'ఐటమ్ నంబర్ అని పిలవకండి'
సినిమాల్లో డ్యాన్సులను 'ఐటమ్ నంబర్' అని పిలవకండి అంటూ మండిపడుతోంది అందాలతార అదితి రావ్. 'ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా' లో తను చేస్తున్న పాట గురించి విలేకరులు ప్రశ్నించగా అమ్మడు అంతెత్తున విరుచుకుపడింది. 'నేను దాన్ని ఐటమ్ నెంబర్ అని అనుకోను. అయినా 2016లో కూడా ఎవరైనా అలా అంటారని నేననుకోను. ఇంకా ప్రత్యేక డ్యాన్సులను ఐటమ్ నంబర్ అని అంటున్నారంటే అది నిజంగా బాధాకరం. ఐటమ్ సాంగ్ అంటున్నారంటే ఆ పాటలో డ్యాన్స్ చేసే అమ్మాయిని ఐటమ్ గా వర్ణిస్తున్నట్టేగా' అంటూ ప్రశ్నించింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. మాధురీ దీక్షిత్ డ్యాన్స్ చేస్తే ఆమెను డ్యాన్సర్ అని అనాలి గానీ, ఐటమ్ అని అనరు కదా. ఏదైనా మన ఆలోచనా విధానం మీద ఆధారపడి ఉంటుందంటూ చురకలంటించింది. రెండేళ్ల క్రితమే రిలీజ్ అవ్వాల్సిన 'ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా' ఎట్టకేలకు వచ్చేవారం విడుదలకు సిద్ధమైంది. సినిమా అందరికీ నచ్చుతుందంటూ అదితి ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా ఆమె మణిరత్నం తదుపరి చిత్రం ‘కాట్రు వెళియిడై’లో కార్తీ సరసన నటిస్తోంది.