ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో హాలీవుడ్ చిత్రం ఎమీ
ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో హాలీవుడ్ చిత్రం ఎమీ
Published Sun, Sep 22 2013 12:53 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
‘‘అమెరికాలో ‘అమీష్ కమ్యూనిటీ’ అని ఒకటుంది. వాళ్లు... మనుషులు కనిపెట్టిన కరెంట్, వాహనాల్లాంటివి వాడరు. ప్రకృతి సిద్ధమైనవాటినే వినియోగిస్తారు. ఈ తెగ నేపథ్యంలో చేసిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది’’ అన్నారు ఆర్పీ పట్నాయక్. సంగీత దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా తెలుగులో తన ప్రతిభ చాటుకున్న ఆర్పీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమీ. ఈ చిత్రం ద్వారా ఆయన హాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. టీపీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రసాద్ కూనిశెట్టి, రమేష్ నూతి ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 1న ఈ చిత్రం ‘వీఓడి’ (వీడియో ఆన్ డిమాండ్) ద్వారా విడుదల చేయనున్నారు.
అంటే... థియేటర్లలో కాకుండా ఇంటర్నెట్ ద్వారా విడుదల చేస్తారు. అదే రోజున ఈ చిత్రం డీవీడీ కూడా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను ఆర్పీ చెబుతూ -‘‘ఇది ఇండియన్ ఇంగ్లిష్ మూవీ కాదు. కంప్లీట్ హాలీవుడ్ మూవీ. ఇలా పూర్తి స్థాయి హాలీవుడ్ చిత్రం చేసిన తొలి తెలుగువాళ్లం మేమే’’ అని చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ కూనిశెట్టి మాట్లాడుతూ -‘‘ఈ చిత్రనిర్మాణానికి రెండేళ్లు పట్టింది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత జాన్ షీన్‌బర్గ్ ఈ చిత్రం నచ్చి, మార్కెటింగ్ చేయడానికి ముందుకు రావడం ఆనందంగా ఉంది. తెలుగులో విడుదల చేయమని చాలామంది కోరుతున్నారు. దాని గురించి తర్వాత ఆలోచిస్తాం’’ అని చెప్పారు.
Advertisement
Advertisement