
భవిష్యత్తులో పెళ్లిళ్లు ఉండవు! - పూరి జగన్నాథ్
‘‘మగాడు, ఆడది ఇద్దరూ ఒకరు లేకుండా ఒకరు బతకలేరు. ఇద్దరూ కలిసి అస్సలు బతకలేరు. అందుకే ఇక భవిష్యత్తులో పెళ్లిళ్లు అనేవి ఉండవు. ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. నందు, ఐనెకా సోటీ జంటగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘365 డేస్’. డీవీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంక టేశ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు.
రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ- ‘‘ఒక జంట భావోద్వేగాల ఆధారంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే రాసుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నా అభిప్రాయాన్నే రాశాను. చాలా మంది అడుగుతూ ఉంటారు.. నీ పెళ్లి ఎందుకు ఫెయిలైందని. నా సమాధానం ఒక్కటే . నాకు మంచి భార్య దొరికింది. నా భార్యకు మాత్రం చెడ్డ భర్త దొరికాడు. అదే కారణం. ఇది నాకెంతో ప్రత్యేకమైన సినిమా. ఎలాంటి క్రైమ్ లేని చిత్రం’’ అన్నారు. ఈ వేడుకలో రామ్‌గోపాల్‌వర్మ తల్లి సూర్యవతి, వీవీ వినాయక్, కోన వెంకట్, చార్మి, నందు, అనైకా సోటీ, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.