ప్రభాస్ చూశారు... బాగా ఎంజాయ్ చేశారు! | Merlapaka Gandhi interview about Express Raja | Sakshi
Sakshi News home page

ప్రభాస్ చూశారు... బాగా ఎంజాయ్ చేశారు!

Published Sun, Jan 10 2016 10:45 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

ప్రభాస్ చూశారు... బాగా ఎంజాయ్ చేశారు! - Sakshi

ప్రభాస్ చూశారు... బాగా ఎంజాయ్ చేశారు!

 ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లు.. ఒక్క హిట్ కెరీర్‌ని ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. అలాగే, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ హిట్ మేర్లపాక గాంధీ కెరీర్‌కి మంచి మైలురాయి అయ్యింది. దర్శకుడిగా తొలి చిత్రంతోనే అందర్నీ ఆకట్టుకున్న గాంధీ మలి చిత్రం కూడా అందరికీ నచ్చాలనే ఆకాంక్షతో కొంత టైమ్ తీసుకుని, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ని రూపొందించారు. శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ ఇంటర్వ్యూ...
 
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత రెండో సినిమా మొదలుపెట్టడానికి ఎక్కువ సమయం తీసుకున్నారేం?
 కథ తయారు చేసుకోవడానికి చాలా టైమ్ తీసుకున్నాను. ఏడాది పాటు స్క్రిప్ట్ వర్క్‌కే కేటాయించాను. ఫస్ట్ సినిమా మంచి హిట్ సాధించిన తర్వాత ఫ్లాప్ అయిన డెరైక్టర్స్‌లో నే ను ఉంటానేమో అని భయమేసింది. అందుకే వెంటనే సినిమా చేయాల్సిన అవసరం లేదు కదా అనిపించింది. మంచి సినిమా చేద్దామని ఇన్నాళ్లూ ఆగాను. నేననుకున్నట్లుగానే మంచి సినిమానే చేశాను.

మీ మొదటి సినిమాలా ఇది కూడా వినోద ప్రధానంగా సాగుతుందనిపిస్తోంది?
 నేను కాలేజీ రోజుల్లో ఓ సీరియస్ షార్ట్  ఫిలిం తీశాను. ఎవరూ చూడలేదు. ఆ తర్వాత ‘కర్మరా దేవుడా’ అని హిలేరియస్ షార్ట్ ఫిలిం తీశాను. అందరికీ తెగ నచ్చేసింది. ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటున్నారని అర్థమైంది. అందుకే నా మొదటి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’నీ, ఇప్పుడు ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాన్ని కూడా అదే జానర్‌లోనే తీశాను.
 
శర్వానంద్‌ని హీరోగా మనసులో పెట్టుకునే ఈ కథ రాసుకున్నారా?
 లేదు. ముందు కథ రాసేశాను. అప్పుడు శర్వానంద్  యాక్ట్ చేసిన ‘రన్ రాజా రన్’ చూశాను. ఆ సినిమాలో చాలా కొత్త శర్వానంద్ కనిపించాడు. నా హీరో క్యారెక్టర్‌కు సూట్ అవుతాడనుకుని, ఆయనకీ కథ చెప్పాను.  వినడం, ఓకే అనడం జరిగిపోయాయి. ఆయనే యూవీ క్రియేషన్స్‌ను సజెస్ట్ చేశారు. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘జిల్’, ‘భలే భలే మగాడివోయ్’ లాంటి మంచి సినిమాలు తీసిన సంస్థ కాబట్టి, నాకు చాలా ఆనందం అనిపించింది. ఈ సంస్థతో ఎవరు చేసినా లవ్‌లో పడిపోతారు. నా నెక్స్ట్‌సినిమా కూడా యూవీ బ్యానర్‌లోనే ఉంటుంది.

‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కథేంటి?
 ఈ సినిమాలో మొత్తం  అయిదు కథలుంటాయి. ప్రతి అయిదు నిమిషాలకో ట్విస్ట్ ఉంటుంది. 15 నిమిషాలకు ఓ కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. విలన్‌గా ఊర్వశి, ‘షకలక’ శంకర్, సప్తగిరి ఇలా చాలా రకాల క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి. వాళ్ల క్యారెక్టర్స్‌కు, హీరో కథకు సంబంధం ఏంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ లవ్ స్టోరీ ఇది. చాలా యూత్‌ఫుల్‌గా ఉంటుంది. స్క్రీన్‌ప్లే హాలీవుడ్ సినిమా ‘వాంటేజ్ పాయింట్’ తరహాలో ఉంటుంది. శర్వానంద్ ఆహార్యం తన గత సినిమాలతో పోలిస్తే  కొత్తగా ఉంటుంది. శర్వానంద్ అద్భుతమైన నటుడు. బెటర్‌మెంట్ కోసం ఎన్ని టేక్స్ చేయడానికైనా వెనకాడడు. హీరో క్యారెక్టర్ చాలా స్పీడ్‌గా, స్క్రీన్‌ప్లే చాలా రేసీగా ఉంటుంది. అందుకే ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అని పేరు పెట్టాం. హీరోయిన్ సురభి పాత్ర పేరు అమూల్య. ఆమె పాత్ర కూడా చాలా బాగుంటుంది.

శర్వానంద్ చేసిన ‘రన్ రాజా రన్’, మీరు చేసిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ హిట్ కాబట్టి, ఈ రెండు చిత్రాల టైటిల్స్ కలిసొచ్చేట్లు ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అని పెట్టారా?
 అందరూ అనుకుంటున్నట్టు సెంటిమెంట్ కోసం సినిమా టైటిల్ అలా పెట్టలేదు. ఇందులో హీరో పేరు రాజా. ఆ పాత్ర చాలా రేసీగా ఉంటుంది. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అని పెట్టడానికి అదో కారణం, ఆ సౌండింగ్ బాగుండటం మరో కారణం.

 సంక్రాంతికి మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి కదా?
 సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారు.  ఈ సినిమా కంటెంట్ మీద మాకు బాగా నమ్మకముంది. అన్ని సినిమాల నడుమ ఈ సినిమా కిల్ కాదని మా ఫీలింగ్. నిర్మాతలు కూడా ఏం టెన్షన్ పడట్లేదు. వాళ్లు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మొత్తం 200పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం.

 ఇంతకీ ఈ చిత్రాన్ని ఎవరికైనా చూపించారా?
 ప్రభాస్ చూశారు. రామ్‌చరణ్ పాటలు చూశారు. ఇద్దరూ బాగా ఎంజాయ్ చేశారు.

 మీ రెండో చిత్రాన్ని సుశాంత్‌తో చేద్దామనుకున్నారు కదా. ఆ సినిమా ఏమైంది?
 సుశాంత్‌తో అనుకున్నది వాస్తవమే. కానీ వాయిదా వేశాం.

బేసిక్‌గా మీకెలాంటి సినిమాలంటే ఇష్టం?
 మా నాన్నగారు మేర్లపాక మురళి (రచయిత) రొమాంటిక్ కథలు రాయమంటారు. కానీ, నాకేమో ఎంటర్‌టైన్‌మెంట్ కథలు రాయడమే ఇష్టం. ఈ విషయం మీద మేమిద్దరం వాదించుకుంటాం కూడా. అయినా ఆయనలా నేనెంత రొమాంటిక్ సబ్జెక్ట్స్ రాయలేను. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ కూడా ఆడదని చెప్పారు. ఆ సినిమా కోసం బ్యానర్లు కట్టినప్పుడు తీసేయమన్నారు కూడా. కానీ, ఆడింది. ఈ సినిమా చూసి ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

కెరీర్ వైజ్‌గా మీరు హ్యాపీ.. పర్సనల్ లైఫ్ మాటేంటి?
 నా భార్య పేరు సుష్మ. మాది లవ్ మ్యారేజ్. ఎనిమిదో తరగతి నుంచి నాతో కలిసి చదువుకుంది. బీటెక్‌లో ప్రపోజ్ చేశాను. ఓకే చెప్పింది. హ్యాపీగా పెళ్లి చేసుకున్నాం. గత ఏడాది ఆగస్టు 15న పాప పుట్టింది. తన పేరు లిపి. పర్శనల్ లైఫ్ హ్యాపీగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement