పేరున్న దర్శకుడు! పైకొస్తున్న హీరో!!
దర్శకుడిగా పరిచయమైనప్పటి ‘ఈరోజుల్లో’, తర్వాత ‘బస్‌స్టాప్’ చిత్రాలతో తనపై పడిన ముద్రను ‘భలే భలే మగాడివోయ్’తో చెరిపేసుకున్నారు మారుతి. ఆ సినిమాతో ఆయన స్థాయీ పెరిగింది. ఆ తర్వాత వెంకటేశ్‌ను ‘బాబు బంగారం’గా చూపించారు. ఇప్పుడు నాని, వెంకటేశ్ వంటి స్టార్స్‌తో కాకుండా అప్ కమింగ్ హీరో హవీశ్‌తో మారుతి సినిమా చేయాలనుకోవడం పలువుర్ని ఆశ్చర్యపరిచింది.
ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించనున్నారు. హవీశ్‌తో సినిమా చేయడానికి కారణం ఏంటని దర్శకుణ్ణి అడిగితే.. ‘‘ముందు నేనో కథ రాసుకుంటా. ఆ తర్వాత నా కథ ఏ హీరో సూటవుతుంది? ఈ కథకు ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తా. అతణ్ణే సంప్రతిస్తా. హవీశ్‌తో తీయబోయే సినిమాకి సైతం ఆ పద్ధతే పాటించా. కథకు అతనే కరెక్ట్’’ అన్నారు. ఇది రిస్కే కదా? అని ప్రశ్నిస్తే.. ‘‘వెంకటేశ్, నాని మినహా నేను పనిచేసిన వాళ్లందరూ అప్ కమింగ్ హీరోలే.
జీవితంలో ప్రయోగాలు ఎందుకు చేయకూడదనే కసి చిన్నప్పటి నుంచి ఉంది. అదే సినిమా రంగం వైపు నడిపింది. ఈ స్థాయికి తీసుకొచ్చింది’’ అన్నారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్ కథ విని చాలా ఎగ్జయిట్ అయ్యారని ఆయన చెప్పారు. కథ గురించి మారుతి మాట్లాడుతూ - ‘‘విచిత్రమైన ప్రేమకథ. రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. త్వరలో హీరోయిన్, ఇతర వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు.