సాక్షి, హైదరాబాద్ : హాస్యనటుడు విజయ్ సాయి మరణాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నానని దర్శకుడు రవిబాబు అన్నారు. విజయ్‌ని వెతికి పట్టుకుని, నటనలో శిక్షణ ఇచ్చి, సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది తానేనని ఆయన గుర్తు చేసుకున్నారు. సినిమా అవకాశాలు రాకనే విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రాణాంతక వ్యాది ఉందని కొందరు అంటుండటం అవాస్తవమని రవిబాబు తేల్చిచెప్పారు. మంగళవారం సాయంత్రం విజయ్ సాయి అంత్యక్రియలకు హాజరైన ఆయన కాసేపు మీడియాతో మాట్లాడారు.
అతనితో నాది మర్చిపోలేని రిలేషన్ : ‘‘విజయ్ మరణం.. షేర్ చేసుకోలేనంత బాధాకరం. అతను నాకు బేబీ లాంటివాడు. సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే. అతన్ని కనిపెట్టి, యాక్టింగ్ నేర్పించడానికి చాలా కష్టపడ్డాను. నా లైఫ్‌లో చాలా కాలం అతనితో గడిపాను. చాలామందిలో లేని క్వాలిటీ ఒకటి విజయ్‌లో ఉంది.. ఎంత బాధాకరమైన విషయాన్నైనా తను నవ్వుతూ చెప్పేవాడు. అల్లారుముద్దుగా పెంచుకున్నపిల్లలు కళ్లముందే చనిపోవడం ఏ పేరెంట్‌కైనా దారుణమైన కడుపుకోత’’ అని రవిబాబు అన్నారు.
వాళ్ల నాన్న అడిగితే పేరు మార్చాను : ‘‘తొలిసినిమా అమ్మాయిలు-అబ్బాయిలు హిట్ అయిన తర్వాత విజయ్ వాళ్ల నాన్న మా ఇంటికొచ్చారు. ఇండస్ట్రీలో రాణించేలా తన కొడుక్కి మంచి పేరు పెట్టమని అడిగారు. అప్పుడు నేను.. సాయి భగవాన్ పేరు కలిసొచ్చేలా విజయ్‌సాయి అని పేరు పెట్టాను. అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను’’ అని రవిబాబు చెప్పారు.
ఆత్మ హత్యకు ముందు సెల్ఫీ వీడియో: హాస్య నటుడు కాలే విజయ్‌సాయి(40) సోమవారం యూసుఫ్ గూడలోని సొంత ఫ్లాట్‌లో తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆత్మ హత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోలో విజయ్ మాట్లాడుతూ.. భార్య వనితతో పాటు ముగ్గురిపై ఆరోపణలు చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment