‘‘అందరి అమ్మాయిల్లాగే ఆ అమ్మాయికి జీవితంపై మంచి కలలు, ఆశలు, కోరికలు ఉంటాయి. సోషల్ మీడియా కారణంగా ఆ అమ్మాయి జీవితం ఎలా మారింది? అన్నదే ‘దొంగోడొచ్చాడు’ కథాంశం’’ అని కథానాయిక అమలాపాల్ అన్నారు. బాబీ సింహా, అమలాపాల్, ప్రసన్న ముఖ్య పాత్రల్లో ‘మల్లన్న’ ఫేమ్ సుశీ గణేశన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘తిరుట్టుపయలే 2’. కల్పాతి ఎస్.అఘోరమ్ సమర్పణలో కల్పాతి ఎస్. అఘోరమ్, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలు. ఈ సినిమాని ‘దొంగోడొచ్చాడు’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకరులతో మాట్లాడారు. అమలాపాల్ మాట్లాడుతూ– ‘‘చాలారోజుల తర్వాత మళ్లీ టాలీవుడ్‌కి రావడం హ్యాపీ.
సుశీగారితో ఏడాదికి ఒక సినిమా అయినా చేయాలనుంది. ఆయనతో సినిమా చేస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. విద్యాసాగర్‌తో మలయాళంలో పనిచేసిన రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘సోషల్ క్రైమ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. తమిళంలో ఈ సినిమా నవంబర్ 30న విడుదలవుతోంది. డిసెంబరు రెండో వారంలో తెలుగులో విడుదలవుతుంది’’ అన్నారు బాబీ సింహా. ‘‘అవకాశం రావాలే కానీ.. ప్రతి ఒక్కరిలో ఓ దొంగోడు ఉంటాడు. అలాంటి మనిషి నైజాన్ని చూపించే సినిమా ఇది’’ అన్నారు సుశీ గణేశన్. నటుడు ప్రసన్న, సంగీత దర్శకుడు విద్యాసాగర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment