ఆనంద్, జీవిత, శివాత్మిక, సుకుమార్, ‘మధుర’ శ్రీధర్, మహేంద్ర
‘‘సినిమా రచన వేరు, దర్శకత్వం వేరు. ఈ రెండూ ఒకరే చేయడంతో ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నాం. ఇప్పుడు తెలుగు సినిమా తీరు మారింది. నిజాయతీ నిండిన కథలే ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నాయి. కొత్త దర్శకులు చాలా మంచి సినిమాలతో వస్తున్నారు’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా జీవితారాజశేఖర్‌ల కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా పరిచయమవుతోన్న చిత్రం ‘దొరసాని’. కె.వి.ఆర్. మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
‘మధుర ’ ఎంటర్‌టైన్మెంట్, బిగ్ బెన్ బ్యానర్స్‌పై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ని సుకుమార్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నిషీధి’ అనే షార్ట్ ఫిల్మ్‌తో శ్యామ్ బెనగల్ నుండి ప్రశంసలు పొందాడు కె.వి.ఆర్. మహేంద్ర. దర్శకుడిగా అతని అభిరుచి ఏంటో ‘దొరసాని’ ట్రైలర్ చెబుతోంది. ఈ కథలో అంతా నిజాయతీనే కనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు.
‘‘కథ విన్నప్పడు నాకు కలిగిన ఫీల్‌ని తెరమీదకు వందశాతం తెచ్చాడు మహేంద్ర. ఎడిటర్ నవీన్ నూలి మినహా దాదాపుగా అందరూ కొత్త వాళ్లతోనే ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్ రెడ్డి. ‘‘ఈ సినిమాలో ఏ ఎమోషన్ ఫేక్‌గా అనిపించదు. ఇందులో ఒక వాస్తవికత, స్వచ్ఛత ఉంది. 1980దశకాల్లో నడిచే ప్రేమ కథ ఇది’’ అన్నారు కె.వి.ఆర్ మహేంద్ర. ‘‘ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇద్దరు కొత్త వాళ్లు చేశారనిపించడం లేదు. సామాజిక పరిస్థితులకు అద్దం పట్టే ఇలాంటి కథలు తప్పకుండా ఆలోచనలో మార్పును తెస్తాయి’’ అన్నారు నిర్మాత దొరస్వామి రాజు.
‘‘మా ఇంట్లో అంతా సినిమా వాతావరణమే. నా కుటుంబం నాకు ఒక పెద్ద ఫ్యామిలీ (సినిమా ఇండస్ట్రీ, అభిమానులు)ని ఇచ్చింది అని ఈ సినిమా చేస్తున్నప్పుడు తెలిసింది’’ అన్నారు శివాత్మిక. ‘‘అమెరికాలో ఉద్యోగం చేసేవాణ్ణి. ‘పెళ్ళి చూపులు’ ట్రైలర్ లాంచ్ రోజు ఆఫీస్‌కి వెళ్లకుండా రూమ్‌లో ఉన్నా. ట్రైలర్ లాంచ్‌లో విజయ్ మాట్లాడేది చూసి ఆనందంతో కన్నీళ్లొచ్చాయి. అన్నయ్యను సపోర్ట్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్, మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్ బెన్ ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నాయి’’ అని ఆనంద్ దేవరకొండ చెప్పారు. ‘‘చాలా మంచి ప్రేమకథ ఇది. శివాత్మిక, ఆనంద్‌లకు ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు జీవిత. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని.
Comments
Please login to add a commentAdd a comment