
నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఫాంలోకి వచ్చిన దర్శకుడు తేజ, ఆ సినిమా తరువాత సీనియర్ హీరోల మీద దృష్టి పెట్టాడు. తనకు స్టార్ హీరోలతో సినిమాలు చేయటం రాదంటూనే వరుసగా స్టార్ హీరోల పేర్లు తెర మీదకు తెస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి తరువాత సీనియర్ హీరో వెంకటేష్‌తో ఓ సినిమాను ప్రారంభించాడు తేజ. ఆ సినిమాకు సంబంధించి వెంకటేష్ లుక్ కూడా బయటకు వచ్చింది.
ఈ లోగా నందమూరి బాలకృష్ణ ప‍్రధాన పాత్రలో ఎన్టీఆర్ (బయోపిక్) ప్రారంభం కావటంతో వెంకటేష్ సినిమాకు బ్రేక్ పడింది. కానీ తాను ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌ను ఆశించిన స్థాయిలో తీర్చిదిద్దలేనన్న భావనతో బయోపిక్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు తేజ. వెంకటేష్ సినిమా ఆగిపోవటం, ఎన్టీఆర్ సినిమా నుంచి తానే తప్పుకోవటంతో ఇప్పుడు మరో సీనియర్ హీరోతో సినిమా చేయాలని భావిస్తున్నాడట ఈ క్రియేటివ్ డైరెక్టర్.
కింగ్ నాగార్జున హీరోగా ఓ సినిమా చేయాలని తేజ ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ సినిమాను పూర్తి చేసిన నాగ్, ప్రస్తుతం యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కావటానికి కాస్త సమయం పడుతుంది. మరి అప్పటి వరకు తేజ వెయిట్ చేసి నాగ్‌తో సినిమా చేస్తాడా..? లేక మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లోకి తీసుకువస్తాడా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment