
సాక్షి, హైదరాబాద్: తాను రూపొందించిన షార్ట్ ఫిలిమ్ ‘హగ్’ ఈ నెల 31 విడుదల చేయనున్నట్టు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం సాయంత్రం ట్విటర్‌లో పోస్ట్ చేశారు. సాయంత్రం 5 గంటలకు పూరి జగన్నాథ్ ఆసక్తికర ప్రకటన చేయనున్నారని ఈ రోజు ఉదయం నటి ఛార్మి ట్వీట్ చేశారు. అయితే తన కుమారుడు హీరోగా తెరకెక్కిస్తున్న మెహబూబా సినిమాకు సంబంధించిన ప్రకటన ఉంటుందని అభిమానులు అనుకున్నారు. ఊహించనివిధంగా షార్ట్ ఫిలిమ్ విడుదల తేదీని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు పూరి జగన్నాథ్.
అయితే ‘హగ్’ పోస్టర్‌పై ట్విటర్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. కామెంట్లు, ఫొటోలు, వీడియోలతో నెటిజన్లు విరుచుకుపడ్డారు. ‘మీరు కూడా రాంగోపాల్ వర్మలా తయారయ్యారు, ఆర్జీవీ ఫ్యామిలీ అంతా ఇంతే. పోస్టర్ విషయంలో మరోసారి ఆలోచించుకోండి’ అంటూ కామెంట్లు పెట్టారు. ‘హగ్’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అభిమానులు పేర్కొన్నారు. ఏదిఏమైనా పూరి జగన్నాథ్ మరోసారి సంచలనానికి తెర తీశారు.