వినోదమే... ఎక్స్‌ప్రెస్! | express raja movie review | Sakshi
Sakshi News home page

వినోదమే... ఎక్స్‌ప్రెస్!

Published Fri, Jan 15 2016 8:27 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

వినోదమే... ఎక్స్‌ప్రెస్!

వినోదమే... ఎక్స్‌ప్రెస్!

తారాగణం: శర్వానంద్, సురభి, సప్తగిరి, ‘ప్రభాస్’ శ్రీను, కెమేరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
 
ఆద్యంతం వినోదం పంచే సినిమాలకు ఆదరణ లభిస్తున్న రోజులివి. అందుకని ఎంటర్‌టైన్‌మెంటే వెండితెరకు వేదమైంది. ఆ పంథాలోనే వచ్చిన కొత్త ప్రయత్నం - ‘ఎక్స్‌ప్రెస్ రాజా’.  కథగా చెప్పాలంటే, వైజాగ్‌లో పనికిమాలిన వాడనే ముద్రపడ్డ హీరో రాజా (శర్వానంద్). అతను తండ్రి (నాగినీడు)నీ, కుటుంబాన్నీ వదిలి, హైదరాబాద్‌కొస్తాడు. అక్కడ పొట్టపోసుకుంటూ ఉంటాడు. అమూల్య అలియాస్ అమ్ము (సురభి) అతనికి తారసపడుతుంది. హీరోయిన్‌కు కుక్క లంటే ప్రేమ. హీరోకు కుక్కలంటే చీకాకు. తీరా ఆమెతో ప్రేమలో పడతాడు. మునిసిపాలిటీకి పట్టిచ్చిన హీరోయిన్ కుక్కను ప్రేమ కోసం వెనక్కి తేవడానికి బయలుదేరతాడు. హీరోయిన్‌ను పెళ్ళా డాలని సిద్ధపడే విలన్ (హరీష్ ఉత్తమన్), కుక్క బెల్ట్‌లో 75 కోట్ల విలువైన వజ్రం దాచే బినామీ బ్రిటిష్ (సుప్రీత్) - ఇలా అనేక పాత్రలు ఆ జర్నీలో ఎదురవుతాయి. హైదరాబాద్, నెల్లూరు, కావలి, ఒంగోలు మీదుగా కథ ఎటు తిరిగినా, అందరి పాట్లూ ఆ కుక్క కోసమే. చివరకు, హీరో ఆ కుక్కను తిరిగి ఎలా తెచ్చి, హీరోయిన్‌ను పెళ్ళాడాడన్నది మిగతా కథ.

ఎందుకూ పనికిరాడనుకున్న రాజా పాత్ర నుంచి హైదరాబాద్‌లో ప్రేమికురాలి ప్రేమ కోసం ‘కుక్క’పాట్లు పడే ప్రేమికుడిగా శర్వానంద్ నేచురల్ యాక్టింగ్ చేశారు. చూడముచ్చటగా ఉండే అవసరాన్ని సురభి తీర్చారు. హీరో పక్కనే ఉండే పాత్రల్లో ప్రభాస్ శ్రీను, సప్తగిరి కామెడీకి పనికొచ్చారు. దుష్టపాత్రల్ని కూడా కామెడీకి వాడుకున్నారు. ఎమ్మెల్యే కావాలని ఆశపడే నెల్లూరు కేశవరెడ్డి పాత్రలో హరీశ్ ఉత్తమన్, అతని అనుచరుడైన బినామీ బ్రిటీష్‌గా సుప్రీత్ కనిపిస్తారు. ఊర్వశి కూడా వినోదం పండించారు. చిత్ర సాంకేతిక వర్గంలో ప్రధానంగా చెప్పాల్సినది కెమేరామన్ కార్తీక్ ఘట్టమనేని ప్రతిభ. గత చిత్రాల్లానే దీనిలోనూ లైటింగ్, చిత్రీకరణ విధానాల్లో అతని ప్రతిభ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎన్నారై ప్రవీణ్ లక్క రాజు సంగీతంలో సెకండాఫ్ మొదట్లో వచ్చే పాట బాగుంది. అలాగే జాతరలో వచ్చే రికార్డింగ్ డ్యాన్‌‌స పాట, చిత్రీకరణ ఆకట్టుకుంటాయి.

తొలి చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో ఆకర్షించిన దర్శకుడు మేర్లపాక గాంధీకి ఇది రెండో ప్రయత్నం. తొలి సినిమా చూశాక, పెరిగిన అంచనాలతో ప్రేక్షకులు హాలుకీ వెళతారు. కానీ ఈసారి ఆయన కథగా కన్నా పాత్రలు, వాటి మధ్య సన్నివేశాలు, సంభాషణల మీదే దృష్టి పెట్టారు. ఇనప వస్తువుల్ని దొంగతనం చేసే ‘ఇనుము’ (ధన్‌రాజ్), చిరంజీవి లాంటి స్టార్స్‌ని అనుకరిస్తూ రికార్డింగ్ డ్యాన్స్‌లు చేసే ట్రూప్ యజమాని (‘షకలక’ శంకర్), కుక్కల్ని పట్టగల గిరి (సప్తగిరి) - ఇలా చిత్ర విచిత్రమైన అలవాట్లున్న పాత్రల్ని సృష్టించుకున్నారు. వీటన్నిటికీ మధ్య లింకుగా ‘కుక్క’ అనే కామన్ ఎలిమెంట్‌ను పెట్టుకున్నారు. పాత్రలు, జరిగే సంఘటనలన్నీ యాదృచ్ఛికంగా ఒక చోట కలగలిసిపోవడమనే స్క్రీన్‌ప్లే టెక్నిక్ అనుసరించారు. దాంతో, కథ కన్నా సంఘటనలే ఎక్కువ. కాబట్టి, ఎక్కడ నుంచి చూసినా దాదాపు కథ అర్థమవుతూనే ఉంటుంది.

ఇక, ఈ సినిమా ద్వారా తెలుగు తెరకొచ్చిన కొత్త ఆయుధం - డిక్షనరీ. హీరో హైదరాబాద్‌లో కాలేజీలు తిరిగి డిక్షనరీలమ్మే పనిలో ఉంటాడు. కాబట్టి, అందుకు అనుగుణంగా లావాటి డిక్షనరీలు చదువుకోవడానికే కాదు...విలన్‌ను గ...ట్టిగా కొట్టి, పడగొట్టడానికీ పనికొస్తాయని సినిమాలో చూపెట్టారు. జాగ్రత్త, ఓపిక ఉంటే, ఇలా రొటీన్‌కు భిన్నమైనవి సిన్మాలో చాలా వెతుక్కోవచ్చు. అందుకే, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వినోద ప్రియ ప్యాసిం జర్‌‌స మహారాజా. తెరపై కుక్కపాట్లను తీరికగా కూర్చొని, చూడాల్సిన కాలక్షేప కామెడీ.
 
 - రెంటాల జయదేవ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement