సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి అందాల నటుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఇటీవల ఈ సినిమా షూటింగ్ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తండ్రి ఎన్టీఆర్ తరహాలో దుర్యోధనుడి వేషం ధరించిన సీన్లను షూటింగ్ ప్రారంభం సందర్భంగా తెరకెక్కించారు. అంతా సజావుగా జరుగుతుందనుకున్న సమయంలో ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి దర్శకుడు తేజ తప్పుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌ను తాను తెరకెక్కించడం లేదని ఆయన వెల్లడించారు.
ఎన్టీఆర్ జీవితాన్ని ఎలా చూపించాలి? ఎక్కడి నుంచి ఎక్కడివరకు ఆయన జీవితాన్ని తెరకెక్కించాలి? అనే విషయాల్లో బాలకృష్ణకు, దర్శకుడు తేజకు మధ్య విభేదాలు వచ్చాయని, స్క్రిప్ట్ విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఈ సినిమాకు బ్రేక్ పడిందనే భావిస్తున్నారు. కొత్త దర్శకుడిని రంగంలోకి తీసుకొచ్చేవరకు ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణం నిలిచిపోనుంది. మొత్తానికి తేజ మీడియా ముందుకు వస్తే తప్ప అసలు ఆయన ఎందుకు సినిమా నుంచి తప్పుకున్నారో తెలిసే అవకాశముందని అంటున్నారు.
క్రిష్, రాఘవేంద్రరావుకు పిలుపు!
మార్చి 29న తెలుగు దేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామకృష్ణ స్టూడియోలో ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ క్యారెక్టర్ విషయంలో తేజ సూచనలు బాలకృష్ణకు నచ్చకపోవడం తోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. కథ ఎంతో బాగా వచ్చిందని, అయినప్పటికీ, సినిమాకు న్యాయం చేయలేనని పేర్కొంటూ తేజ తపుకున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. తేజ తప్పుకున్న నేపథ్యంలో సీనియర్ దర్శకుడు కే. రాఘవేంద్రరావుకు, డైరెక్టర్ క్రిష్‌కు పిలుపు అందినట్టు సమాచారం. మే నెలలో 15 రోజులు షూటింగ్ చేయాలి అని బాలకృష్ణ పట్టుబడుతున్నట్టు సమచారం. బాలీవుడ్ సినిమా ‘మణికర్ణిక’ షూటింగ్‌లో క్రిష్ బిజీగా ఉండటంతో.. ఎన్టీఆర్ బయోపిక్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ రాఘవేంద్రరావుకు దక్కవచ్చునని అంటున్నారు. వీరిద్దరు కుదరకపోతే స్వీయ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించాలని బాలకృష్ణ భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment