటుంది. ఈ సంక్రాంతిని వినోదాల ఎక్స్‌ప్రెస్ చేస్తుందనడంలో సందేహం లేదు. -
ప్రభాస్ చూశారు... బాగా ఎంజాయ్ చేశారు!
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లు.. ఒక్క హిట్ కెరీర్‌ని ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. అలాగే, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ హిట్ మేర్లపాక గాంధీ కెరీర్‌కి మంచి మైలురాయి అయ్యింది. దర్శకుడిగా తొలి చిత్రంతోనే అందర్నీ ఆకట్టుకున్న గాంధీ మలి చిత్రం కూడా అందరికీ నచ్చాలనే ఆకాంక్షతో కొంత టైమ్ తీసుకుని, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ని రూపొందించారు. శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ ఇంటర్వ్యూ... ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత రెండో సినిమా మొదలుపెట్టడానికి ఎక్కువ సమయం తీసుకున్నారేం? కథ తయారు చేసుకోవడానికి చాలా టైమ్ తీసుకున్నాను. ఏడాది పాటు స్క్రిప్ట్ వర్క్‌కే కేటాయించాను. ఫస్ట్ సినిమా మంచి హిట్ సాధించిన తర్వాత ఫ్లాప్ అయిన డెరైక్టర్స్‌లో నే ను ఉంటానేమో అని భయమేసింది. అందుకే వెంటనే సినిమా చేయాల్సిన అవసరం లేదు కదా అనిపించింది. మంచి సినిమా చేద్దామని ఇన్నాళ్లూ ఆగాను. నేననుకున్నట్లుగానే మంచి సినిమానే చేశాను. మీ మొదటి సినిమాలా ఇది కూడా వినోద ప్రధానంగా సాగుతుందనిపిస్తోంది? నేను కాలేజీ రోజుల్లో ఓ సీరియస్ షార్ట్ ఫిలిం తీశాను. ఎవరూ చూడలేదు. ఆ తర్వాత ‘కర్మరా దేవుడా’ అని హిలేరియస్ షార్ట్ ఫిలిం తీశాను. అందరికీ తెగ నచ్చేసింది. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారని అర్థమైంది. అందుకే నా మొదటి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’నీ, ఇప్పుడు ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాన్ని కూడా అదే జానర్లోనే తీశాను. శర్వానంద్‌ని హీరోగా మనసులో పెట్టుకునే ఈ కథ రాసుకున్నారా? లేదు. ముందు కథ రాసేశాను. అప్పుడు శర్వానంద్ యాక్ట్ చేసిన ‘రన్ రాజా రన్’ చూశాను. ఆ సినిమాలో చాలా కొత్త శర్వానంద్ కనిపించాడు. నా హీరో క్యారెక్టర్‌కు సూట్ అవుతాడనుకుని, ఆయనకీ కథ చెప్పాను. వినడం, ఓకే అనడం జరిగిపోయాయి. ఆయనే యూవీ క్రియేషన్స్‌ను సజెస్ట్ చేశారు. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘జిల్’, ‘భలే భలే మగాడివోయ్’ లాంటి మంచి సినిమాలు తీసిన సంస్థ కాబట్టి, నాకు చాలా ఆనందం అనిపించింది. ఈ సంస్థతో ఎవరు చేసినా లవ్‌లో పడిపోతారు. నా నెక్స్ట్‌సినిమా కూడా యూవీ బ్యానర్లోనే ఉంటుంది. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కథేంటి? ఈ సినిమాలో మొత్తం అయిదు కథలుంటాయి. ప్రతి అయిదు నిమిషాలకో ట్విస్ట్ ఉంటుంది. 15 నిమిషాలకు ఓ కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. విలన్‌గా ఊర్వశి, ‘షకలక’ శంకర్, సప్తగిరి ఇలా చాలా రకాల క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి. వాళ్ల క్యారెక్టర్స్‌కు, హీరో కథకు సంబంధం ఏంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎంటర్టైన్మెంట్ బేస్డ్ లవ్ స్టోరీ ఇది. చాలా యూత్‌ఫుల్‌గా ఉంటుంది. స్క్రీన్‌ప్లే హాలీవుడ్ సినిమా ‘వాంటేజ్ పాయింట్’ తరహాలో ఉంటుంది. శర్వానంద్ ఆహార్యం తన గత సినిమాలతో పోలిస్తే కొత్తగా ఉంటుంది. శర్వానంద్ అద్భుతమైన నటుడు. బెటర్మెంట్ కోసం ఎన్ని టేక్స్ చేయడానికైనా వెనకాడడు. హీరో క్యారెక్టర్ చాలా స్పీడ్‌గా, స్క్రీన్‌ప్లే చాలా రేసీగా ఉంటుంది. అందుకే ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అని పేరు పెట్టాం. హీరోయిన్ సురభి పాత్ర పేరు అమూల్య. ఆమె పాత్ర కూడా చాలా బాగుంటుంది. శర్వానంద్ చేసిన ‘రన్ రాజా రన్’, మీరు చేసిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ హిట్ కాబట్టి, ఈ రెండు చిత్రాల టైటిల్స్ కలిసొచ్చేట్లు ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అని పెట్టారా? అందరూ అనుకుంటున్నట్టు సెంటిమెంట్ కోసం సినిమా టైటిల్ అలా పెట్టలేదు. ఇందులో హీరో పేరు రాజా. ఆ పాత్ర చాలా రేసీగా ఉంటుంది. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అని పెట్టడానికి అదో కారణం, ఆ సౌండింగ్ బాగుండటం మరో కారణం. సంక్రాంతికి మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి కదా? సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమా కంటెంట్ మీద మాకు బాగా నమ్మకముంది. అన్ని సినిమాల నడుమ ఈ సినిమా కిల్ కాదని మా ఫీలింగ్. నిర్మాతలు కూడా ఏం టెన్షన్ పడట్లేదు. వాళ్లు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మొత్తం 200పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఇంతకీ ఈ చిత్రాన్ని ఎవరికైనా చూపించారా? ప్రభాస్ చూశారు. రామ్‌చరణ్ పాటలు చూశారు. ఇద్దరూ బాగా ఎంజాయ్ చేశారు. మీ రెండో చిత్రాన్ని సుశాంత్‌తో చేద్దామనుకున్నారు కదా. ఆ సినిమా ఏమైంది? సుశాంత్‌తో అనుకున్నది వాస్తవమే. కానీ వాయిదా వేశాం. బేసిక్‌గా మీకెలాంటి సినిమాలంటే ఇష్టం? మా నాన్నగారు మేర్లపాక మురళి (రచయిత) రొమాంటిక్ కథలు రాయమంటారు. కానీ, నాకేమో ఎంటర్టైన్మెంట్ కథలు రాయడమే ఇష్టం. ఈ విషయం మీద మేమిద్దరం వాదించుకుంటాం కూడా. అయినా ఆయనలా నేనెంత రొమాంటిక్ సబ్జెక్ట్స్ రాయలేను. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ కూడా ఆడదని చెప్పారు. ఆ సినిమా కోసం బ్యానర్లు కట్టినప్పుడు తీసేయమన్నారు కూడా. కానీ, ఆడింది. ఈ సినిమా చూసి ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కెరీర్ వైజ్‌గా మీరు హ్యాపీ.. పర్సనల్ లైఫ్ మాటేంటి? నా భార్య పేరు సుష్మ. మాది లవ్ మ్యారేజ్. ఎనిమిదో తరగతి నుంచి నాతో కలిసి చదువుకుంది. బీటెక్‌లో ప్రపోజ్ చేశాను. ఓకే చెప్పింది. హ్యాపీగా పెళ్లి చేసుకున్నాం. గత ఏడాది ఆగస్టు 15న పాప పుట్టింది. తన పేరు లిపి. పర్శనల్ లైఫ్ హ్యాపీగా ఉంది. -
మరోసారి ప్రయోగానికే ఓటేశాడు
యంగ్ జనరేషన్ హీరోలలో ప్రయోగాత్మక చిత్రాలు చేయాలంటే ముందుగా వినిపించే పేరు శర్వానంద్. కెరీర్ స్టార్టింగ్ నుంచి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా సినిమాలు చేస్తున్న శర్వా అదే జానర్లో మంచి విజయాలు సాధిస్తున్నాడు. ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాతో స్టార్ హీరోలతో ఢీ కొడుతున్నాడు. ఈ సినిమా సక్సెస్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్న శర్వానంద్ తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా మరోసారి ప్రయోగానికే ఓటేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఎక్స్‌ప్రెస్ రాజాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న శర్వానంద్. త్వరలోనే ఓ ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమాకు రెడీ అవుతున్నాడు. సందీప్ కిషన్ హీరోగా రారా కృష్ణయ్య సినిమాను తెరకెక్కించిన మహేష్ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ లవ్ స్టోరి చేయడానికి రెడీ అవుతున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ఓ బడా నిర్మాణ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నారు. -
కితకితలు పెట్టే... ఎక్స్‌ప్రెస్ రాజా!
సంక్రాంతి అనగానే తెలుగు జనాలకు గుర్తొచ్చేవి కోడిపందేలు, కొత్త సినిమాలే. కూత పెట్టేందుకు కోళ్లు ఎలా సిద్ధమవుతు న్నాయో... బాక్సాఫీస్ బరిలో నిలిచేందుకు కొత్త సినిమాలు కూడా అలాగే ముస్తాబవు తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి పోటాపోటీగా నాలుగు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో బాలకృష్ణ, నాగార్జున, చిన్న ఎన్టీఆర్ వంటి హేమాహేమీల చిత్రాలు న్నాయి. మామూలుగా అయితే స్టార్ కథానాయకుడు నటించిన ఒక సినిమా విడుదలవుతోందనగానే... మిగిలిన సినిమాలు వెనక్కి వెళ్లే పరిస్థితులు కనిపిస్తుంటాయి. కానీ ఏకంగా ముగ్గురు స్టార్ కథానాయకుల సినిమాలు వస్తున్నప్పటికీ... వాటి మధ్యలో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటి నాన్‌స్టార్ సినిమా విడుదలవుతుండటం విశేషం. మూడు చిత్రాలు పందెం కోళ్లలాగా పౌరుషంతో కూడిన కంటెంట్‌తో వస్తుంటే... ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ మాత్రం కితకితలతోనే బాక్సాఫీసుని గెలుస్తానన్న ధీమాతో కనిపిస్తున్నాడు. ఆ ధీమాకు తగ్గట్టుగానే సినిమాపై ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ క్రియేటయ్యింది. మూడు సినిమాల గురించి జనం ఎంతగా మాట్లాడుకుంటున్నారో... ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. ఒక విజయవంతమైన కలయికతో రూపొందిన చిత్రం కావడమే అందుకు కారణం. ‘రన్ రాజా రన్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి హిట్లతో దూసుకెళుతున్న కథానాయకుడు... శర్వానంద్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో హిట్ సాధించిన దర్శకుడు మేర్లపాక గాంధీ. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘జిల్’, ‘భలే భలే మగాడివోయ్’ వంటి చిత్రా లతో వరుస విజయాలందుకున్న నిర్మాతలు వంశీ, ప్రమోద్. వీళ్లంతా కలసి సినిమా చేస్తున్నారంటే ఆటోమేటిగ్గా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతాయి. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ పై కూడా మొదట్నుంచీ ఆ రూపంలోనే పాజిటివ్ బజ్ క్రియేటయ్యింది. దాంతో ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. అలాంటి సినిమా సంక్రాంతి లాంటి ఒక మంచి సీజన్లో విడుదలవుతోందంటే ఇక తిరుగేముంటుంది. దానికితోడు ‘దిల్’ రాజు లాంటి ఓ అగ్ర నిర్మాత, మారుతీ లాంటి అగ్ర దర్శకుడు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్నారు. సినిమా నిర్మాణంలో యువీ క్రియేషన్స్ ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. కథానాయకుడు స్టార్ కాకపోయినా సరే... కంటెంట్‌ని నమ్మి ఖర్చుకి వెనకాడకుండా సినిమాను నిర్మిస్తుంటుంది. ప్రచార కార్యక్రమాల్నీ దీటుగా నిర్వహిస్తుంటుంది. ‘రన్ రాజా రన్’, ‘భలే భలే మగాడివోయ్’ అందుకు ఉదాహరణ. ఆ చిత్రాలు కనీవినీ ఎరుగని రీతిలో, స్టార్ కథానాయకుల చిత్రాలకు దీటుగా వసూళ్లను సొంతం చేసుకున్నాయి. వాటి స్ఫూర్తితో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ తెరకెక్కింది. ఇటీవలే కథానాయకుడు ప్రభాస్ చేతుల మీదుగా పాటలు విడుదలయ్యాయి. యువీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థతో సమానం. ఆయన పాటల వేడుకకి హాజరవడంతో సినిమాకు మంచి ప్రచారం లభించింది. థియేటర్ ట్రైలర్లకూ ఆదరణ లభించింది. మేర్లపాక గాంధీ మంచి వినోదా త్మక చిత్రాన్ని తీశాడని ట్రైలర్లని చూస్తే తెలుస్తోంది. శర్వానంద్, సురభి జంటగా నటించిన ఈ చిత్రంలో ‘ప్రభాస్’ శ్రీను, సప్తగిరి తదితర హాస్యనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 14న ఈ చిత్రం రిలీజవుతోంది. ‘‘యువీ క్రియేషన్స్ అంటే నాకు మొదటి నుంచి మంచి అభిమానం. క్వాలిటీ సినిమాలు తీస్తారు. వంశీ, ప్రమోద్ మంచి టేస్టున్న నిర్మాతలు. ‘భలే భలే మగాడివోయ్’ తో మా మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ అనుబంధంతోనే ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ తొలి కాపీని చూపించారు వంశీ. సినిమా చూస్తూ చాలా ఎంజాయ్ చేశా. వినోదం నాకు బాగా నచ్చింది. దాంతో నేను, నా మిత్రులు కలసి కృష్ణా జిల్లాలో పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాం.’’ - మారుతి, దర్శకుడు -
రేసీగా... లవ్ రాజా
అతనొక జులాయి... ఆవారా... ఇడియట్.ఇలా ఎవరు పిలిచినా దాన్నొక బిరుదులా భావిస్తాడు కానీ, ‘ తిట్టు ’ అని మాత్రం అనుకోడు. అలాంటివాడు కాస్తా రాత్రికి రాత్రి మారిపోయాడు. ఓ కొత్త ప్రొఫెషన్లోకి ఎంటరై అక్కడ మెరుపులు మెరిపించాడు. ఈ అద్భుతం ఎలా జరిగిందని అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా ఆశ్చర్యం కలిగించిన ఆ అద్భుతం పేరు ‘ ప్రేమ’. ఓ అమ్మాయితో ప్రేమలో పడి గూడ్స్‌బండిలా ఉండేవాడు కాస్తా ఎక్స్‌ప్రెస్‌లా పరుగులు తీయడం మొదలుపెట్టాడు. ఇలా రేసీ కాన్సెప్ట్‌తో ‘ఎక్స్‌ప్రెస్ రాజా ’ రూపొందింది. ‘ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ’ తర్వాత మేర్లపాక గాంధీ డెరైక్ట్ చేసిన సినిమా ఇది. ‘ రన్ రాజా రన్ ’, ‘ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ విజయాలతో ఊపు మీద ఉన్న శర్వానంద్ ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశారు. యూవీ క్రియే షన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ప్రభాస్ వచ్చారు.. హిట్ గ్యారంటీ!
- శర్వానంద్ ‘‘దర్శకుడు గాంధీకి చాలా క్లారిటీ ఉంది. ఒక్క షాట్ కూడా ఎక్కువగా తీయలేదని నిర్మాతలు ప్రమోద్, వంశీలు చెప్పారు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని ప్రభాస్ అన్నారు. శర్వానంద్, సురభి జంటగా యూవీ క్రియేషన్స్ పతాకంపై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ప్రమోద్, వంశీలు నిర్మించిన చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ప్రవీణ్ లక్కరాజు స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో హీరో ప్రభాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ-‘‘ ‘రన్ రాజా రన్’కు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు ప్రభాస్. ఇప్పుడీ సినిమా ఆడియో ఫంక్షన్‌కి కూడా వచ్చారు. కచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమాలో కథే హీరో. కథతో ట్రావెల్ అయ్యే సినిమా ఇది. ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది’’ అని చెప్పారు. ‘‘యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ బినామీ బ్యానర్ (నవ్వుతూ). శర్వానంద్‌ని నేనే ఓ డెరైక్టర్‌కు ఇంట్రడ్యూస్ చేశాను. అతను నాకు ఇంకా సినిమా చేయలేదు. వంశీ, ప్రమోద్‌లను చూసి నేను సినిమాలు తీయడం నేర్చుకోవాలి. కొత్త కాన్సెప్ట్‌లు ఎంచుకుంటున్నారు. మేమే ఇంకా మూస ధోరణిలో ఉన్నాం’’ అని ‘దిల్’ రాజు అన్నారు. మారుతి మట్లాడుతూ- ‘‘నేను రీసెంట్గా ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. ముఖ్యంగా కామెడీ బాగా కుదిరింది. తప్పకుండా హిట్ అవుతుంది’’ అని చెప్పారు. ఈ వేడుకలో నిర్మాతలు ప్రమోద్, వంశీ, బన్నీ వాసు, కథానాయిక సురభి, నటులు బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, సప్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభాస్ చేతుల మీదుగా 'ఎక్స్‌ప్రెస్ రాజా ’ ఆడియో
-
'ఎక్స్‌ప్రెస్ రాజా'గా శర్వానంద్
'రన్ రాజా రన్', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' లాంటి వరుస సూపర్ హిట్స్ తరువాత చిన్న బ్రేక్ తీసుకున్న శర్వానంద్, మరో ఆసక్తికరమైన సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సినిమా సెలక్షన్లో ఎప్పుడు కొత్త దనం చూపించే శర్వానంద్ మరోసారి అదే తరహా కథా కథనాలను ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే తన నెక్ట్స్ సినిమాకు 'ఎక్స్‌ప్రెస్ రాజా' అనే టైటిల్‌ను ఫైనల్ చేశాడు. 'ఎక్స్‌ప్రెస్ రాజా' అన్న టైటిల్ వెనుక కూడా ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అందుకే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచి ఎక్స్‌ప్రెస్ ను రన్ రాజా రన్ నుంచి రాజాను తీసుకొని ఈ సినిమాకు ఎక్స్‌ప్రెస్ రాజా అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈ సినిమాను కూడా రన్ రాజా రన్ ను నిర్మించిన యువి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారు. బీరువా సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సురభి ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.