
సాక్షి, న్యూఢిల్లీ : బాఘీ జోడీ దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు డేటింగ్‌లో ఉన్నారని కొద్దికాలంగా ప్రచారం సాగుతున్నా దీనిపై వీరిద్దరూ ఇంతవరకూ నోరుమెదపలేదు. దిశా, టైగర్‌లు కలిసి పలు సందర్భాల్లో కెమెరాల కంటపడుతూనే ఉన్నారు. వీరిద్దరూ ఈ ఏడాది జనవరి 1న శ్రీలంకలో ఉంగరాలు మార్చుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే టైగర్ ష్రాఫ్‌తో తన అనుబంధంపై దిశా పటానీ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
తాను తన జీవితాన్ని వీలైనంత వరకూ వ్యక్తిగత విషయంగా చూస్తానని, తాను ఏది ప్లాన్ చేసినా దాన్ని బహిరంగంగా పంచుకోనని కుండబద్దలు కొట్టారు. అది ఇల్లయినా, కారయినా, జీవితమైనా ఏదైనా వాటిని ప్రైవేటు అంశాలుగానే పరిగణిస్తానని స్పష్టం చేశారు.
టైగర్ ష్రాఫ్ తనకు మంచి స్నేహితుడని, తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాడని చెప్పుకొచ్చారు. టైగర్ పాటించే నియమాలు, పని పద్ధతులు ప్రతిఒక్కరికీ స్ఫూర్తినిస్తాయని ప్రశంసించారు. టైగర్ అందరికీ ఆదర్శప్రాయుడుని కితాబిచ్చారు. ఇక సినిమాల పరంగా దిశా పటానీ సల్మాన్ ఖాన్‌కు జోడీగా భరత్‌లో నటించనుంది.