పర్సనల్ విషయాలు అడగొద్దు
నన్ను నటుడు ధనుష్‌ను చాలా టార్చర్ పెట్టారని నటి అమలాపాల్ అంటోంది. మైనా చిత్రంతో ఒక్కసారిగా కోలీవుడ్‌లో ప్రాచుర్యం పొందిన ఈ కేరళ కుట్టి అతి కొద్ది కాలంలోనే తమిళనాటి కోడలైంది. అంతే వేగంగా ఆ బంధాన్ని తెగ తెంపులు చేసుకుని కేరళకు తిరుగు టపా కట్టింది. నటిగా మాత్రం తమిళ సినిమాలనే ఎక్కువగా నమ్ముకున్న అమలాపాల్‌పై ప్రచారం అవుతున్న వదంతులు ఇటీవల ఏ నటిపైనా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ బ్యూటీ ధనుష్‌తో రొమాన్స్ చేసిన తాజా చిత్రం వీఐపీ–2 ఈ నెల 11వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా అమలాపాల్ భేటీ చూద్దాం.
⇒ నటుడు ధనుష్‌తో వరుసగా నటిస్తున్నారే?
♦ మీరలా అంటున్నారు గానీ, నేను అలా అనుకోవడం లేదు. ధనుష్‌కు జంటగా తొలిసారిగా వేలైఇల్లా పట్టాదారి చిత్రంలో నటించాను. ఆ తరువాత ఆయన నిర్మించిన అమ్మాకణక్కు చిత్రంలో నటించాను. ఇప్పుడు వీఐపీ 2లో నటించాను. ఆ మధ్య వడచెన్నై చిత్రంలో నటించే అవకాశం వచ్చినా కాల్‌షీట్స్ సమస్య కారణంగా అంగీకరించలేకపోయాను. నిజం చెప్పాలంటే ధనుష్‌తో నటిస్తే నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ఆయన చాలా హార్డ్ వర్కర్. ఏ పని చేసినా దానిపై చాలా క్రేజీగా ఉంటారు. నటించేటప్పుడు చాలా మోటివేషన్‌గా ఉంటారు. చాలా స్వీట్ పర్సన్. నాకు మంచి ఫ్రెండ్. నటనలో నాకు ధనుష్‌కు మధ్య పోటీ ఉంటుంది. అది ఆరోగ్యకరంగా ఉంటుంది.
⇒ మీ వ్యక్తిగతం గురించి జరుగుతున్న ప్రచారం గురించి?
♦ సారీ. నా పర్సనల్ విషయాల గురించిన ప్రస్థావన వద్దు. అదంతా ముగిసి పోయిన కథ. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం నాకిష్టం లేదు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా బాధ పడను.
⇒ కోలీవుడ్‌లోకి నటిగా రంగప్రవేశం చేసి ఆపై తమిళనాట కోడలయ్యారు. ఇప్పుడు మళ్లీ కేరళాకెళ్లి పోయారు.మళ్లీ చెన్నైలో మకాం పట్టే అవకాశం ఉందా?
♦ మీరే అర్థంతో ఆ ప్రశ్న అడిగారో నాకర్థం కాలేదు. అయితే నేను మళ్లీ చెన్నైలో సెటిల్ అవ్వలేను. చెన్నైలో షూటింగ్ ఉంటే మాత్రం నేను ఎప్పుడూ ఉండే అపార్ట్‌మెంట్‌లోనే బస చేస్తున్నాను. ఇక చెన్నైలో సొంతంగా నివాసమేర్పచుకునే ఆలోచన లేదు.
⇒ సుశీ లీక్స్ విషయంలో ఏమైంది? ధనుష్‌తో కలుపుతూ మీపై వదంతులు వరదలా ప్రచారం అవుతున్నాయి?
♦ నిజంలేని ప్రచారానికి నిలకడ ఉండదు. ఎంత వేగంగా వచ్చాయే అంతగా గాలిలో కలిసి పోతాయి. నిజం చెప్పాలంటే గాయనీ సుచిత్ర నాకు మంచి స్నేహితురాలు. తను నేను కలిసి యోగా చేశాం. సుచిత్ర భర్త కార్తీక్‌కుమార్‌తో కలిసి నేను దైవతిరుమగళ్ చిత్రంలో నటించాను.అలాంటి అనూహ్యంగా నాపై వదంతులు ప్రచారం అయ్యాయి. ఆరా తీస్తే సుశీలీక్స్ విషయంలో సుచిత్రకు సంబంధం లేదని తెలిసింది. ఎవరో ఆమె పేరును మిస్ యూజ్ చేశారు. ఈ విషయంలో నన్ను,నటుడు ధనుష్‌ను చాలా టార్చర్‌కు గురి చేశారు. మా గురించి ఏదో వీడియో వస్తుందని అన్నారు. అది ఇంకా ప్రసారం కాలేదని చాలా బాధగా ఉంది.
⇒ మళ్లీ పెళ్లి ఆలోచన ఉందా?
♦ ఇప్పుడు ఆ విషయం గురించి అవసరమా? నేను చదువుకునేటప్పుడు నటినవుతానని ఊహంచలేదు. నటి అయిన తరువాత ఒకరిని ప్రేమిస్తానని అనుకోలేదు. ప్రేమించినప్పుడు పెళ్లి జరుగుతుందని భావించలేదు. ఆ తరువాత అందరకీ తెలిసిందే. నా జీవితం గురించి నేనెలాంటి ప్లాన్ చేసుకోలేదు. అంతా అలా జరిగిపోయింది.అందువల్ల ఇకపై కూడ భవిష్యత్తు గురించి చింత లేదు. రేపేం జరుగుతుందో తెలియదు.ఈ రోజేమి జరుగుతుందో అదే నిజం. నేనూ అదే చూస్తాను.